అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- September 20, 2023
హైదరాబాద్: తన జీవితాన్ని తానే మలచుకున్న అమరశిల్పి అక్కినేని నాగేశ్వరరావు అని భారత దేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్డూడియోస్ లో ఏర్పాటు చేసిన వారి విగ్రహాన్ని, వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అక్కినేని స్మృతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, కష్టేఫలి అన్న సూత్రాన్నివిశ్వసించి, తన జీవితాన్ని తాను మలచుకుని ఉన్నత శిఖరాలకు చేరిన అక్కినేని నాగేశ్వరరావు సదాస్మరణీయుడని అన్నారు. కొంత మంది జీవితాంతం (జీవనకాలం) వరకు జీవిస్తారని, కొందరు జీవితానంతరం (మరణించిన తర్వాత) కూడా జీవిస్తారని, అటువంటి ప్రముఖుల్లో అక్కినేని ఒకరని చెప్పారు.అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడిగా ఎదగడంతో పాటు జీవితంలో కొన్ని విలువలు, ప్రమాణాలు (వ్యాల్యూస్, స్టాండర్డ్స్) నెలకొల్పారని చెప్పారు.అక్కినేని నాగేశ్వరరావు చివరి వరకు విలువలకు కట్టుబడి జీవించారని, వారి జీవితాన్ని ఈ తరం వారు స్ఫూర్తిగా తీసుకుని ఏ రంగంలో ఉన్నా విలువలు పాటించాలని పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజల గుండెల్లో బాలరాజుగా, దేవదాసుగా, దసరా బుల్లోడుగా చిరయశస్సు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం అని తెలిపారు.అక్కినేని అభినయం, వాచకం, నృత్యాలు వేటికవే ప్రత్యేకమన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు, తొమ్మిది పదుల పరిపూర్ణ జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకం వరకూ నటిస్తూనే జీవించారని పేర్కొన్నారు. వారి నటన గురించి తెలుగు వారికి కొత్తగా చెప్పాల్సింది, పరిచయం చేయాల్సిందేమీ ఏమీ లేదన్న ఆయన,అక్కినేని అందుకున్న అవార్డులు, రివార్డులు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలే వారి నటనా వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు.
ఎంతో పరిణతి కలిగిన ఆశావాది ఏయన్నార్ లో కనిపిస్తారన్న ఆయన, నాస్తికుడైనప్పటికీ వారిలోని తాత్విక కోణం అద్భుతమైనదని తెలిపారు. ఆడంబరాలు లేకుండా, వ్యక్తిగత జీవితంలో అతి అంచనాలతో కాకుండా, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగిన వారి ఓర్పు ఆదర్శనీయమైనదని పేర్కొన్నారు.
వాసి పరంగా ఉన్నతమైన సినిమాల్లో ఏయన్నార్ నటించారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, వారి స్ఫూర్తి ఈతరం సినిమా రంగానికి ఆదర్శనీయమని తెలిపారు. ఆయన ఒక గొప్ప సినీ విశ్వవిద్యాలయమని, నేటి తరం సినీరంగ ఔత్సాహికులు ఆయన నుంచి నేర్చుకుని రాణించాలని సూచించారు. గతానికి వర్తమానానికి మధ్య వారధి నిర్మించే గురుతర బాధ్యత సినిమా మాధ్యమం మీద ఉందన్న వెంకయ్యనాయుడు, సినిమా నలుగురి మంచి కోరుకునే సృజనాత్మక కళే సినిమా అని, ప్రేక్షకులకు సాంత్వన, ఉల్లాసం, విశ్రాంతి, ఉత్తేజం, చైతన్యం, విజ్ఞానం, వివేకం కలిగించే సినిమాను ముందు తరాలకు చెప్పుకునే విధంగా మలచాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అక్కినేనితో తమకున్న వ్యక్తిగత అనుభవాలను పంచుకున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు ఆయన జీవితాన్ని ఎలా మలిచాయో వివరించారు. జీవితం విలువ తెలుసుకుని, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని, జీవితాన్ని ప్రేమించి, పోరాడి, ఆస్వాదించి... నేర్చుకున్న దాన్ని ఆచరణలో చూపారని పేర్కొన్నారు. ఎప్పటికప్పడు తనను తాను మదింపు వేసుకుంటూ ఆత్మ విశ్వాసంతో జీవితాన్ని నిర్మించుకున్న ఆయన నుంచి నేటి తరం తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు.
షేర్ అండ్ కేర్ – పదిమందితో పంచుకో, పదిమంది బాగు కోరు అన్న భారతీయ సనాతన ధర్మాన్ని శ్రీ అక్కినేని ఆచరణలో చూపారని, తాను నేర్చుకున్న విషయాలను, విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడమే కాకుండా తన సంపాదన నుంచి ఎన్నో గుప్తదానాలు చేశారని చెప్పారు. విద్యాసంస్థలకు ఆయన చాలా విరాళాలు ఇచ్చారన్నారు. నటన ఏయన్నార్ వృత్తి మాత్రమేనని.. క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం, కార్యదీక్ష, ఓర్పు, నిరాడంబరత కలిగిన వారి వ్యక్తిత్వం గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకట్, నాగార్జున,నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులందరినీ వెంకయ్యనాయుడు అభినందించారు.


తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







