చిరుత దాడితో నడకదారి పై టీటీడీ కీలక నిర్ణయాలు

- August 14, 2023 , by Maagulf
చిరుత దాడితో నడకదారి పై టీటీడీ కీలక నిర్ణయాలు

తిరుమల: తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర భయాందోళన నింపింది. ఈ క్రమంలో నడకదారిలో వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ హైలెవల్ కమిటీ మీటింగ్ జరిగింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, అడిషినల్ పీ.సీ.సీ.ఎఫ్ శాంతిప్రియ పాండే, సిసిఎఫ్ నాగేశ్వరరావు, డీఎఫ్ ఓ సతీష్ తదితర అధికారులు ఇందులో పాల్గొన్నారు. హైలెవెల్ మీటింగ్ లో నడకదారుల్లో భక్తుల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12ఏళ్ల చిన్న పిల్లలకు అనుమతి ఇచ్చారు.

మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలాగే నడకదారి భక్తుల సేఫ్టీ కోసం ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, ఘాట్ రోడ్డులో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ చైర్మన్ డెసిషన్ తీసుకున్నారు. అలాగే, భక్తుల రక్షణ కోసం టీటీడీ ఖర్చుతో నిపుణులైన ఫారెస్ట్ సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించారు.

హైలెవెల్ మీటింగ్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..

  • నడకదారిలో భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్ళాలి.
  • పెద్ద వాళ్ళను రాత్రి 10 వరకు అనుమతిస్తాం.
  • నడకమార్గంలో భక్తులు జంతువులకు తినుబండారాలు ఇవ్వడం నిషేధం.
  • అలాంటి అమ్మకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం.
  • అలిపిరి నుంచి తిరుమల వరకు 500 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • నడకమార్గంలో ఇరువైపుల ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • నడకమార్గంలో ఫెన్సింగ్ పై కేంద్ర అధ్యయన కమిటీ సలహా మేరకు నిర్ణయం.
  • అలిపిరి, గాలిగోపురం, 7వ మైలు ప్రాంతాల్లో ప్రమాదాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు చర్యలు.

తిరుమల అలిపిరి నడకదారిలో ఆరేళ్ల చిన్నారి లక్షితను చిరుత పులి చంపి తిన్న నేపథ్యంలో టీటీడీ కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిల్లలపై ఆంక్షలు విధించింది.

తిరుమలలో మరోసారి చిరుత దాడితో కలకలం రేగింది. అలిపిరి కాలినడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం(ఆగస్టు 11) ఈ దారుణం వెలుగు చూసింది. ఆగస్టు 10వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత తప్పిపోయింది. రాత్రి సమయంలో గాలింపు చర్యలు కుదరకపోవడంతో పోలీసులు ఉదయం వెతుకుతుండగా బాలిక మృతదేహం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో కనిపించింది. బాలిక మృతదేహాన్ని చిరుత సగం తిన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం. కాగా, జూన్ 11న ఓ బాలుడిపై ఇలాగే చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com