సినిమా రివ్యూ: ‘బేబీ’.!

- July 14, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘బేబీ’.!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. తొలి ప్రచారం చిత్రం నుంచీ ఈ సినిమా ఆసక్తి రేకెత్తించింది. ప్రమోషన్లు గట్టిగా చేశారు. రిలీజ్‌కి ముందే యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో, ‘బేబీ’పై అంచనాలు పెరిగాయ్.

ఆ అంచనాలతోనే ‘బేబీ’ సూపర్ హిట్ అవుతుందనుకున్నారంతా. అదే నమ్మకంతో ప్రీమియర్ షోలు కూడా సిద్ధం చేశారు. ప్రీమియర్స్‌కి మంచి టాక్ వచ్చింది. ‘అర్జున్ ‌రెడ్డి’ రేంజ్‌లో మాట్లాడుకున్నారంతా. కానీ, ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయిన ‘బేబీ’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. 
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రైటర్ కమ్ నిర్మాత అయిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే, ప్రీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలియాలంటే మొదట కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
వైషూ (వైష్ణవి) బస్తీ అమ్మాయి. అదే బస్తీలో ఎదురింట్లో వుండే తన తోటి కుర్రాడు ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ని స్కూల్ డేస్ నుంచే ప్రేమిస్తుంటుంది. 10 వ తరగతి వచ్చేటప్పటికే వీరిద్దరి మధ్యా ప్రేమ బలపడుతుంది. అయితే, ఆనంద్ 10వ తరగతి తప్పడంతో చదువు మానేసి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి, సిటీలో ఓ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. కాలక్రమంలో వైష్ణవిలో మార్పులొస్తాయ్. హైఫై సొసైటీకి అలవాటు పడుతుంది. ఈ క్రమంలోనే కాలేజీలో ఫ్రెండ్‌గా పరిచయమైన విరాజ్ (విరాజ్ అశ్విన్)తో లవ్‌లో పడుతుంది. ఎంతైనా కాలేజీ లవ్వు కదా.. ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఈ క్రమంలోనే వారిద్దరూ శారీరకంగా దగ్గరవ్వాల్సి వస్తుంది. ఈ విషయం ఆనంద్‌కి తెలిసిందా.? విరాజ్‌తో అన్నిరకాలా దగ్గరైన వైష్ణవి ప్రేమ జీవితం చివరకు ఏ మలుపు తిరిగింది. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంది.? తెలియాలంటే ‘బేబీ’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే. 

నటీనటుల పని తీరు:
ఆనంద్ దేవరకొండకు ఇదే తొలి ధియేటర్ మూవీ అని చెప్పొచ్చేమో. ‘దొరసాని’ అనే చిన్న సినిమాతో పరిచయమ్యాడు. ఆ తర్వాత వెబ్ కంటెంట్‌తో ప్రూవ్ చేసుకున్నాడు. నో డౌట్ ఆనంద్ మంచి నటుడే. అయితే, రెండు రకాల వేరియేషన్స్‌లో కనిపించాడు ఈ సినిమాలో. స్కూల్ డేస్ రోల్ కాస్త ఇబ్బందికరంగా అనిపించినా ఆటో డ్రైవర్ పాత్రలో సహజ సిద్ధంగా నటించేశాడు. భావోద్వేగాలను పండించడంలో ఆనంద్ నూటికి నూరు మార్కులేయించుకున్నాడు.
యూ ట్యూబర్‌గా సుపరిచితురాలైన వైష్ణవీ చైతన్యకు ‘బేబీ’ మంచి డెబ్యూ మూవీ. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయ్. బస్తీ అమ్మాయిగా డీ గ్లామర్ రోల్, సిటీకొచ్చి హైఫై క్యారెక్టర్‌లోనూ మంచి నటన కనబరిచింది. బోల్డ్ సన్నివేశాల్లో గ్లామర్ పండించడంలోనూ ఏమాత్రం మొహమాటపడలేదు. పతాక సన్నివేశాల్లో వైష్ణవి పాత్రే హైలైట్. ఆ మాటకొస్తే, సినిమా మొత్తానికి వైష్ణవి పాత్రే అత్యంత కీలకం. 
విరాజ్ అశ్విన్ కాలేజీ కుర్రాడిగా, కాస్త నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో తన పరిధి మేర నటించి మెప్పించాడు. నాగబాబు, హర్ష తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పని తీరు:
సాయి రాజేష్ మంచి రైటర్. గతంలో సంపూర్ణేష్ బాబుతో పలు సినిమాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమానే ‘బేబీ’. విజయ్ బుల్గాన్ అందించిన మ్యూజిక్ సినిమాని ఒకింత లేపేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా సినిమా రన్ టైమ్ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయ్ దాదాపు మూడు గంటల రన్ టైమ్‌తో సినిమాని వదిలారు. ఇదే ప్రేక్షకుడి నుంచి నెగిటివ్ టాక్ వచ్చేలా చేసింది. చాలా చోట్ల సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టాస్తాయ్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సాగే సాధారణ సంఘర్ణణలు హృద్యంగానే అనిపించినా అది సాగతీత లెక్కల్లోకే వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని బాగా కట్ చేశాడు. అదే ఇంటెన్స్ ద్వితీయార్ధంలో కంటిన్యూ చేయడంలో సాయి రాజేష్ విఫలమయ్యాడు. పాత్రల చిత్రీకరణలో బలం లేకపోవడం క్లైమాక్స్ తేలిపోయింది. అసంతృప్తికరమైన క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అయినట్లు అనిపిస్తుంది. సినిమాటో గ్రఫీ బాగుంది. ఎస్.కె.ఎన్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
కథ, కథా నేపథ్యం.
ఆనంద్, వైష్ణవి పర్‌ఫామెన్స్.. ఇంటర్వెల్ బ్యాంగ్..

మైనస్ పాయింట్స్:
లాంగ్ రన్ టైమ్, తేలిపోయిన క్లైమాక్స్,
సాగదీత సన్నివేశాలు..

చివరిగా:
యూత్‌కి కనెక్ట్ అయ్యే ‘బేబీ’.! భరించడం కష్టమే కానీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com