విమానంలో అనుచిత ప్రవర్తనపై ఎయిర్ ఇండియా హెచ్చరికలు జారీ

- April 11, 2023 , by Maagulf
విమానంలో అనుచిత ప్రవర్తనపై ఎయిర్ ఇండియా హెచ్చరికలు జారీ

న్యూఢిల్లీ: విమానాలలో ప్రయాణీకుల వికృత ప్రవర్తనల ఘటనలు ఇటీవల పెరగడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆందోళన వ్యక్తం చేసింది.  విమాన ప్రయాణ సమయంలో ఇటువంటి ప్రవర్తనపై చర్య తీసుకోవాలని కోరుతూ అన్ని విమానయాన సంస్థలకు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది.  "ఈ మధ్య కాలంలో DGCA విమానంలో ధూమపానం చేయడం, మద్య పానీయాల వినియోగం ఫలితంగా వికృత ప్రవర్తన, ప్రయాణీకుల మధ్య వాగ్వాదాలు మరియు కొన్నిసార్లు విమానంలో ప్రయాణీకులు అనుచితంగా తాకడం లేదా లైంగిక వేధింపులు వంటి కొన్ని సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా సంఘటనల్లో పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇటువంటి సంఘటనలు విమాన కార్యకలాపాల భద్రతకు రాజీ పడే అవకాశం ఉంది" అని డీజీసీఏ తన సర్క్యులర్ లో పేర్కొంది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని వివిధ నిబంధనల ప్రకారం.. DGCA నిబంధనలపై విమానయాన సంస్థలు తమ పైలట్‌లు, క్యాబిన్ సిబ్బంది,  పోస్ట్ హోల్డర్‌లను వికృత ప్రయాణీకులను అడ్డుకోవడంపై అవగాహన కల్పించాలని DGCA సూచించింది.

డెక్కన్ హెరాల్డ్ ప్రకారం.. వికృత ప్రయాణీకుల ప్రవర్తనను DGCA మూడు లెవెల్స్ గా వర్గీకరించింది. ఈ కేటగిరీల పరిధిలోకి వచ్చే ప్రయాణీకులు నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రయాణించకుండా నిషేధించబడతారని హెచ్చరించింది. లెవెట్ 1లో శారీరక హావభావాలు, శబ్దాల ద్వారా వేధింపులు,  మత్తులో ఉండటం వంటి ఆమోదయోగ్యం కాని ప్రవర్తనలు ఉన్నాయి. నెట్టడం, తన్నడం లేదా లైంగిక వేధింపులు వంటి శారీరక దుర్వినియోగ ప్రవర్తన లెవల్ 2 కిందకు వస్తుంది. విమాన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు నష్టం, ఉక్కిరిబిక్కిరి చేయడం వంటి శారీరక హింస, ఉద్దేశపూర్వకంగా చంపాలని దాడి వంటి ప్రాణాంతక ప్రవర్తనలు లెవెల్ 3 కిందకు వస్తుంది. సంబంధిత విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ సదరు వ్యక్తులపై విమానయాన నిషేధం కాలవ్యవధిపై నిర్ణయం తీసుకోవచ్చని డీజీసీఏ తెలిపింది.

అంతకుముందు, సోమవారం ఉదయం 6.30 గంటలకు హీత్రో విమానాశ్రయం (లండన్)కి బయలుదేరిన AI విమానం(ఫ్లైట్ AI 111 )లో ప్రయాణికుల వికృత ప్రవర్తన, భౌతిక వాగ్వాదం గురించి సిబ్బంది పైలట్‌లకు నివేదించిన తర్వాత ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. "పైలట్ ఇన్ కమాండ్ ఢిల్లీకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణీకుడిని ల్యాండింగ్ చేయగానే భద్రతా సిబ్బందికి అప్పగించారు. పోలీసులకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎయిర్ ఇండియాలో మాకు విమానంలో ఉన్న అందరి భద్రత, గౌరవం ముఖ్యం. బాధిత సిబ్బందికి మేము అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నాము. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఈ మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరడానికి విమానాన్ని రీషెడ్యూల్ చేసాము" అని ఎయిర్ ఇండియా తెలిపింది. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత, ఆ ప్రయాణికుడిని "అసభ్యంగా ప్రవర్తించాడని" ఆరోపిస్తూ ఎయిర్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ప్రయాణికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విమానయాన సంస్థ తన ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై డీజీసీఏకు కూడా సమాచారం అందించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతకుముందు, జనవరిలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి గత ఏడాది నవంబర్ 26న AI విమానంలో ఒక మహిళపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 6న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలికి మద్యం మత్తులో మిశ్రా మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఎయిర్ ఇండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు జనవరి 4న అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com