సినిమా రివ్యూ: ‘కీడా కోలా’.!

- November 03, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కీడా కోలా’.!

తరుణ్ భాస్కర్.. చేసింది రెండే సినిమాలైనా దర్శకుడిగా ఓ స్పెషల్ క్రేజ్ దక్కించుకున్నాడాయన. సెన్సేషనల్ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండకు ఫస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఈయనే. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండకు హీరోగా ఎంత క్రేజ్ వచ్చిందో.. డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్‌కీ అంతే క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘మీకు మాత్రమే చెబుతా’ అంటూ తన రెండో సినిమాతోనూ తరుణ్ భాస్కర్ పాపులర్ అయ్యారు.

కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగానే సెపరేట్ పంథా తరుణ్ భాస్కర్‌ది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘కీడా కోలా’. ఈ మధ్య ప్రమోషన్లలో బాగా వినిపిస్తున్న సినిమా ఇది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చైతన్య మందాడి, బ్రహ్మానందం, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్,  విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరి ‘కీడా కోలా’ యూనిట్ చెప్పినట్లుగా ప్రేక్షకుల్ని ఆధ్యంతం వినోదాత్మకంగా ఆకట్టుకుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
వాస్తు (చైతన్య మందాడి), లాయర్ అయిన కౌశిక్ (రాగ్ మయూర్) ఇద్దరూ డబ్బు సంపాదించడానికి నానా కష్టాలు పడుతుంటారు. చివరికి కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని ఓ ప్లాన్ వేస్తారు. అందులో భాగంగానే తాత వరద రాజు (బ్రహ్మానందం) కోసం కొన్న కూల్ డ్రింక్ బాటిల్‌లో బొద్దింకను చూపించి ఆ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేయాలన్నదే వారి ప్లాన్ వుద్దేశ్యం. ఈ ప్లాన్‌లో భాగంగానే 5 కోట్లకు బేర సారాలు మొదలెడతారు. ఇదిలా వుంటే, మరోవైపు జీవన్ (జీవన్ కుమార్) కార్పోరేటర్ కావాలని ఆశ పడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో వుండి వచ్చిన తన అన్న నాయుడు (తరుణ్ భాస్కర్)తో కలిసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కానీ, అందుకోసం చాలా డబ్బులు అవసరం పడతాయ్. సో, ఈ ఇద్దరూ కూడా డబ్బు కోసం ఓ చిలిపి ప్లాన్ వేస్తారు.? అలా అటు వాస్తు టీమ్, ఇటు జీవన్ టీమ్ డబ్బు కోసం వేసిన ప్లాన్స్ ఫలించాయా.? అసలు ‘కీడీ కోలా’ అని సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టారు.? అనేది తెలియాలంటే ‘కీడా కోలా’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ఓ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ ఇది. డైరెక్టర్ మోటో ఆధ్యంతం ప్రేక్షకుల్ని నవ్వించడమే. ‘కీడా.. ఇందులో వుంది తేడా..’ అంటూ సినిమాలో పదే పదే ఈ డైలాగ్ వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆయా పాత్రల చుట్టూ సాగే కథనం కడుపుబ్బా నవ్విస్తుంటుంది. తరుణ్ భాస్కర్ నటన, మేకింగ్ స్టైల్ ఆల్రెడీ గత రెండు చిత్రాల్లోనూ చూసేశాం. కానీ, ఈ సినిమా వాటికి కాస్త భిన్నంగా వున్నప్పటికీ ఓవరాల్‌గా నవ్వించడమే ఆయన టార్గెట్. ‘కీడా కోలా’తో ఓ కొత్త ప్రయత్నం చేశాడు ఆ నవ్వు కోసం తరుణ్ భాస్కర్. అందులో ఒకింత సక్సెస్ అయ్యాడనే అభిప్రాయాలొస్తున్నాయ్. నాయుడిగా తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చాక కథలో మరింత వేగం, ఊపు పెరుగుతాయ్. బ్రహ్మానందం వరదరాజు పాత్రలో వీల్ ఛైర్‌కే పరిమితమైపోయినప్పటికీ ఆయన స్టైల్‌లో నవ్వులు పూయించడంలో మాత్రం హండ్రెడ్ పర్సంట్ మార్కులేయించుకుంటారు.  అందుకు ఈక్వెల్ అనలేం కానీ,  ఏమాత్రం తగ్గకుండా పోటీ పడి నటించాడు తరుణ్ భాస్కర్. కీడా కోలాకి బ్రాండ్ అంబాసిడర్‌గా రకరకాల గెటప్స్‌లో గెటప్ శీను సందడి ఆధ్యంతం వినోదం పంచుతుంది. అలాగే, వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ సందడి చెప్పనే అక్కర్లేదు. కామెడీ రచ్చే. చైతన్య రావు మాటలు సరిగ్గా పలకలేని పాత్రలో కనిపించి మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ప్రతీ చిన్న పాత్ర కూడా తమ వంతు నవ్వులు పూయించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
నటుడిగా, దర్శకుడిగా ఏజ్ యూజ్‌వల్ తరుణ్ భాస్కర్ మంచి మార్కులేయించుకున్నాడు. హాయిగా నవ్వుకోవాలనుకునేవాళ్లు ‘కీడా కోలా’ సినిమా చూసేందుకు ధియేటర్‌కి వెళ్లొచ్చు. కానీ, ఓటీటీలో అయితేనే ఈ సినిమాకి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చన్న అభిప్రాయాలు ఆడియన్స్‌ నుంచి వినిపిస్తున్నాయ్. షార్ట్ ఫిలింకి ఎక్కువ.. సినిమాకి తక్కువ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అయితే, సినిమా సాంకేతికంగా వున్నతంగా కనిపిస్తుంది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి వుండాల్సిన రేంజ్‌లో ఒకింత సినిమాకి బలంగా చేకూర్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్, కెమెరా వర్క్.. అన్నీ బాగున్నాయ్. ఓవరాల్‌గా సాంకేతికంగా ‘కీడా కోలా’కి ఎలాంటి వంకలు పెట్టడానికి లేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్, సెకండాఫ్.. ఈక్వెల్‌గా ఎక్కడా తగ్గకుండా బోర్ కొట్టించకుండా నవ్విస్తూనే వున్నారు. ప్రతీ చిన్న పాత్ర నుంచీ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కథ లేకపోయినా కామెడీ కథనంతో ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పించగలగడమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
మ్యూజిక్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్:
నెక్స్‌ట్ ఏం జరుగుతుంది అని ముందే ప్రేక్షకుడి ఊహకు అందడం.. చివరిలో రివీల్ అయిన కీడా.. సన్నివేశంలో అంతగా పస లేకపోవడం..

చివరిగా:
‘కీడా.. ఇందులో వుంది చాలా తేడా..’  కానీ,  కామెడీ రచ్చో రచ్చహ రచ్చోభ్యహ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com