'జి-20'కి సహకరించండి : అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ
- December 05, 2022
న్యూఢిల్లీ: జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించింది. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో దాదాపు 50 నగరాల్లో 200కుపైగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలు పలు సూచనలు చేశాయి. తొలుత విదేశాంగ మంత్రిత్వ వాఖ ఏడాది పాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ జి20 ప్రెసిడెన్సీలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 'ఇది దేశానికి లభించిన గౌరవం. ఒక పార్టీ లేదావ్యక్తికి కాదు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. దీనిని విజయవంతం చేయడానికి మనమందరం సహకారంతో పని చేద్దాం' అని ఆయన అన్నారు.
దేశ ప్రయోజనాలకు వినియోగించాలి : ఖర్గే
ప్రతిష్టాత్మకమైన జి-20 అధ్యక్ష పదవిని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ సాధనతో పాటు, ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఉగ్రవాదానికి కొన్ని దేశాలు ఇస్తున్న మద్దతును ఈ సమావేశాల్లో లేవనెత్తాలన్నారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోయిన వారిని స్వదేశం రప్పించేందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలన్నారు.
ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతాం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి తమకుఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. . ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్ని రకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన నేపథ్యంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. అంతర్జాతీయ సమాజం దేశం వైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని పరిమితం చేసుకుని జి-20 సదస్సు విజయవంతం చేయడానికి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
25 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ కావాలి : చంద్రబాబు
జి-20 సదస్సు సందర్భంగా దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలని టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో ఇండియా నంబర్ వన్ దేశంగా అవతరిస్తుందని చెప్పారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలమని, వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన జరగాలని అన్నారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడంతో అత్యుత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు.
పూర్తి సహకార్ణం : ఎంకె స్టాలిన్
డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ దేశం దశాబ్దాలుగా ఒక ప్రత్యేకమైన అలీన విధానాన్ని విదేశాంగ విధానంగా కలిగి ఉందని చెప్పారు. ఆ విధానమే ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోందన్నారు. జి20 ప్రెసిడెన్సీకి ప్రపంచ దక్షిణాదికి వాయిస్‌గా నిలబడటం తమ వంతు బాధ్యతని చెప్పారు. అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడానికి ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వివిధ రంగాలకు సంబంధించిన జి-20 సమావేశాలను నిర్వహించడంలో తమిళనాడు తన పూర్తి మద్దతు, సహకారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మమతా బెనర్జీ (టిఎంసి), నవీన్ పటాుయక్ (బిజెడి), ప్రేమ్‌సింగ్ తమాంగ్ (ఎస్‌కెఎం), ఏక్‌నాథ్ షిండే (శివసేన-షిండే), జోరంతంగా (ఎంఎన్‌ఎఫ్), పలనిస్వామి (అనాుడిఎంకె), కె.ఎం. కాదర్ మొహిదీన్ (ఐయుఎంఎల్), పసుపతి కుమార్ పారస్ (ఆర్‌ఎల్‌జెపి), రాందాస్ అథ్వాలే (ఆర్‌పిఐ), హనుమాన్ బెనివాల్ (ఆర్‌ఎల్‌పి), కెఎం మణి (కెసి), తిరుమవలన్ (విసికె), హౌం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







