ఇరాన్‌లో 31 మంది మృతి

- September 23, 2022 , by Maagulf
ఇరాన్‌లో 31 మంది మృతి

టెహ్రాన్: హిజాబ్‌ విషయమై మహిళల నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వేర్వేరుచోట్ల భద్రతా దళాల తూటాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెగి పలుచోట్ల పోలీస్‌ స్టేషన్లను తగులబెట్టారు. నిరసనల వీడియోలు వైరల్‌ అవుతుండటంతో ఇంటర్‌నెట్‌ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌పై గత ఏడాది నుంచే నిషేధం అమలులో ఉంది. హిజాబ్‌ సక్రమంగా ధరించలేదంటూ గత వారం మహ్సా అమిని (22) అనే యువతి మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో భగ్గుమన్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ‘హిజాబ్‌ మాకొద్దు... స్వేచ్ఛా, సమానత్వం కావాలి’ అని నినదిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలు చేస్తున్నారు.

జుట్టు కత్తిరించుకుంటూ, స్కార్ఫ్‌లు తగులబెడుతూ చేస్తున్న ఆందోళనల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నిరసనలు 30 నగరాలకు వ్యాపించాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో నిరసనకారులను అరెస్టు చేశారు. ఇక, ఐక్యరాజ్య సమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ ఇరాన్‌లో హక్కుల కోసం పోరాడుతున్న మహిళల వెంట నిలబడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com