నిజాయితీ ఉంటే.. న్యాయవిచారణకు లేఖ రాయండి: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
- November 07, 2022
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘ఫాం హౌజ్ వీడియో’ వివాదంలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా కేసును సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పజెబితే తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు.
వివాదం మొదలైన మరుక్షణమే నిజానిజాలు తేలేందుకు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా, ముఖ్యమంత్రి పీఠం స్థాయి దిగజార్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల, అమరుల ఆకాంక్షాలను పూర్తిచేయాలన్న సత్సంకల్పం ఉన్న ఎవరినైనా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమన్న కిషన్ రెడ్డి.. ఇందుకోసం తమ పార్టీ కొన్ని విధానాలతో ముందుకెళ్తోందన్నారు. రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోకి తీసుకునే విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామన్నారు.
స్వామీజీలు, పార్టీతో సంబంధం లేని వ్యక్తుల సహాయంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని, తెలంగాణ బీజేపీలో చేరికల కోసం ప్రత్యేకమై కమిటీ ఏర్పాటుచేసుకుని.. నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే అవకాశం ఇచ్చేలా నిబంధనలు పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు.
ప్రభుత్వాలను కూలదోసే ఆలోచన తమది కాదని, షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసి.. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగి విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నలుగురు ఆర్టిస్టులను కూర్చోబెట్టి వీడియో రికార్డింగ్ చేసి ఇది అన్యాయం, అక్రమం అని గోలచేస్తే.. నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తే కేసీఆర్, ఆయన కుటుంబ మరింత దిగజారడం ఖాయమన్నారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పింది చూస్తుంటే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
‘మేం తప్పుచేశామన్న ఆధారాలుంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తే చాలు. నిజానిజాలు ప్రజలకు తెలిసిపోతాయి. అంతే తప్ప.. నాకు అన్యాయం జరిగింది. నన్ను కాపాడండి అని పెడబొబ్బలు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎవరో ఒకరు అమిత్ షా గారితో ఫొటో దిగాడని.. ఆయనకు కేంద్రానికి సంబంధం ఉందని అర్థరహితమైన విమర్శలు ముఖ్యమంత్రి పీఠానికి శోభనివ్వవని ఆయన అన్నారు.
‘న్యాయ విచారణకు ఆదేశించరు. సీబీఐ విచారణ జరగకుండా దొడ్డిదారిన జీవోలు విడుదల చేస్తారు. 2014 నుంచి రాష్ట్రంలో ఎన్ని పార్టీల గొంతు నొక్కారో కేసీఆర్ మరిచిపోయారా? రాజీనామాలు చేయించకుండానే పార్టీలో చేర్చుకుని మంత్రిపదవులు ఇచ్చిన విషయం ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు. ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలు మానుకోండి’ అని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ లో చెప్పులేయించిన వ్యక్తి (కేసీఆర్) ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ‘బాధగా ఉంది’, ‘దుర్మార్గం’, ‘ఆషామాషీ వ్యవహారం కాదు’, హేయమైన చర్య, విశృంఖలంగా, వంటి పదాలు వాడగానే.. ప్రజలు అబద్ధాలను కూడా నమ్మేస్తారనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదన్నారు.
ధర్నాచౌక్ మూసేస్తే.. ప్రజలు పోరాడి మళ్లీ తమ నిరసన తెలిపేందుకు అవసరమైన స్థలాన్ని పొందిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కల్వకుంట్ల కుటుంబ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలు అపహాస్యం పాలవుతున్నాయని ఆయన అన్నారు.
కేసీఆర్ బెదిరింపులు, దబాయింపులకు భయపడే ప్రసక్తేలేదని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ను 2023లో ఓడించే బాధ్యతను తెలంగాణ ప్రజలు నెత్తినెత్తుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు, తెలంగాణ ప్రజలు మన ఆడబిడ్డలు కేసీఆర్ పాలన పట్ల విసిగి వేసారి పోయారని కిషన్ రెడ్డి అన్నారు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









