సినిమా రివ్యూ: ‘శాకుంతలం’

- April 14, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘శాకుంతలం’

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, సచిన్ ఖేడ్కర్, అనన్య నాగళ్ల, అదితి బాలన్, శివ బాలాజీ, మధుబాల, గౌతమి, సుబ్బరాజు తదితరులు.
సంగీతం: మణిశర్మ
మాటలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాతలు : నీలిమ గుణ, దిల్ రాజు,
రచన, దర్శకత్వం: గుణశేఖర్

సమంత ప్రధాన పాత్రలో తొలిసారి పౌరాణిక ప్రయోగం చేసిన సినిమా ‘శాకుంతలం’. మయోసైటిస్ అనే అనారోగ్యంతో పోరాడుతూనే ఈ సినిమా కథపై వున్న ఇష్టంతో సమంత ‘శాకుంతలం’కి సైన్ చేసింది. శకుంతల కథ అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ విజువల్ వండర్‌గా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడన్న విషయం ప్రచార చిత్రాల ద్వారా అర్ధమైంది. మరి, ‘శాకుంతలం’ సమంత కెరీర్‌లో మరో బెస్ట్ మూవీ అయ్యిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి భూలోకానికి వచ్చిన మేనక (మధుబాల), ఆ తర్వాత ఆయనతో కలిసి ఓ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ (సమంత)ను భూలోకంలోనే వదిలిపెట్టి స్వర్గానికి వెళ్లిపోతుంది మేనక. తర్వాత కణ్వ మహర్షి (సచిన్ ఖేడ్కర్) ఆ బిడ్డను చేరదీసి తన ఆశ్రమంలోనే అల్లారు ముద్దుగా పెంచుతాడు. ‘శకుంతల’గా ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతుంది. యుక్త వయసు వచ్చినాక తన ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుని (దేవ్ మోహన్) తో ప్రేమలో పడుతుంది శకుంతల. శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుని, రాజ లాంఛనాలతో ఆమెను తీసుకెళతానని నమ్మ బలికి రాజ్యానికి తిరిగి వెళ్లిపోతాడు దుష్యంతుడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ దుష్యంతుని వద్దకు వెళుతుంది శకుంతల. అప్పటికే ఆమె నిండు చూలాలు. గర్భిణి అని కూడా చూడకుండా ఆమె ఎవరో తెలియనట్లుగా వ్యవహరించి తీవ్రంగా అవమానపరుస్తాడు దుష్యంతుడు. దుష్యంతుడు అలా ప్రవర్తించడానికి కారణమేంటీ.? భర్త కాదన్న స్ర్తీగా శకుంతల జీవితం తర్వాత ఏ మలుపు తిరిగింది.? అసలు చివరికి శకుంతల భర్తను చేరుకుందా.? అన్నది తెలియాలంటే ‘శాకుంతలం’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
సమంత గురించి తెలిసిందే. స్టార్‌డమ్ వచ్చాకా, నటిగా తనను మలచుకోవడానికి ఎలాంటి రిస్క్ అయినా టేకప్ చేస్తోంది. ఛాలెంజింగ్ రోల్స్‌లో తనను తాను చూసుకోవాలనుకుంటోంది. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్‌లో శకుంతల పాత్ర ఒకటి. పౌరాణిక జానపదాల్లో ప్రత్యేకమైన పాత్రగా శకుంతల పాత్రను చరిత్రలో చెప్పుకుంటాం. ఆయా పాత్రలకు ప్రేక్షకుల నుంచి దక్కే గౌరవం, ఆదరాభిమానం ఆ స్థాయిలోనివే. అందుకు ఏమాత్రం తగ్గకుండా నటించేందుకు సమంత మాగ్జిమమ్ ట్రై చేసింది. కానీ, పూర్తి న్యాయం చేయలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. లీడ్ రోల్‌తోనే ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతే, మిగిలిన పాత్రధారుల గురించి ఏం చెప్పగలం.? కానీ, డైరెక్టర్ క్రియేట్ చేసిన ఆయా పాత్రల్లో నటించిన ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదనిపిస్తారు. అన్నట్లు చిన్నప్పటి భరతుడి పాత్ర పోషించిన అల్లు అర్హ స్క్రీన్‌పై చాలా చలాకీగా కనిపిస్తుంది. తన ముద్దు ముద్దు మాటలు ఆకట్టుకుంటాయ్. 

సాంకేతిక వర్గం పని తీరు:
ఇది ఓ జానపద కథ. అందరికీ బాగా సుపరిచితమే. అలాంటి ఓ కథని తీసుకున్నప్పుడు కథనం ఎంత గ్రిప్సింగ్‌గా వుండాలి. ప్రేక్షకుడ్ని సీట్లో కూర్చోబెట్టగల మ్యాజిక్‌తో కూడిన కథనం సాగాలి. అలాంటి కథనాన్ని తెరపై ఆవిష్కరించడంలో గుణశేఖర్ పూర్తిగా విఫలమయ్యాడు. 
ఈ కథలో సెంటిమెంట్ సన్నివేశాలు చాలా చాలా ఎక్కువ. వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. కానీ, అలాంటి హార్ట్ టచ్చింగ్ సెంటిమెంట్ ఫీల్ ఈ సినిమాలో ఏ ఒక్క సన్నివేశం క్రియేట్ చేయకపోవడం దర్శకుడి అనుభవానికి అవమానం. పూర్తిగా డైరెక్టర్ గుణశేఖర్ ప్రయత్నం విపలమే అని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. ఇక, మణిశర్మ మ్యూజిక్ ఇలాంటి కథలకు యాప్ట్ అయినా సరే, ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. పాటలు ఏవో అలా వచ్చి వెళ్లిపోతూంటాయ్. ఏ ఒక్కటీ వినసొంపుగా అనిపించవ్. ప్రణయ గీతాల్సీ సైతం మణిశర్మ ఎందుకో పూర్తిగా లైట్ తీసుకున్నట్లు తోస్తుంది. 
సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు విజువల్‌గా బాగున్నాయ్. భారీతనం బాగా కనిపిస్తుంది. కానీ, అక్కడక్కడా గ్రాఫిక్స్ కొన్ని తేలిపోయాయ్. సాయి మాధవ్ బుర్రా మాటలు బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
కాస్త తక్కువ చెప్పుకుంటే మంచిది. 

మైనస్ పాయింట్స్:
అనుకున్న స్థాయిలో కథనాన్ని డిజైన్ చేయలేకపోవడం,
శకుంతలగా సమంతను సరిగ్గా ఆవిష్కరించలేకపోవడం,  

చివరిగా: ఆనాడు కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం’ అద్భుతమైన దృశ్య కావ్యం. నేడు గుణశేఖర్ అద్భుతం అంటూ తెరకెక్కించిన ఈ వెండితెర ‘శాకుంతలం’ ఓ అదృశ్య కావ్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com