సౌరవ్ గంగూలీ, జై షాకి సుప్రీంకోర్టు ఊరట..

- September 14, 2022 , by Maagulf
సౌరవ్ గంగూలీ, జై షాకి సుప్రీంకోర్టు ఊరట..

న్యూ ఢిల్లీ: బీసీసీఐలో కీలక పదవుల్లో ఉన్న జై షా, సౌరవ్ గంగూలీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాళ్లు తమ పదవుల్లో తిరిగి కొనసాగేందుకు అనుమతించింది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా జై షా కొనసాగేందుకు బీసీసీఐ ఆ సంస్థలో తీసుకొచ్చిన సంస్కరణల్ని సుప్రీంకోర్టు ఆమోదించింది.

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. బీసీసీఐ లేదా రాష్ట్ర స్థాయి అసోసియేషన్లలో వరుసగా రెండుసార్లు పదవి చేపట్టడానికి అవకాశం లేదు. మూడేళ్ల పదవీ కాలం (ఒక టర్మ్) పూర్తయ్యాక తిరిగి ఒక టర్మ్ పదవికి దూరంగా ఉండాలి. దీన్ని కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు. కానీ, ఈ చట్టంలో మార్పులు తెస్తూ తమ రాజ్యాంగంలో బీసీసీఐ సంస్కరణలు తెచ్చింది. కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వరుసగా రెండోసారి కూడా బీసీసీఐలో పదవులు చేపట్టొచ్చు. దీంతో జై షా, సౌరవ్ గంగూలీ తిరిగి తమ పదవుల్లో కొనసాగవచ్చు. నిజానికి ఈ నెలతోనే వారి పదవీ కాలం పూర్తైంది. అయితే, తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తిరిగి వీరిద్దరూ అదే పదవుల్లో కొనసాగే అవకాశం దక్కింది.

ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ తీసుకొచ్చిన సంస్కరణల్ని ఆమోదించాలని కోరుతూ 2020 ఏప్రిల్‌లోనే బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోవిడ్ కారణంగా విచారణ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ, అక్టోబర్ 2019లో బాధ్యతలు స్వీకరించారు. వచ్చే అక్టోబర్‌తో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. కానీ, సుప్రీ తీర్పు నేపథ్యంలో ఆయన మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com