విజయవాడలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
- August 07, 2023
విజయవాడ: సేంద్రీయ పద్దతులలలో తయారైన చేనేత వస్త్రాలకు విదేశాలలో నుంచి ఆదరణ ఉందని, ఆ దిశగా రైతులు, చేనేత కార్మికుల్లో అవగాహన కలిగిస్తున్నామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఎన్ టి ఆర్ సర్కిల్ సమీపంలోని స్టెల్లా మేరీస్ ఇండోర్ స్టేడియంలొ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఆర్గానిక్ హ్యాండ్లూమ్కు పెరుగుతున్న ప్రాచుర్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది 800 ఎకరాల్లో సేంద్రీయ పద్ధతిలో పత్తి సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించామని, చేనేత రంగంలో అర్గానిక్ వస్త్రాల తయారీ మరెంతో దూరంలొ లేదని వివరించారు. జర్మనీ, పారిస్, జపాన్ తదితర దేశాల్లో భారతీయ చేనేతకు మంచి ఆదరణ లభిస్తోందని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కాలానుగుణమైన మార్పులతో తయారు చేసిన నాణ్యమైన చేనేతకు ఎప్పుడూ గిరాకీ ఉంటుందని ఈ సందర్భంగా సునీత పేర్కొన్నారు.
చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. సాధారణ స్పర్శతో చేతితో వడికిన వస్త్రాలకు, యంత్రాలతో చేసిన వస్త్రాలకు మధ్య తేడాను గుర్తించేలా తగిన పరిశోధనలను ఆహ్వానిస్తున్నామని, అప్పుడే జీఎస్టీ విషయంలో ఓ నిర్ణయానికి వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కొంతమంది వ్యాపారులు పవర్లూమ్ వస్త్రాలను చేనేత వస్త్రాలుగా భ్రమింపజేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని, పదివేల విలువైన పట్టు చీరను రెండువేలకే ఇస్తామంటారని, రెండింటి మధ్య తేడాను సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణంగా చేనేత వస్త్రానికి అంచున చిన్న సూదితో గుచ్చినటువంటి మార్కులు కనిపిస్తాయని, పవర్లూమ్ మీద తయారు చేయబడిన వస్త్రానికి అటువంటివి ఉండకపోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆప్కో, చేనేతశాఖ సంయుక్తంగా ఈనెల 12 వరకు చేనేత ప్రదర్శన, విక్రయాలు జరుపుతున్నామన్నారు. చేనేత సంస్కృతికి వస్త్రాలు ప్రతీక, పర్యావరణానికి ఎంతో మేలు కలిగిస్తాయన్నారు. లక్ష 75 వేల మందికి ఉపాధి చూపుతోందన్నారు.
శాసనమండలి సభ్యుడు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ చేనేత సాంప్రదాయ కళ అని చేనేత వస్త్రాలు ధరించటం ఎంతో హుందాతనాన్ని ఇస్తాయని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర వస్తు బహిష్కరణ లో ఈ చేనేత చాలా ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. చేనేత జౌళి శాఖ కమీషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంతో మద్దతునిస్తూ ప్రతి జిల్లాలోని ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తిస్తూ వన్ డిస్ట్రిక్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ చేనేతల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతంరెడ్డి మాట్లాడుతూ చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా ముందడుగు వేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఎస్.ఢిల్లీరావు మాట్లాడుతూ చేనేత వస్త్రాల వినియోగం పెరగాలని ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. ఆప్కో మాజీ ఛైర్మన్ చిల్లపల్లి మోహన రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమం నుంచి చేనేతకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
ముఖ్యకార్యదర్శి సునీత స్వయంగా రాట్నం వడికారు. సంప్రదాయ చేనేత వస్త్రాలు ధరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనను తిలకించారు. చేనేత సహకార సంఘాల ద్వారా ఎక్కువ విక్రయాలు చేస్తోన్న నిర్వాహకులను సత్కరించారు. తన ప్రసంగంలో తొలుత జిల్లాల వారిగా ప్రాముఖ్యత కలిగిన చేనేత రకాల వివరాల గురించి సునీత ఆహుతులను అడగగా, అందరి కంటే వేగంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సమాధానాలు చెప్పి అబ్బుర పరిచారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తయారు చేస్తోన్న ప్రముఖ చేనేత వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు నాగేశ్వరరావు, కన్నబాబు, ఆప్కో జిఎం తనూజారాణి, మార్కెటింగ్ అధికారి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్‌కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్‌లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!







