వాజ్‌పేయికి నివాళి అర్పించిన ఏపీ గవర్నర్

- August 16, 2022 , by Maagulf
వాజ్‌పేయికి నివాళి అర్పించిన ఏపీ గవర్నర్

విజయవాడ: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన లెజెండరీ లీడర్ వాజ్ పేయి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అటల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజనీతిజ్ఞుడన్నారు. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలు, ఇతర ప్రధాన నగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు ఏర్పాటు చేసి వాటిని గ్రామీణ ప్రాంత రహదారులతో సైతం అనుసంధానం చేసారన్నారు.  గ్రామీణ ప్రాంత ప్రజలు నగరాలకు వలస వెళ్లకుండా అక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న భావనతో అనేక పథకాలు అమలు చేశారన్నారు. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అమెరికా, రష్యాలతో స్నేహాన్ని కలిగి ఉండటం ఆయన రాజనీతిజ్ణతకు నిదర్శనమని కొనియాడారు.  1972 నుంచి ఆయన మృతి చెందే వరకు ఒడిశాలో పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా వివిధ హోదాల్లో వాజ్ పేయి నాయకత్వంలో పని చేసే భాగ్యం తనకు లభించిందని గవర్నర్ పేర్కొన్నారు. 

అభివృద్ది చెందిన దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలు అణుపరీక్ష చేయకూడదని నిర్ణయించిన తరుణంలో ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పోఖ్రాన్‌లో అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించడంతో భారత్‌కు గొప్ప గుర్తింపు వచ్చిందని గౌరవ హరిచందన్ అన్నారు. భారతదేశం అణుశక్తిగా మారిందని, ఏ దేశంపై దాడి చేయాలనే కోరిక తనకు లేదని, ఇప్పుడు భారతదేశంపై దాడి చేయడానికి ఏ దేశం ధైర్యం చేయలేదని వాజ్‌పేయి ప్రపంచానికి ధైర్యంగా ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. ఆయన తీసుకున్న దృఢమైన వైఖరికి విస్మయానికి గురైన పెద్ద శక్తులు చివరికి లొంగిపోయాయని, అమెరికా నుండే సందర్శన కోసం తొలి ఆహ్వానం అందిందన్నారు. 24 పార్టీల మద్దతుతో తాను దేశానికి ప్రధాని కావడం, భాగస్వామ్య పక్షాలను ఒకచోట చేర్చి ప్రభుత్వాన్ని నడిపగలగటం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. స్వంత వనరులతో మనదైన స్వంత దేశాన్ని నిర్మించుకోవాలని వాజ్‌పేయి భావించేవారన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌, ఉపకార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com