నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- April 30, 2023
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి చేరుకున్నారు. మేయిన్ గేట్ వద్ద సీఎం కేసీఆర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడినుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఆయనతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కూడా పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. అనంతరం కేసీఆర్ వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.కొత్త ఛాంబర్లోకి ప్రవేశించిన కేసీఆర్‌కు పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, అధికారులు బొకేలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి కేసీఆర్ కాళ్లకు నమస్కారాలు చేశారు. అనంతరం సచివాలయం మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో కేసీఆర్ పూజలు చేస్తున్నారు. అటు మంత్రులు కూడా తమ కేటాయించిన కొత్త ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు. కొత్త చాంబర్లలోకి వచ్చిన సందర్భంగా మంత్రులకు అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు.
మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి తమ ఛాంబర్లలో కొలువుదీరారు. ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా కేటీఆర్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైల్‌పై కేటీఆర్ తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రాథమిక పాఠశాల టీచర్లకు ట్యాబ్‌లు అందించే ఫైల్‌పై మంత్రి సబితా తొలి సంతకం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్‌పై కేసీఆర్ తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి హరీష్ తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ హరీష్ పేర్కొన్నారు.
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ సర్కార్ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్లో ఉదయం నుంచి పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి దంపతులు ఉదయం నుంచి పూజలు నిర్వహించారు. సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొనగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఖర్చుతో, సర్వాంగ సుందరంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొనకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానం అందిందా? లేదా? అనేది చర్చకు దారితీస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా గవర్నర్ వెళ్లలేదనే చర్చలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









