స్వర్ణభారత్ ట్రస్ట్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వెంకయ్యనాయుడు
- January 13, 2023
నెల్లూరు: భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే ఉత్తమమైన మార్గం పండుగలను నిర్వహించుకోవటమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వెంకటాచలం (నెల్లూరు)లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ప్రసగించిన ఆయన పండుగలు అంటే కొత్త బట్టలు పిండి వంటలే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయటంతో పాటు, మన పెద్దలు చూపిన మార్గంలో ముందుకు సాగాలన్న స్ఫూర్తిని అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రిభాషా అవధాని వద్దిపర్తి పద్మాకర్ సంక్రాంతి వైభవాన్ని తెలియజేయగా, జస్టిస్ లావు నాగేశ్వరరావు అతిథిగా విచ్చేశారు.
సంక్రాంతి సంబరాలను స్వర్ణభారత్ ట్రస్ట్ లో నిర్వహించటం ఆనందదాయకమన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, సంక్రాంతి అనేది రైతులు పండుగ అని అభివర్ణించారు. తెలుగు లోగిళ్ళకు సంక్రాంతి తొలి కాంతులను తీసుకువస్తుందన్న ఆయన, మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలన్న షేర్ అండ్ కేర్ అనే భారతీయ ధర్మంలోని మూల సూత్రాన్ని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు.పాతను వదలి నూతన మార్గంలో సాగాలనే సందేశాన్ని భోగి, పెద్దలను గౌరవించాలన్న సందేశాన్ని సంక్రాంతి, ప్రకృతిని-పశుసంపదను కాపాడుకోవలన్న స్ఫూర్తిని కనుమ పండుగలు అందజేస్తాయన్న ఆయన, ఈ సందర్భంగా తమ తాతని గుర్తు చేసుకున్నారు.తమ తాత పండుగలను నిర్వహించిన తీరే భారతీయ సంస్కృతి పట్ల అవగాహనను, అనురక్తిని పెంచాయని ఆయన తెలిపారు.
ఈ సంక్రాంతి సందర్భంగా ముందు తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను చేరవేసేందుకు పది సూత్రాలను ఈ సందర్భంగా తమ సంక్రాంతి సందేశంగా ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలియజేశారు.
1. మన మూలాలకు తరలి వెళదాం.మన పెద్దలు చూపిన బాటలో ముందుకు సాగుదాం. భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేద్దాం.సేవా కార్యక్రమాల్లో పాల్గొందాం.
2. మన జీవన పద్ధతులల్లో(Life Style) మార్పులకు శ్రీకారం చుడదాం. భారతీయ జీవన పద్ధతుల గురించి తెలుసుకుని ఆచరిద్దాం.పాశ్చాత్య జీవనాన్ని అనుకరించటం విడనాడి, భారతీయులుగా జీవనం సాగిద్దాం.
3. భారతీయుల ఆహారపు అలవాట్లు కాల పరీక్షకు తట్టుకుని నిలబడినవి. ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి ఆహారం మీద దృష్టి పెడదాం. మనది కాని ఆహారం మీద మోజు తగ్గించుకుని, మన ఆహారం మీద దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
4. వ్యవసాయం వైపు యువతను మరలిద్దాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెంచి, రసాయనాల వాడకాన్ని విడనాడుదాం. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పుల కోసం ప్రయత్నిద్దాం.
5. మన భారతీయ మాతృభాషలను గౌరవించి, ప్రోత్సహించి, మాతృభాషా పరిరక్షణకై ఉద్యమిద్దాం.
6. ప్రపంచ దేశాలు చేతులెత్తి మొక్కే భారతీయ కుటుంబ వ్యవస్థ ఉన్నతిని కాపాడుకుందాం. మన సంప్రదాయ సమాజానికి పటిష్టతను, దృఢత్వాన్ని అందిస్తున్న శక్తి మన కుటుంబం. మనందర్నీ తరతరాలు కలిసి కట్టుగా ఉంచిన శక్తిమంతమైన బంధం అది. మన సంపన్నమైన సామాజిక వ్యవస్థను సమగ్ర రూపానికి తీసుకువచ్చిన కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం.
7. సంపద పెంచుకోవాలి. ఇతరులతో కాస్త పంచుకోవాలి. Share and care is the core of Indian philosophy. ఆ తత్త్వాన్ని అలవాటు చేసుకుందాం.జీవితాలను సార్థకం చేసుకుందాం.
8. శారీరక వ్యాయామం ద్వారా భౌతిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకుందాం. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతితో కలిసి జీవిద్దాం.
9. మనము మన బాధ్యతలను, కర్తవ్యాలను, పనులను నిర్వర్తించి దేశ భవిష్యత్తుకు సహకరిద్దాం. శక్తిమంతమైన, ఆరోగ్యవంతమైన, సౌభాగ్యవంతమైన భారత్ ను నిర్మించే సంకల్పాన్ని సంక్రాంతి శుభ సందర్భంగా తీసుకుందాం.
10. మన ఆట, మన పాట, మన బాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు చివరకు మన తిట్టును కూడా మరచిపోకుండా, కాపాడుకుందాం.
మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలన్న స్ఫూర్తి భారత రాజ్యాంగంలోనూ కానవస్తుందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ రాజ్యాంగ మూలప్రతిలో గీసిన చిత్రాల గురించి తెలియజేశారు. మహాభారతం, రామాయణం, అశోకుడు, గౌతమ బుద్ధుడు జీవితాలను ప్రతిబింబిస్తూ రాజ్యాంగంలో కనిపించే చిత్రాలు కర్తవ్య పరాయణత్వం, సేవాభావం, మానవత్వం, జ్ఞానం, ధర్మపరాయణత్వం వంటి భారతీయ జీవన విలువల్ని ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇవే గాక ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ లోని గోడల మీద, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో అనేక ఆదర్శ వాక్యాలు కూడా మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.
సేవలోనే నిజమైన ఐశ్వర్యం దాగి ఉందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఐశ్వర్యం అంటే సంపద కాదని, నలుగురి కళ్ళల్లో మన వల్ల కనిపించే ఆనందమే నిజమైన ఐశ్వర్యమని తెలిపారు. ఇంటి గడపల దగ్గర వినపడే ఆడపిల్లల గజ్జెల చప్పుడు, ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య అనురాగం, నాన్న మార్గదర్శకాలు, అమ్మ చేతి కమ్మని భోజనం, అవసరంలో సమాదరించే ప్రాణ స్నేహితుడి తోడు, ఆదర్శంగా మసలుకునే బిడ్డలు, అన్నింటికంటే భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం వంటివి నిజమై ఐశ్వర్యాలు అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి వెంకటాచలం సహా నెల్లూరు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







