బాసరలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలు

- December 08, 2022 , by Maagulf
బాసరలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలు

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బాసర ఆలయం ఒకటి. చిన్నారులకు అక్షరాభ్యాసం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తొలుత బాసర సరస్వతీ ఆలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడ సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలకోసం చిన్నారులతో వారి తల్లిదండ్రులు బారులుతీరుతారు. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేయించడం ద్వారా తమ పిల్లలు గొప్ప చదువులు అభ్యసిస్తారని భక్తుల నమ్మకం. అయితే, దూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వారి పిల్లలచే అక్షరాభ్యాసం చేయించాలన్నా వారికి సాధ్యంకాని పరిస్థితి. ఈ క్రమంలో వారి కోరికను నెరవేర్చేందుకు బాసర ఆలయంలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుడుతున్నారు.

ఈ నేపథ్యంలో టికెట్ల ధరలను నిర్ణయించారు. దేశంలో నివసిస్తున్న వారితో పాటు విదేశాల్లో ఉన్నవారుకూడా ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే వారికి పూజచేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. టికెట్ ధరలు చూస్తే.. విదేశీయులకు రూ. 2,516, మన దేశంలో ఉన్నవారికి రూ. 1,516 గా నిర్ణయించినట్లు సమాచారం. ప్రధానంగా ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యం కావడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు. భక్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్ లైన్ లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని ఏవిధంగా చేయాలి తదితర అంశాలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈవో విజయరామారావు చర్చించారు.

ఈ మేరకు ధరలను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ధరల ఆమోదంకోసం కమిషనర్ కు లేఖ రాశారు.అనుమతి రాగానే ఆన్ లైన్ లో అక్షరాభ్యాసాలు, సరస్వతీపూజ, మూలా నక్షత్రం, వేద ఆశీర్వచనం పూజలను కూడా చేయడానికి ఆలయాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com