వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణ వ్యక్తిత్వం: వెంకయ్యనాయుడు
- December 24, 2022
తెనాలి: వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వమని... ప్రత్యేకించి సినిమాలు, రాజకీయాలకు మించిన ప్రజాభిమానం ఎన్టీఆర్ సొంతమన భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, తెనాలి ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలను నిర్వహించతలపెట్టి, కొనసాగిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభినందించారు. ఇదే వేదిక నుంచి ప్రముఖ నటుడు మాగంటి మురళీమోహన్, ప్రఖ్యాత నటి జయచిత్రలకు ఎన్టీఆర్ శతాబ్ధి చలనచిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం మహాత్ముని జీవిత కథతో రూపొందిన జాతిపిత మహాత్మ గాంధీ జీవిత కథ పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ పుస్తకానికి సంబంధించిన స్వల్పనిడివిగల వీడియోను ఆవిష్కరించారు.

ప్రజా కేంద్రిత రాజకీయ సంస్కరణలకు ఎన్టీఆర్ చిరునామా అన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, వారి స్ఫూర్తి సినిమాలు, రాజకీయాలకే గాక సార్వజనీనమైనదని తెలిపారు. ఎన్టీఆర్ చిత్తశుద్ధి, కార్యదీక్ష, నిబద్ధతల గురించి యువత తెలుసుకుని ఆచరించాలని సూచించారు.నటుడిగా ఎన్టీఆర్ స్ఫురద్రూపం, ఆహార్యం, నటన, వాచకం కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించిపెట్టిందన్న ఆయన, పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆయా పాత్రల పోషణలో తనకు తానే సాటి అనే పేరును సముపార్జించుకున్నారన్నారు. ఆ రోజుల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ ఫోటోతో కూడిన క్యాలెండర్ లు వాడవాడల ప్రతి ఇంట్లోనూ ఉండేవని, తెరవేల్పు అనే విషయాన్ని మరచిపోయి మరీ, ప్రజలు ఎన్టీఆర్ ను తమ ఇల వేల్పుగా అభిమానించి, గుండె గుడిలో కొలువు దీర్చారని పేర్కొన్నారు.
సనాతన ఆధ్యాత్మిక విశ్వాసాలతో, హైందవ ధర్మానికి ప్రతీకలా కనిపించే ఎన్టీఆర్ ఓ దృఢమైన జాతీయవాది అని పేర్కొన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారతదేశ అభివృద్ధి అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధితో ముడిపడి ఉందని అని ఎన్టీఆర్ బలంగా విశ్వసించారన్నారు. తెలుగు వాడినంటూ గర్వంగా చెప్పుకున్న ఎన్టీఆర్ ప్రాంతీయవాద భావన, సంకుచిత వాదానికి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాన్ని పటిష్టపరచాలనే భావనను, ఉన్నతమైన ఆశయంతో ఎన్టీఆర్ సమర్థించారనే విషయాన్ని ముందుతరం రాజకీయనాయకులు గుర్తుంచుకోవాలన్న ఆయన, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, జాతీయవాద భావనతో మిళితం చేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళారన్నారు. దీనికి కారణం తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆత్మగౌరవం కల్పించడానికి కాదని, ప్రతి భాష, ప్రతి రాష్ట్రం తమదైన ఆత్మగౌరవాన్ని సాధించుకునే విధంగా స్ఫూర్తిని నింపడానికేనని పేర్కొన్నారు.

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, విలువలతో కూడిన రాజకీయాలకు ఎన్టీఆర్ నిజమైన నిర్వచనాన్ని చెప్పారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వారు యుద్ధప్రాతిపదికన ముందుకు సాగారన్నారు. రూపొందించిన పథకాలు అమలయ్యి గడగడపకూ చేరుకునే దాకా అదే ఉత్సాహంతో అవిశ్రాంతంగా శ్రమించేవారన్న ఆయన, ఎన్టీఆర్ పాలనలో తనను బాగా ఆకట్టుకున్న అంశం అదేనని తెలిపారు.ఎన్టీఆర్ వక్తృత్వ శక్తి, వాగ్ధాటిని గురించి చెప్పాలంటే మాటలు చాలవన్న ఆయన, “ప్రజలే దేవుళ్ళు – సమాజమే దేవాలయం” అంటూ ప్రజాస్వామ్యానికి వారు ఇచ్చిన నిర్వచనం ఆదర్శనీయమైనది, ఆచరణయోగ్యమైనదని పేర్కొన్నారు.
రాజకీయాల్లో అనేక ఎదురు దెబ్బలను తట్టుకుంటూ నిలబడిన ఎన్టీఆర్ వ్యక్తిత్వం సమగ్రత కలిగిన నాయకుడిగా వారి స్థాయిని మరింత పెంచాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, పరిపాలనలో ముందుకు వెళ్ళే క్రమంలో వారు త్వరితగతిన అమల్లోకి తెచ్చిన అనేక నిర్ణయాలు వారి ప్రత్యేకతను చాటిచెప్పాయన్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పట్ల అభిమానం పాళ్ళు ఎన్టీఆర్ కు, తనకు ఒకింత ఎక్కువే అన్న ఆయన, ఆ విషయాన్ని బాహాటంగా చెప్పుకోవడానికి గర్వపడతామని, తమ మధ్య అనుబంధం బలపడటానికి గల కారణాల్లో తెలుగు భాష కూడా ఒకటని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని యువత అధ్యయనం చేసేందుకు, వారి జీవితం గురించి యుువతకు తెలియజేసేందుకు శతజయంతి ఉత్సవాలు చక్కని వేదిక అని పేర్కొన్నారు.
ఇదే వేదిక నుంచి జాతిపిత మహాత్మ గాంధీ జీవిత కథను ఆవిష్కరించటం ఆనందదాయకమన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, పుస్తక రచయిత చొక్కాపు వెంకట రమణ కి అభినందనలు తెలియజేసారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా కోట్లాది భారతీయులను ఏకతాటి మీదకు తెచ్చి స్వరాజ్యాన్ని సముపార్జించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం గాంధీజీదన్న ఆయన, స్వరాజ్యమే గాక దేశాభివృద్ధిలో కీలకమైన అనేక మౌలిక అంశాలకు వారి జీవితం మార్గాన్ని చూపుతుందన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో నాటి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని యువతకు తెలియజేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన, ఇందు కోసం మరిన్ని పుస్తకాలు వెలువడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హైకోర్ట్ జస్టిస్ జి.రాధారాణి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నటుడు మురళీ మోహన్, జయచిత్ర, ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సహా వివిధ రంగాలకు చెందిన తెనాలి ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!







