జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..

- June 18, 2023 , by Maagulf
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. పది ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచారు. చిద్విలాస్ రెడ్డికి 360 మార్కులకు గాను 341 మార్కులు వచ్చాయి.

రమేష్ సూర్యతేజా (ఐఐటీ హైదరాబాద్) రెండవ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలనుంచి దాదాపు 30వేల మంది పరీక్షలు రాశారు. వీరిలో పురుషుల విభాగంలో వావిలాల చిద్విలాస్ రెడ్డి (ఐఐటీ హైదరాబాద్) మొదటి ర్యాంకు సాధించారు. మహిళల విభాగంలో నాయకంటి నాగభవ్యశ్రీ టాపర్ గా నిలిచింది. ఆమె 298 మార్కులతో భారతదేశం మొత్తంలో 56వ ర్యాంకు సాధించింది.

ఈనెల 4న జరిగిన ఐఐటీ – జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో రెండు పేపర్లకు కలిపి మొత్తం 1,80,372 మంది హాజరయ్యారు. వీరిలో 43,773 మంది అర్హత సాధించారు. వీరిలో 36,264 మంది అబ్బాయిలు ఉత్తీర్ణులుకాగా, 7,509 మంది మహిళలు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సమారు 45వేల మందిని జోసా కౌన్సెలింగ్ కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

టాప్ 10 ర్యాంకుర్లు వీరే ..
వావిలాల చిద్విలాస్ రెడ్డి (ఐఐటీ హైదరాబాద్ జోన్)
రమేష్ సూర్యతేజా (ఐఐటీ హైదరాబాద్)
రిషి కల్రా (ఐఐటీ రూర్కీ)
రాఘవ్ గోయల్ (ఐఐటీ రూర్కీ)
అడ్డగడ వెంకట శివరామ్ (ఐఐటీ హైదరాబాద్)
ప్రభవ్ ఖండేల్వాల్ (ఐఐటీ ఢిల్లీ)
బిక్కిన అభినవ్ చౌదరి (ఐఐటీ హైదరాబాద్)
మలయ్ కేడియా (ఐఐటీ ఢిల్లీ)
నాగిరెడ్డి బాలాజీరెడ్డి (ఐఐటీ హైదరాబాద్)
యక్కంటి పాణి వెంకట మనీందర్ రెడ్డి (ఐఐటీ హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com