‘సార్’: మూవీ రివ్యూ

- February 17, 2023 , by Maagulf
‘సార్’: మూవీ రివ్యూ

తమిళ హీరో ధనుష్ తెలుగులో నటించిన తొలి చిత్రం ‘సార్’. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీ, అన్యాయానికి సంబంధించిన మెసేజ్‌తో తెరకెక్కిన చిత్రమిది. బైలింగ్వల్ మూవీగా రూపొందిన ‘సార్’ అంచనాలను అందుకుందా? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
బాల గంగాధర్ తిలక్ అలియాస్ బాలు (ధనుష్) ఓ ప్రైవేట్ కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్. అతను పని చేసే విద్యా సంస్థలకు అధిపతి త్రిపాఠి (సముద్ర ఖని). ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేరుతో ఫీజుల క్రమబధ్ధీకరణ కోసం చేపట్టిన పథకాలు ప్రైవేట్ కాలేజీల మనుగడకు ప్రమాదంగా మారడంతో, త్రిపాఠి ఓ ఎత్తుగడ వేస్తాడు. ఉనికిని కోల్పోయిన గవర్నమెంట్ కాలేజీలను దత్తత తీసుకుంటాడు. తన వద్ద పని చేసే థర్డ్ గ్రేడ్ లేక్చరర్లలను ఆ గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తాడు. అలా సిరిపురం అనే ఓ గ్రామంలోని గవర్నమెంట్ కాలేజీకి లెక్చరర్‌గా వెళతాడు బాలు. ఆ కాలేజీలో ఒక్క విద్యార్ధి కూడా వుండడు. గవర్నమెంట్ కాలేజీలపై వున్న ఒపీనియన్‌ని తొలగించి, విద్యార్ధుల్ని కాలేజీకి బాలు ఎలా రప్పించాడు.? విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను ఎలా ఎండగట్టాడు.? అనేదే మిగతా కథ.

నటీనటుల పనితీరు - విశ్లేషణ
నిజానికి ఈ కథలో కొత్తదనమేమీ లేదు. చాలాసార్లు ఈ తరహా కథలను వెండితెరపై చూసేశాం. కథనంలోనూ ఏమంత కొత్తదనం చూపించింది లేదు. కానీ, కథ మాత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. చదువుకునే విద్యార్ధులే కాదు, వారి చదువుల కోసం నిలువునా అమ్ముకుని కష్టపడుతూ, అప్పుల పాలయిపోతున్న ప్రతీ తల్లితండ్రులకీ ఈ కథ కనెక్ట్ అవుతుంది. అంత ఎమోషనల్‌గా ఈ సినిమాని తీర్చి దిద్దాడు వెంకీ అట్లూరి. 
ఈ కథకు మరో ఎస్సెట్ ధనుష్ పర్‌ఫామెన్స్. ‘రఘువరన్ బీటెక్’ తదితర చిత్రాలతో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వున్న సంగతి తెలిసిందే. చాలా సాధారణంగా కనిపిస్తూనే, ఎలివేషన్ సీన్లలో అదరగొట్టేస్తాడు.. ఎమోషనల్ సీన్లలో కదిలించేస్తాడు. అందుకే ధనుష్‌ని భాషతో సంబంధం లేకుండా ఎవరైనా ఓన్ చేసుకుంటారు. ‘సార్’తో ఇంకోసారి అది ప్రూవ్ చేసుకున్నాడు ధనుష్. ఇక, సంయుక్తా మీనన్ తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేసింది. సముద్ర ఖని తనదైన హుందా పర్‌ఫామెన్స్‌తో మరోసారి విలన్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది, సాయి కుమార్, తణికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు
రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి నుంచి ఈ తరహా కథను ఎక్స్‌పెక్ట్ చేయలేం. గత మూడు చిత్రాలు చూసి, ఈ సినిమా వెంకీ తీసిందేనా.. అని ఆశ్చర్యపోయేంతలా తనను తాను మౌల్డ్ చేసుకున్నాడు ఈ సినిమా కోసం డైరెక్టర్‌గా వెంకీ. తాను అనుకున్న కథని స్ర్టెయిట్‌గా సింపుల్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. తమన్ మ్యూజిక్ వినసొంపుగా వుంది. ‘మాస్టారూ మాస్టారూ..’ పాటకు మంచి అప్లాజ్ వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్లకు తగ్గట్లుగా ఆకట్టుకుంది. ఎడిటింగ్‌లో అక్కడక్కడా ఇంకాస్త కత్తెర పడితే బాగుండేదనిపించింది. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. మాటలు బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
ధనుష్ పర్‌ఫామెన్స్
క్లైమాక్స్ సన్నివేశాలు
డైరెక్టర్ పనితనం

మైనస్ పాయింట్స్:
ప్రధమార్ధంలో కాస్త ఓవర్ డోస్ అనిపించిన మెలో డ్రామా
అక్కడక్కడా కొన్ని సాగతీత సన్నివేశాలు

  చివరిగా: ‘సార్’ ఓ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా.!

గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్: Phars Film Co. LLC

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com