శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

- July 20, 2022 , by Maagulf
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

కొలంబో: శ్రీ‌లంక కొత్త అధ్య‌క్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నిక‌య్యారు. గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా చేయ‌డంతో ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే కొన్ని రోజులుగా తాత్కాలిక అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. విక్రమసింఘే అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌రిగింది. పార్ల‌మెంటులో మొత్తం 225 మంది సభ్యులు ఉంటారు. దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్‌లో ఎన్నిక జరగడం చ‌రిత్ర‌లో ఇది మొద‌టిసారి. ఇంతవరకు ప్రజలే ప్రత్యక్షంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జ‌రిగింది. అధికార పార్టీ ఎస్ఎల్పీపీ స‌భ్యులు పార్ల‌మెంటులో అధికంగా ఉండ‌డం, వారు విక్రమసింఘేకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆయ‌న గెలిచారు. శ్రీలంక ఎనిమిద‌వ‌ అధ్యక్షుడిగా ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. అధ్య‌క్ష ఎన్నిక బ‌రిలో నిలిచిన‌ దుల్లాస్‌ అలహప్పెరుమ, అనుర డిసానాయ‌కె పెద్దగా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.

విక్ర‌మ‌సింఘే అధ్యక్షుడిగా 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగుతారు. అయితే, విక్రమసింఘేకు వ్యతిరేకంగా శ్రీ‌లంక‌లో ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. విక్రమసింఘేను అధ్యక్షుడిగా ప్ర‌జ‌లు వ్యతిరేకిస్తున్నారు. ఆందోళ‌న‌లు ఉద్ధృత‌మైతే మ‌ళ్ళీ శ్రీ‌లంక‌లో పరిస్థితులు అదుపుతప్పే ప్ర‌మాదం ఉంది. కొలంబో వ్యాప్తంగా ఆర్మీ భద్రత పెంచింది. శ్రీ‌లంక‌లో విక్రమసింఘే ఇప్ప‌టికే ఎమర్జెన్సీ విధించారు. శ్రీ‌లంక‌ విపక్ష నేత సజిత్ ప్రేమదాస ప్రధాని అయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com