వాట్సాప్ కీలక నిర్ణయం..

- June 01, 2023 , by Maagulf
వాట్సాప్ కీలక నిర్ణయం..

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలలో నేరాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైమ్‌ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్‌ జాబ్స్ ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అతిపెద్ద యూజర్ బేస్ గల వాట్సాప్ (WhatsApp) వేదికగానూ వీరి ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల గురించి అప్రమత్తం చేసేందుకు, సైబర్ నేరాల గురించి అవగాహన పెంచేందుకు వాట్సాప్ నడుం బిగించింది. ఆన్‌లైన్‌లో యూజర్లు తమని తాము రక్షించుకోవడంలో సాయం చేయడానికి వాట్సాప్ గ్లోబల్ సెక్యూరిటీ సెంటర్‌ (Security Center)ను ప్రారంభించింది.

 11 భాషల్లో ప్రారంభం...

సెక్యూరిటీ సెంటర్‌ స్పామర్లు , అవాంఛిత కాంటాక్ట్‌ల మెసేజ్‌ల నుంచి ఎలా తప్పించుకోవాలో యూజర్లకు తెలుపుతుంది. అంతేకాదు, టూల్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ సెక్యూరిటీ సెంటర్‌ యూజర్ల డిజిటల్ భద్రత కోసం తగిన సేఫ్టీ మెజర్స్, ఉపయోగకరమైన ఫీచర్లు, హిడెన్ ట్రిక్‌ల గురించి తెలియజేస్తుంది. వాట్సాప్ సెక్యూరిటీ సెంటర్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ అనే 10 భాషలలో అందుబాటులో ఉంటుంది. https://www.whatsapp.com/securityలింకుపై క్లిక్ చేయడం ద్వారా ఈ సెక్యూరిటీ సెంటర్‌ను యాక్సెస్ చేయొచ్చు.

సేఫ్టీ మెజర్స్

ఈ సెంటర్‌లో యూజర్లు తమను తాము కాపాడుకునే టూ-స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ మెజర్స్ గురించి తెలుసుకోవచ్చు. స్పామ్ కాల్స్‌ను ఎలా గుర్తించాలి, కామన్‌గా జరుగుతున్న స్కామ్స్‌ ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, సేఫ్టీ టూల్స్ ఎలా వాడాలి లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వెబ్‌పేజీలో వాట్సాప్ పొందుపరిచింది. ఈ సెంటర్ నకిలీ వాట్సాప్ వెర్షన్లు వాడకుండా అఫీషియల్ వాట్సాప్ మాత్రమే వాడాలని కూడా కోరుతోంది. కొత్త గ్రూప్‌లలో జోడించగల వారు ఎవరనేది కూడా యూజర్లు నిర్ణయించవచ్చని తెలిపింది. గ్రూప్ కంట్రోల్స్‌తో అవసరమైనప్పుడు మెంబర్స్‌ లేదా మెసేజ్‌లు తీసివేయాలని సూచించింది.

యూజర్లు హానికరమైన మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌ లేదా బిజినెస్ కాంటాక్ట్స్‌ను రిపోర్టు చేయడం వల్ల వాట్సాప్‌ను అందరికీ సురక్షితంగా ఉంచుతామని కంపెనీ ఈ పేజీ ద్వారా వెల్లడించింది. యూజర్ ఏదైనా కాంటాక్ట్‌ను ఒక్కసారి బ్లాక్ చేస్తే, వారు తిరిగి మళ్లీ యూజర్‌ను చేరుకోకుండా ఆపుతామని హామీ ఇచ్చింది. అకౌంట్ ప్రొటెక్షన్ విషయంలోనూ తగిన సూచనలను చేసింది. ఈరోజుల్లో సైబర్ నేరగాళ్లు తెలివి మీరుతున్నారు కాబట్టి వాట్సాప్ యూజర్లు వీరి వలలో చిక్కకుండా ఉండేందుకు తాజాగా పరిచయం చేసిన సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పక చదవాలి.

ఇండియన్ యూజర్స్ కోసం ప్రత్యేక చర్యలు

ప్రస్తుతం వాట్సాప్ అప్లికేషన్‌లో ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-end encryption) ప్రైవసీతో చాట్స్, కాల్స్, వీడియో కాల్స్ సురక్షితంగా ఉంటున్నాయి. అయినా మోసపోయే అవకాశం ఉన్నందున వాట్సాప్ ఈ సెక్యూరిటీ సెంటర్‌ను పరిచయం చేసింది. యూజర్లను రక్షించడానికి ప్రత్యేక సాంకేతికతను కూడా వాట్సాప్ వినియోగిస్తోంది. ఇక ఇండియాలో స్టే సేఫ్ విత్ వాట్సాప్ వంటి క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తోంది. బ్లాకింగ్, రిపోర్టింగ్ వంటి సాధనాల ద్వారా ఆన్‌లైన్‌లో ఎలా సురక్షితంగా ఉండాలో కూడా చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com