ఇక భారత్ మొత్తానికి ఒకటే ఎమర్జెన్సీ నెంబర్

- May 08, 2016 , by Maagulf
ఇక భారత్ మొత్తానికి ఒకటే ఎమర్జెన్సీ నెంబర్

దేశమంతటికీ ఒకటే ఎమర్జెన్సీ నంబర్‌ వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానుంది. అత్యవసర సేవలైన పోలీస్‌, అంబులెన్స్‌, అగ్నిమాపక శాఖల సేవలను 2017 జనవరి ఒకటి నుంచి ఒకే నంబరుతో అందుబాటులోకి తేనున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే '112' నంబరు డయల్‌ చేస్తే చాలు.
అమెరికాలో అమల్లో ఉన్న 911 లాగా మనదేశంలోనూ ఒకటే ఎమర్జెన్సీ నంబరును అమల్లోకి తీసుకురావడానికి టెలికాం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ మనదేశంలో వేర్వేరు విభాగాలకు వేర్వేరు ఎమర్జెన్సీ నంబర్లు ఉన్న సంగతి తెలిసిందే. పోలీస్‌ శాఖకి 100, అగ్నిమాపక శాఖ 101, అంబులెన్స్‌ 102, విపత్తు నిర్వహణ శాఖ 108.. ఇలా పలు నంబర్లున్నాయి. వీటిన్నిటి బదులు ఒకే నంబరు తేవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది.
వేర్వేరు కారణాల వల్ల అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ సౌకర్యం తాత్కాలికంగా నిలిపివేసిన సిమ్స్‌, ల్యాండ్‌లైన్‌ ఫోన్లనుంచి కూడా ఈ అత్యవసర నంబరుకు ఫోన్‌ చేసే అవకాశం ఉంటుంది. అవసరంలో ఉన్న వారు ఎవరైనా సరే 112 నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు, సంబంధిత విభాగానికి ఆ కాల్‌ వెళ్లిపోతుంది. 112 అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వివిధ విభాగాలకు విడివిడిగా ఉన్న ఎమర్జెన్సీ నంబర్లను దశలవారీగా తొలగిస్తారు. ఎమర్జెన్సీ కాల్స్‌ని 112కి మళ్లించవలసిందిగా టెలికాం ఆపరేటర్లకు సూచించారని, ప్రస్తుతం ఆ ప్రక్రియపై పని జరుగుతోందని అధికారులు తెలిపారు. వివిధ భాషలు మాట్లాడగలిగే సిబ్బందితో ఓ కాల్‌సెంటర్‌ తరహా సౌకర్యం ఏర్పాటు చేసి ఈ సింగిల్‌ ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com