సినిమా రివ్యూ: ‘ఏజెంట్’.!

- April 28, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఏజెంట్’.!

నటీనటులు: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, ముమ్ముట్టి, మురళీ శర్మ తదితరులు.
డైరెక్టర్: సురేందర్ రెడ్డి
మ్యూజిక్: హిప్ హాప్ తమీజా
సినిమాటోగ్రఫీ: రసూల్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాణం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

అఖిల్ అక్కినేని నుంచి నాలుగో చిత్రంగా వచ్చిన సినిమానే ‘ఏజెంట్’. స్ట్లైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘ఏజెంట్’ అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెంచింది. హీరోగా నిలదొక్కుకోవడానికి అఖిల్ పడిన కష్టం ఈ సారైనా ఫలించిందా.? లేదా.? తెలియాలంటే ‘ఏజెంట్’ కథలోకి వెళ్లాల్సిందే. 

కథ:
రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) చిన్నప్పటి నుంచీ ‘రా’ ఏజెంట్ కావాలని కలలు కంటుంటాడు. ‘రా’ కోసమే తన జీవితం అన్నట్లుగా బతుకుతుంటాడు. అయితే, రిక్కీకి చిన్నతనం నుంచీ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అత్యుత్సాహం కూడా ఎక్కువే. ఆ కారణాల వల్లే మూడు సార్లు ‘రా’ ఏజెంట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ‘రా’లో హెడ్ ఆఫీసర్ అయిన డెవిల్ మహాదేవ్ (ముమ్ముట్టి) దృష్టిలో పడతాడు. ఆయన ఇంప్రెషన్ కొట్టేయడానికి తనదైన ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎట్టకేలకు రిక్కీని ఓ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ మిషన్‌లో ఇన్వాల్వ్ చేస్తాడు డెవిల్ మహాదేవ్. ఇంతకీ ఆ డేంజరస్ మిషన్ ఏంటీ.? ఆ మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో రిక్కీ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
అఖిల్ ‘రా’ ఏజెంట్‌గా తనను తాను మలచుకున్న తీరు, స్ర్కీన్‌పై కనిపించిన విధానం ఆకట్టుకుంటాయ్. వైల్డ్ సాలెగా చాలా పవర్ చూపించాడు తన పాత్రలో. యాక్టివ్‌గా కనిపించాడు. తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. వన్ మ్యాన్ షో‌గా సినిమాని తన భుజాలపై మోశాడు. హీరోయిన్ సాక్షి వైద్య ఓకే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతంత మాత్రం ప్రాధాన్యత దక్కింది. తండ్రి పాత్రలో మురళీ శర్మ తన అనుభవాన్ని రంగరించాడు. ఇక, ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాత్ర ముమ్ముట్టి. డిఫరెంట్ వేరియేషన్స్‌లో ముమ్ముట్టి పాత్ర ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సినిమాకి ఈయన పాత్ర హైలైట్ అనే చెప్పాలి. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
డైరెక్టర్ సురేందర్ రెడ్డి అంటే, ఓ స్టైలిష్ స్క్రీన్‌ప్లే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. తాను అనుకున్న కథని స్టైలిష్ స్క్రీన్‌ప్లేతో తెరపై ఆవిష్కరించి మ్యాజిక్ చేయడంలో సిద్ధహస్తుడు సూరి. అయితే, అలాంటి మ్యాజిక్‌లేమీ ‘ఏజెంట్’ నుంచి ఆశించలేం. చాలా రొటీన్‌ స్టోరీ తీసుకుని, అంతకన్నా రోటీన్‌గా కథనాన్ని నడిపించేశాడు సూరి. ‘రేసుగుర్రం’ సినిమాలో స్క్రీన్‌ప్లేతో పరుగెత్తించేస్తాడు. ఎక్కడా ఆడియన్స్‌ని రిలాక్స్ కానివ్వడు. అలాంటిది ఎందుకో ఈ స్పై థ్రిల్లర్‌ని హ్యాండిల్ చేయడంలో సూరి ఎప్పుడూ లేని విధంగా తడబడ్డాడు. ఈ తరహా కథల్లో వుండాల్సిన పట్టు, నెక్స్‌ట్ ఏంటీ.? అనే క్యూరియాసిటీ, ట్విస్టుల మీద ట్విస్టులు, విలన్‌తో హీరో ఎత్తుకు పై ఎత్తులు.. ఇలాంటివి ఊహించుకుని వెళితే, ‘ఏజెంట్’ తీవ్రంగా నిరాశపరుస్తుంది.
చాలా రొటీన్‌గా సాగే యాక్షన్ బ్లాక్స్.. అక్కడక్కడా సాగతీతతో బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలు.. చాలా సాదాసీదాగా సాగిపోతుంటాయ్. హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, ఎలాంటి థ్రిల్ కలిగించదు. సినిమాటోగ్రఫీ ఒకింత బెటర్ అనిపించినా ఎడిటింగ్‌లో చాలా ట్రిమ్మింగ్స్ చేయాలనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయ్. ఓవరాల్‌గా ‘ఏజెంట్’ ఆశించిన స్థాయి టాక్‌నీ, రేంజ్‌నీ అందుకోవడంలో విపలమైనట్లు తోస్తుంది.  

ప్లస్ పాయింట్స్:
గతంతో పోల్చితే అఖిల్ స్ర్కీన్ ప్రెజెన్స్ , అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్,

మైనస్ పాయింట్స్:
బేలవంగా సాగిన కథ, కథనం,
పవర్ ఫుల్ మిషన్ అని బిల్డప్ ఇచ్చినా.. ఆ బిల్డప్‌కి తగ్గట్లుగా కనీసపాటి ఇంట్రెస్ట్ కానీ, ఎలాంటి ట్విస్టులు కానీ లేకపోవడం, మ్యూజిక్..

చివరిగా:
‘ఏజెంట్’ బోర్ కొట్టించే ఓ ‘రా’ యాక్షన్ డ్రామా.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com