సినిమా రివ్యూ: ‘రంగబలి’.!
- July 07, 2023
లవర్ బోయ్ గుర్తింపు వున్న నాగశౌర్య ఈ మధ్య ప్రయోగాల పేరు చెప్పి చాలా దెబ్బ తినేశాడు. ఇదిలాగే కొనసాగితే, తనకున్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయేదేమో. కరెక్ట్‌గా ఇదే టైమ్‌లో ‘రంగబలి’ కాన్సెప్ట్ పట్టుకున్నాడు.
పవన్ బాసంశెట్టి అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశాడు. కథ పాతదే అయినా, నాగశౌర్య ఇమేజ్‌కి తగ్గ హ్యూమర్ వుండడంతో, ప్రచార చిత్రాలతోనే ‘రంగబలి’ ఆసక్తి క్రియేట్ చేసింది.
ఇక, ముందుగానే ప్రివ్యూలు కూడా పడడం, ప్రివ్యూస్‌కి పాజిటివ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్ ‘రంగబలి’కి. అసలింతకీ సినిమా ఎలా వుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
శౌర్య(నాగశౌర్య)కు తన ఊరంటే చాలా ఇష్టం. ఏం చేసినా సొంతూరిలోనే సింహంలా బతికేయాలనుకుంటాడు. సొంతూళ్లో అయితేనే తాను ఏం చేసినా అందరి చూపూ తన పైనే వుంటుందనుకుంటాడు. అలా అందర్నీ ఎట్రాక్ట్ చేయడం కోసం అప్పుడప్పుడూ కాస్త షో చేస్తుంటాడు కూడా. అందుకే శౌర్యని అందరూ ‘షో’ అని పిలుస్తుంటారు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు) మెడికల్ షాప్ రన్ చేస్తుంటాడు. ఆ షాప్ బాధ్యతలు కొడుక్కి అప్పగించాలనుకుంటాడు. కానీ, ఊళ్లో అల్లరి చిల్లర పనులు చేస్తూ.. అప్పుడప్పుడూ తన సొంత షాపులోనే దొంగతనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు శౌర్య. శౌర్యని ఎలాగైనా మార్చాలన్న వుద్దేశ్యంతో వైజాగ్ పంపిస్తాడు తండ్రి. అక్కడి పార్మసీ ట్రైనింగ్ కోసం ఓ మెడికల్ కాలేజీలో చేరతాడు. అక్కడే హీరోయిన్ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమనూ యుక్తి తండ్రి మొదట్లో ఒప్పుకోగా.. శౌర్య ఊరి పేరు చెప్పగానే అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. రాజవరం ఊరిలోని ‘రంగబలి’ సెంటరే హీరోయిన్ తండ్రి, శౌర్యతో పెళ్లికి అభ్యంతరం చెప్పడానికి కారణం. అసలింతకీ హీరోయిన్ తండ్రికీ, శౌర్య ఊర్లోని రంగబలి సెంటర్‌కీ ఏంటీ సంబంధం.? ఆ విషయం తెలుసుకున్న హీరో ఏం చేశాడు.? సొంతూరిని వదిలి వచ్చేశాడా.? లేక, రంగబలి సెంటర్ హిస్టరీనే మార్చేశాడా.? అనేది తెలియాలంటే సినిమా ధియేటర్లో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
పక్కింటబ్బాయ్ పాత్రలకు నాగ శౌర్య పెట్టింది పేరు. తనకు బాగా అలవాటైన పాత్రలో శౌర్య చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సన్నివేశాల్లో విజృభించేశాడు. హీరోయిన్ యుక్తి కొత్తమ్మాయ్ అయినా చక్కగా నటించింది. తన పాత్రతో తాను హైలైట్ అయ్యింది. అవసరమైన చోట గ్లామరస్‌గానూ కనిపించి యూత్ హృదయాల్ని కొల్లగొట్టేసింది. ఎదుటివారు సంతోషంగా వుంటే చూసి తట్టుకోలేని ‘అగాధం’ పాత్రలో సత్య పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, సత్య ఈ సినిమాకి చాలా చాలా ప్లస్. విలన్‌గా నటించిన షైన్ టామ్ పాత్రలో మొదట్లో పవర్ ఫుల్‌గా కనిపించినా తర్వాత తేలిపోయింది. మిగిలిని పాత్రలు పరిధి మేర ఆకట్టుకున్నాయ్.
సాంకేతిక వర్గం పనితీరు:
కమర్షియల్ సినిమాలకు ప్రాణం కామెడీ. ఆ కామెడీని కావల్సిన చోట చక్కగా చొప్పిస్తేనే ఆ కమర్షియల్ కథ హిట్ ట్రాక్ ఎక్కుతుంది. ఆ పల్స్ బాగా పట్టాడు కొత్త డైరెక్టర్ పవన్ బాసంశెట్టి. అదే పట్టుతో ఫస్టాప్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. అస్సలు బోర్ కొట్టదు. ఫుల్ టైమ్ పాస్. అయితే, సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. పతాక సన్నివేశాల్లోనూ పట్టు కోల్పోయాడు. విలన్ పాత్రను మరింత పవర్ ఫుల్‌గా కంటిన్యూ చేసి వుంటే బాగుండేది. చివరికి వచ్చేసరికి తేలిపోయింది. సెకండాఫ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి వుంటే ‘రంగబలి’ ఇంకా మంచి టాక్ తెచ్చుకునేది. ఎడిటింగ్ ఓకే. పాటలు గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ బడ్జెట్ స్థాయిలో బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. మిగిలిన టెక్నికల్ టీమ్ తన పరిధి మేర బాగానే వర్క్ చేసింది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం, నాగశౌర్య పర్‌ఫామెన్స్, సత్య కామెడీ..
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్, మ్యూజిక్.. వీక్ క్లైమాక్స్..
చివరిగా:
‘రంగబలి’ ఫుల్ టైమ్ పాస్. నాగ శౌర్య ఇమేజ్ ఈజ్ బ్యాక్.!
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!