తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు
- March 17, 2023
న్యూ ఢిల్లీ: తెలంగాణకు కేంద్రం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది. లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడే, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు.
ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్టైల్స్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశ్యంతో ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ & అపారెల్ పార్క్’ (PM-Mitra) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఫార్మ్ టు ఫైబర్; ఫైబర్ టు ఫ్యాక్టరీ; ఫ్యాక్టరీ టు ఫ్యాషన్; ఫ్యాషన్ టు ఫారిన్ అనే ‘5F’ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ 7 మెగా టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించారు.
దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడటంతోపాటు, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణకు ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రధానమంత్రి తెలంగాణకు అందించిన కానుక అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ, దుర్రీలు వంటి GI ట్యాగ్ కలిగి ఉన్న ఎన్నో చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసినట్లయితే, రాష్ట్రంలో ఉన్న రైతులకు, చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఇలాంటి ‘పీఎం-మిత్ర’ ప్రాజెక్టుకోసం దరఖాస్తు చేసుకోవాలంటూ 14 ఫిబ్రవరి, 2022న తెలంగాణ సీఎం చంద్రశేఖర రావుకు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అంతేకాకుండా ప్రధానమంత్రిని, టెక్స్‌టైల్ శాఖ మంత్రిని కలిసినపుడు ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు విషయమై పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మెగా టెక్స్‌టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వస్త్రాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు వలన రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్‌టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!









