తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగం పై వివాదం ..

- January 09, 2023 , by Maagulf
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగం పై వివాదం ..

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆర్‌.ఎన్‌.రవిల మధ్య వివాదం మరింత రాజుకుంది. గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి సోమవారం అసెంబ్లీ నుండి వాకౌట్‌ చేశారు.

గవర్నర్‌ జోడించిన, సంద్రాయ భాగాలను వదిలివేసిన వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పీకర్‌ను కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని యథావిధిగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. దీంతో జాతీయ గీతం ప్రారంభం కావడానికి కొన్ని సెకన్ల ముందు .. గవర్నర్‌ సభ నుండి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలోని లౌకికవాదం గురించి, పెరియార్‌, బి.ఆర్‌.అంబేద్కర్‌, కె. కామరాజ్‌, సి.ఎన్‌ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖ నేతల పేర్లను ప్రస్తావించకుండా గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న ద్రవిడియన్‌ మోడల్‌ గురించి కూడా ఆయన చదవలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని యథావిధిగా ఉంచాలంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకువచ్చింది. గవర్నర్‌ తీరు అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని తీర్మానంలో స్టాలిన్‌ విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని డిఎంకెతో పాటు కాంగ్రెస్‌, విదుతలై చిరుతైగల్‌ కచ్చి (విసికె), సిపిఎం, సిపిఐలు బాయ్ కాట్‌ చేశాయి. బిల్లులపై సంతకం చేయడంపై ఆయన చేస్తోన్న ఆలస్యంపైనా సభ్యులు నినాదాలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 21 బిల్లులు గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచారు. 'తమిళనాడును వదిలివెళ్లండి, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను మాపై రుద్దకండి' అని డిఎంకె ఎమ్మెల్యేలతో సహా అందరూ నినాదాలు చేశారు. ఆయన పదవి ఆమోదయోగ్యం కాదని, గవర్నర్‌ను తొలగించాలని కాంగ్రెస్‌ ఎంపి కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు. తమిళనాడుకు తమిళగం పేరు సరిగా సరిపోతుందని ఇటీవల రవి చేసిన వ్యాఖ్యలపైనా వారు ఆందోళన చేశారు.

గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గవర్నర్‌ బిజెపి ఆదేశానుసారం పరిచేస్తున్నారని డిఎంకె ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గవర్నర్‌ బిజెపి రెండో అధ్యక్షుడిగా నడుచుకోవడం మానుకోవాలని ఎంపి టి.ఆర్‌. బాలు విమర్శంచారు. గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. రాష్ట్రంలో గందరగోళం, విబేధాలు, వివాదాలసు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజ్‌భవన్‌ నుండి కాకుండా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఖండించాల్సిన అంశమని బాలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com