వాయు కాలుష్యం కట్టడికి ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం

- November 05, 2022 , by Maagulf
వాయు కాలుష్యం కట్టడికి ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణకు ఆప్ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డీజిల్ వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు మినహా, మిగతా డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని ఢిల్లీ రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్ జీ వాహనాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా, అత్యవసర వస్తువులను సరఫరా చేసే వాహనాలకూ ఆంక్షలు వర్తించవని వివరించారు. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలకు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ప్రజా రవాణా కోసం 1000 సీఎన్ జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. కాలుష్య నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులను తరలించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు మంత్రి కైలాష్ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com