హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు..

- January 02, 2023 , by Maagulf
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు..

హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. ఇకపై మెట్రో రైల్ సర్వీసులు అర్ధరాత్రి వరకు కొనసాగనున్నాయి. అయితే.. అది రెండు కారిడార్లలోనే. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ పూర్తయ్యే వరకు రెండు కారిడార్లలో మెట్రో రైలు సర్వీసులు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి.

ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోనే మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. ఈ కారిడార్ల టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్ధరాత్రి 12.00 గంటలకు బయల్దేరుతుంది. గతంలో చివరి ట్రైన్ 11.00 గంటలకే బయల్దేరేది. ప్రస్తుతం నుమాయిష్‌కు వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువున్న నేపథ్యంలో టిక్కెట్ కౌంటర్లు కూడా పెంచారు. ఇంతకుముందు నాలుగు కౌంటర్లలో మాత్రమే టిక్కెట్స్ విక్రయించే వాళ్లు. ఇప్పుడు ఆరు కౌంటర్ల ద్వారా టిక్కెట్లు జారీ చేస్తున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కూడా మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 31న 4.57 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. ఇప్పటివరకు మెట్రోలో ప్రయాణించిన వాళ్లలో ఇదే అత్యధికం. కొత్త సంవత్సరం, ఆదివారం కలిసి రావడంతో జనవరి 1న కూడా భారీగానే ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. ప్రస్తుతం మెట్రో రైల్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు త్వరలోనే మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. కనీసం 10-20 శాతం ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com