విద్యుత్ షాక్ ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా

- November 02, 2022 , by Maagulf
విద్యుత్ షాక్ ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా

అమరావతి: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.

మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్.

బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది ప్రభుత్వం.

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పంట కోత పనులకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగింది. ఘటన స్థలం మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబసభ్యులు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com