డిప్రెషన్‌ కి కారణాలు ...

- April 30, 2016 , by Maagulf
డిప్రెషన్‌ కి  కారణాలు ...

డిప్రెషన్‌ సాధారణంగా అందరిలోనూ తలెత్తవచ్చు. కానీ ఒక సర్వే ప్రకారం మగవారిలో కన్నా మహిళల్లో ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా టీనేజ్‌ అమ్మాయిల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సరైన గైడెన్సు, సరైన అవగాహన లేకపోవటమే ఈ సమస్యకు దారితీస్తోందని చెప్పవచ్చు. భారతదేశం వంటి వర్దమాన సమాజాల్లో ఉండే అభద్రత భావం కూడా ఇందుకు తోడవుతోంది. ఒకప్పటి తరంతో పోలిస్తే ఇప్పటి తరానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. అధునాతన సౌకర్యాలు, అనువైన పరిస్థితులు వచ్చిపడ్డాయి. అన్నీ సమకూర్చటానికి తల్లిదండ్రులు సిద్దంగా ఉన్నారు. చాలావరకు కుటుంబాల్లో ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉండటంతో యూత్ ఆడింది ఆట, పాడింది పాట గా ఉంటోంది పరిస్థితి.ఇంతటి సౌకర్యవంతమైన కుటుంబాల్లో పెరిగిన యువత.. జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒడిదుడుకుల్ని తట్టుకోలేక పోతున్నారు. కష్టాలు వస్తున్నప్పుడు కుంగిపోయి విషాదంలోకి జారిపోతున్నారు. ఈ దుస్థితినే డిప్రెషన్ గా అభివ ర్ణించవచ్చు. దీనికి కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేదు.డిప్రెషన్ కు నిర్దిష్ట లక్షణం అని చెప్పలేం కానీ కొన్ని లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. కొద్ది రోజుల పాటు వీటిలో కొన్ని లక్షణాలు వేధిస్తుంటే డిప్రెషన్ గా అనుమానించవచ్చు. ఏ పని మీదా ఆసక్తి లేకుండా ఉండటం, దిగులుగా కూర్చోవటం, నిర్లిప్తత కు అలవాటు పడటం, అస్థిమితంగా ఉండటం, ఆకలి తగ్గిపోవటం లేదా పెరిగిపోవటం, దీని కారణంగా బరువు తగ్గిపోవటం లేదా పెరిగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ జీవనానికి, దాంపత్య సుఖానికి దూరం అయిపోతుంటారు. కొన్ని సార్లు జీవితం మీద విరక్తి చెందుతారు. అటువంటప్పుడు ఆత్మహత్య వంటి ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవితం అంతా చీకటి మయం అయిపోయిందన్న ఫీలింగ్సు కలుగుతాయి. నిరాశ తో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఆవిరై పోతాయి. కుటుంబంలో కలతలు, చుట్టుపక్కల వారితో చికాకులు ఏర్పడుతుంటాయి. ఈ లక్షణాలు ఒకేసారిగా కానీ, కొన్నింటిగా కానీ బయట పడవచ్చు.డిప్రెషన్ ను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని సార్లు ఆకస్మిక సంఘటన జరిగినప్పుడు డిప్రెషన్‌లోకి జారిపోతారు. ఆత్మీయులు చనిపోయినప్పుడు, పరీక్ష ఫెయిలు అయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, ప్రేమ విఫలం అయినప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇది ఆకస్మికంగా జరుగుతుంటుంది. కొంతమందిలో ఒక్కో సీజన్ లో డిప్రెషన్ తలెత్తుతుంది. మరి కొందరిలో అతి ఎక్కువ సంతోషం, అతి ఎక్కువ విషాదం దోబూచులాడుతుంటాయి. ఇది డిప్రెషన్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. హార్మోన్ ల స్రావంలో సమతుల్యత లోపించినప్పుడు కూడా ఇది ఏర్పడవచ్చు.డిప్రెషన్ కు నిర్థిష్టంగా ఒక కారణం అని చెప్పలేం. కుటుంబ పరిస్థితులు, సామాజిక ఇబ్బందులు కారణం కావచ్చు. శారీరక అనారోగ్యం, జన్యుపరమైన సమస్యలు, స్ట్రెస్ వంటి కారణాలతో ప్రారంభం కావచ్చు. ఒక్కసారిగా ఉద్యోగం పోయినా, కుటుంబ సభ్యులు చనిపోయినా వెంటనే దీనికి దారి తీస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డిప్రెషన్ తో బాధ పడుతుంటే వారసత్వంగా ఇది కొనసాగ వచ్చు. చిన్నతనం లో బయట పడక పోయినా, పెద్ద ఎదిగిన తర్వాత ఇది బయట పడవచ్చు. జన్యుపరంగా ఉండే మార్పులు కూడా కారణం కావచ్చు. గుండెవ్యాధులు, డయాబెటీస్, మానసిక సమస్యలు ఎక్కువకాలం పీడిస్తుంటే అనుమానించాల్సిందే ఎప్పటికీ వ్యాధి తగ్గటం లేదన్న వ్యధ క్రమంగా డిప్రెషన్ కు దారి తీయవచ్చు. ధైరాయిడ్ సమస్యలు, హార్మోన్ ల అసమతుల్యత ఉన్నపుడు దీనికి దారీ తీస్తుంది.డిప్రెషన్ ను గుర్తించేందుకు పరీక్షల కన్నా స్థితిగతుల పరిశీలన అవసరం. లక్షణాలు బయట పడుతున్నప్పుడు దీన్ని గుర్తించవచ్చు. అనుమానం కలిగితే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. క్రమంగా మందులు వాడుతూ చికిత్స తీసుకోవాలి. లేదంటే దీని ప్రభావం ఎక్కువ అవుతుంది.డిప్రెషన్ తలెత్తకుండా తీసుకొనే జాగ్రత్తలు ముఖ్యం అని గుర్తించుకోవాలి. రోజువారీ కార్యకలాపాల్లో ఆందోళనలు పెట్టుకోకూడదు. ఒకటే ఆలోచన వెంటపడి తరుముతుంటే దాని మీద నుంచి డైవర్షన్ తీసుకోవాలి. భయపెట్టే ఆందోళనల్ని అధిగమించే మార్గాల్ని అనుసరించాలి. పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. పదే పదే దాని గురించే ఆలోచించకూడదు. కొన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి. మరి కొన్ని విషయాలు మన చేతిలో ఉండవన్న జీవన సత్యాన్ని గ్రహించాలి.కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి. హాబీల్ని అబివ్రద్ది చేసుకోవాలి. హాబీలతో మానసికంగా సేద తీరవచ్చు. అందుకే చాలా పెద్ద స్థాయిలో స్థిరపడిన వారు కూడా హాబీలను వదులకోరు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వారు కూడా పుస్తక పఠనం చేస్తుంటారని మనం చదువుతుంటాం. ఎందుకంటే విపరీతమైన ఒత్తడి ఉన్నప్పుడు పుస్తకాలు చదవటంతో తమ ద్రష్టిని మళ్లించుకొంటారు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. కావాలంటే కొంత సేపు గ్యాప్‌తీసుకొని నిదానంగా ఆలోచించి వ్యవహరించాలి. లేదంటే తప్పు మీద తప్పు జరిగి మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.ఒకేచోట కదలకుండా కూర్చొని పని చేస్తే మెదడు మొద్దుబారిపోతుంది. అందుకని తేలికపాటి వ్యాయామాల ద్వారా రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. అప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అటువంటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా చికాకుడా ఉన్నప్పుడు పొగ తాగటం, మద్యం తీసుకోవటం వంటి పనులు చేస్తుంటారు. ఇటువంటి చెడు అలవాట్లతో ఆరోగ్యం బాగు పడటం మాట దేవుడు ఎరుగు కానీ ఉన్న ఆరోగ్యం కాస్తా చెడుతుంది. కాస్సేపు మెదడుకు హాయి అనిపించినా దీర్ఘకాలంలో అన్ని అవయవాలకు సమస్యలు తెచ్చిపెడతాయి. అందుచేత ఇటువంతి దురలవాట్లకు దూరంగా ఉండటమే మంచిదని గుర్తించుకోవాలి.డిప్రెషన్ అన్నది చికిత్స తీసుకోనంత ప్రమాదకరం కాదని గుర్తించుకోండి. మంచి అలవాట్లు, చక్కని వైద్య చికిత్స తో ఈ సమస్యను అధిగమించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేసుకొనే కన్నా సమస్యను అనుమానించినప్పుడే పరిష్కారం కోసం ప్రయత్నించాలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com