యూఏఈ లో వైభవంగా దసరా బొమ్మల కొలువు సంబరాలు
- November 13, 2023
యూఏఈ: దసరా, హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు.
యూఏఈలో ప్రత్యేకం..
యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున్న పండుగలను వైభవంగా జరుపుకుంటారు. ఏటా బతుకమ్మ – దసరా- దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఈ సంబరాలకు యూఏఈ నలుమూలల నుండి వేలాది మంది ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరవుతారు. దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరుపుతారు. ఆ తర్వాత ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేస్తారు.
దసరా బొమ్మల కొలువు..
సాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే బొమ్మల కొలువునే దసరా బొమ్మల కొలువు అని కూడా అంటారు. దసరా నవరాత్రులలో పది రోజులు (9 రాత్రులు) ఈ సరదా బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు. యూఏఈలో బొమ్మల కొలువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.
బొమ్మల కొలువు విశిష్ఠత, అలంకరణ..
మహిషాసురుడి ని వధించడానికి అమ్మవారికి అందరు దేవతలు తమ శక్తులను అమ్మవారికి సమర్పించుకుంటారు. అమ్మవారు ఆ దేవతలను బొమ్మలుగా మార్చి 9వ రోజు యుద్ధం చేస్తారు. 10వ రోజు మహిషాసురుడిని వధిస్తారు. ఆ 9వ రోజులు బొమ్మలుగా దేవతలు జీవం పోసుకొని దుర్గమ్మను పూజిస్తారని నానుడి. బొమ్మల కొలువు ను చెక్క తో 3,7,9,11 మెట్లు గా అమర్చుకోవాలి. వాటి మీద తెల్లని వస్త్రము ఉంచి బొమ్మలు అమర్చుకోవాలి. మొదటి మెట్టు దేవతా మూర్తులను, దశావతారము ,అష్ట లక్ష్మి అవతారము, శివ పార్వతి, సరస్వతి, గణపతి మూర్తులు, బొమ్మలు ముందు కలశము పెట్టి ప్రాణ ప్రతిష్ట చేయాలి. ఆఖరి మెట్టు జంతువులు మనుషులు ఇళ్లు పక్షులు చెట్లు అమర్చుకోవాలి. ఈ తొమ్మిది రోజులు నైవేద్యం తో పూజ చేయాలి. ఇంటికి అందరినీ పిలిచి లలిత సహస్ర పారాయణం చేసి భోజనం అనంతరం పసుపు కుంకుమ తాంబూలం తో ఆశీర్వాదం పొందాలి.
అమ్మవారి అలంకరణలు..
1 . మా ఇంట్లో అందరూ కనకదుర్గ ఉపాసకులే: వందిత రమేష్ (దుబాయ్)..
తమ ఇంట్లో అందరూ కనకదుర్గ ఉపాసకులేనని రాజమండ్రికి చెందిన వందిత రమేష్ తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి అమ్మవారి పూజలు చేయడం అంటే ఇష్టమన్నారు. "మా గురువుగారు అయిన భారతీ శిక్షణలో ఆధ్యాత్మికంగా మరోక మొట్టుకు చేరుకున్నాను. ఎప్పటినుండో నవదుర్గలను పెట్టాలని ఒక దృఢమైన సంకల్పం. ఆ తల్లి అనుగ్రహంతో ఈసారి నా కోరిక నేరవేరింది. 160 మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందరికీ తాంబూలాలు ఇచ్చి ముత్తైదువల ఆశీర్వాదం పొందటం నా అదృష్టం. దసరా అంటే 9 రోజుల పండుగ, 9 అవతారాలు, 9 రంగులు. ఈ సారి నవదుర్గలతో పాటు శివ పార్వతులను పెట్టడం ఒక ప్రత్యేకతగా నిలిచింది.’’ అని చెప్పారు.


2 . ఆ తొమ్మిది రోజుల అనుభూతి ఓ గొప్ప ప్రేరణ: లక్ష్మిరెడ్డి (దుబాయ్)
నవరాత్రుల్లో ప్రతి రోజూ అమ్మవారిని విశిష్టమైన అలంకారాల్లో కొలుస్తామని లక్ష్మిరెడ్డి తెలిపారు. ఒక్కోరోజు ఒక్కో రంగు చీరలో అలంకరించి, భిన్న ప్రసాదాల్ని నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి కొలుస్తామని.. లక్ష లలిత సహస్రనామాన్ని పఠించడం తమ ప్రత్యేకత అన్నారు. ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేక దినంలా జరుపుకుంటామని వెల్లడించారు. ఈ తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా అమ్మవారిని శక్తిమేరా కొలుచుకోవటం ఓ గొప్ప అనుభూతి, అలాగే ఈ అభుభూతి మరింత అందంగా అమ్మవారిని ప్రతి ఏటా కొలుచుకునేందుకు ప్రేరణ అని
లక్ష్మిరెడ్డి అన్నారు.




3 . అమ్మవారికి ప్రత్యేక పూజలు: లక్ష్మి పన్యాల (దుబాయ్)
దసరా పండుగ సందర్భంగా మా ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుంది. ప్రతి రోజూ విజయవాడ దుర్గా అమ్మవారిని అలంకరించిన విధంగా బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మహాలక్ష్మి, సరస్వతి, కాత్యాయని, మహా చండి, దుర్గా, మహిషాసుర మర్థిని మరియు రాజరాజేశ్వరి అలంకరణతో పూజలు నిర్వహిస్తాము. ప్రత్యేక రంగులరంగుల పువ్వులతో అదే రంగు చీరలతో ఎంతో ప్రాధాన్యత ఉన్న అమ్మ వారిని అలంకరించి పూజలు చేసి తరిస్తామని లక్ష్మి పన్యాల తెలిపారు.



4 . 9 రోజులలో సానుకూల అనుభూతిని కలిగిస్తుంది: గరిమెళ్ల విజయలక్ష్మి (షార్జా)
గరిమెళ్ల విజయలక్ష్మి గత 20 ఏళ్లుగా షార్జాలో ఉంటున్నారు. తను గత 15 సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు. యూఏఈలో చాలా మంది దక్షిణ భారతీయులు ఉన్నారని, తమ ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడల్లా స్త్రీలు లలితా సహస్రనామం, సౌందర్య లహరి జపించడానికి వస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మహిళల సంఖ్య పెరుగుతోందన్నారు. సాధారణంగా అమ్మవారిని 7 నుండి 9 రోజులు ఉంచుతానని, ఆ 9 రోజులలో ఇది సానుకూల అనుభూతిని కలిగిస్తుందన్నారు. అలాగే షార్జాలో ఉండే శ్రీలక్ష్మి సరస్వతి అమ్మవారిని ఉంచానని, ఉమ్ అల్ కువైన్లో ఉంటున్న బిందు రెడ్డి నవరాత్రుల 7వ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానని గరిమెళ్ల విజయలక్ష్మి తెలిపారు.


5 . నీలం రంగు చీరలతో పారాయణం: ప్రియాంక సంతోష్ (దుబాయ్)
దేవి నవరాత్రుల సందర్భంగా అల్ ఫుర్జన్లో నివసిస్తున్న ప్రియాంక వెల్ముర్ వాళ్ల ఇంట్లో, స్నేహితురాళ్లతో కలిసి దేవి స్త్రోత్ర పారాయణ నిర్వహించాం. ఆ రోజు అమ్మవారి అవతారం సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నీలం రంగు చీరలతో పారాయణకి వచ్చారు మహిళలు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గా పారాయణం జరిగిందని ప్రియాంక సంతోష్ వెల్లడించారు.

6 . సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తాము: బిందు రెడ్డి (ఉమ్ అల్ కువైన్)
మూల నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలు అయిన నవరాత్రులలో అమ్మవారిని ఆరాధిస్తామని బిందు రెడ్డి పేర్కొన్నారు. సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తామని తెలిపారు. తెలుపు వస్త్రాలను ధరింపజేసి నెమలి వాహనం మీద కూర్చోబెడతామని పేర్కొన్నారు. నవరాత్రుల సమయంలో అందరిని ఆహ్వానించి తాంబులాలు అందజేసి ఆశీర్వాదం పొందుతామని తెలిపారు.

7 . నవరాత్రి ఉత్సవాలు తమకు ప్రత్యేకం: శ్రీలక్ష్మి (షార్జా)
నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా జరుపుకుంటామని శ్రీలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా మూలా నక్షత్రం ఆశ్వయుజ శుద్ధ సప్తమీ నాడు చదువుల తల్లి సరస్వతీ దేవి రూపంలో అలంకారం చేస్తామన్నారు. చైతన్య స్వరూపిణిగా పురాణాలు కీర్తించిన సరస్వతీ దేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తామని, నైవేద్యాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. కమ్యూనిటీలోని మహిళలందరూ వచ్చి పూజల్లో పాల్గొంటారని తెలిపారు. నవరాత్రులు తమకు ప్రత్యేకమన్నారు.


8 . త్రిశక్తులతో ఒక మహాశక్తి సరస్వతీ దేవి: సుభాషిణి శ్రీనివాస్ (షార్జా)
నవరాత్రులను ఘనంగా జరుపుకుంటామని సుభాషిణి తెలిపారు. ఆరవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవీ అలంకారంలో అమ్మవారిని కొలుస్తామన్నారు. త్రిశక్తులతో ఒక మహాశక్తి సరస్వతీ దేవి అని తెలిపారు. ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తామని, ప్రసాదంగా కేసరి లేదా పరమాన్నం నివేదిస్తామన్నారు. సొంత దేశానికి దూరంగా యూఏఈలో తోటి భారతీయుల మధ్య ఇలా నవరాత్రులను జరుపుకోవడం ఆనందం కలిగిస్తుందన్నారు.

దసరా బొమ్మల కొలువులు...
1 . పూర్వీకుల నుండి ఆనవాయితీగా బొమ్మల కొలువు: ధరణి ఆర్కాట్ (దుబాయ్)
ధరణి ఆర్కాట్ 23 సంవత్సరాలుగా దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. తమ పూర్వీకుల నుండి బొమ్మల కొలువును ఆనవాయితీగా తీసుకొని దసరా నవరాత్రి లు జరుపుకుంటున్నట్లు తెలిపారు. గత 23 ఏళ్లుగా తమ ఇంటి సంప్రదాయమైన బొమ్మల కొలువు ను ప్రతి సంవత్సరం దసరా నవరాత్రిలో జరుపుకుంటామన్నారు. దుబాయ్ లో మన గుడిని మా ఇంటి బొమ్మల కొలువుగా పెట్టాలనే ఆలోచనతో ఈ సారి ఆలయ థీమ్ గా పెట్టినట్లు చెప్పారు. ఏడు సముద్రలే కాదు ఏడు ఖండాలు దాటినా మన సంస్కృతిని సంప్రదాయాలని మరిచిపోలేదన్నారు ధరణి ఆర్కాట్.



2 . బొమ్మల కొలువులో ఇష్ట దైవం: ప్రియాంక తాడికొండ (దుబాయ్)
బొమ్మల కొలువులో ఇష్ట దైవం పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి, అష్టలక్ష్మి, నవదుర్గ, దశావతారాలు, పెళ్లి బొమ్మలు, డ్యాన్సింగ్ బొమ్మలు, ఇంకా కొన్ని బొమ్మలు, అలంకారాలు ఉన్నాయి. నేను పుట్టి పెరిగిన తెలంగాణా లో బతుకమ్మ ఎంతో విశిష్టతతో కూడుకున్న పండుగ. దసరా సమయంలో వచ్చే ఈ బతుకమ్మ ను సైతం బొమ్మల కొలువులో చేర్చటం జరిగింది. ఊయలలో అమ్మవారు నేను మొదటి నుండి తయారు చేసినది, అందరి ప్రశంసలు పొందింది. దేవిని పూర్ణహృదయంతో అలంకరించడం; దేవతలకు సేవ అని నేను నమ్ముతున్నాను. దైవంపై మన ప్రేమను చూపించే మార్గం అలంకరణ అని నేను నమ్ముతున్నాను. ఇది చాలా సానుకూలతను, గొప్ప శక్తిని తెస్తుంది. నేను దానిని "అలంకార సేవ" అని పిలుస్తానని ప్రియాంక తాడికొండ వివరించారు.


3 . ప్రతిసారి భిన్నంగా పెట్టేందుకు ప్రయత్నిస్తాను: గాయత్రి (దుబాయ్)
బొమ్మల కొలువు అంటే సందడి వేరే లేవెల్. అమ్మవారిని అలకరించడం దగ్గర నుంచి నైవేద్యాలు సమర్పించడం, అతిథులకు తాంబులాలు ఇవ్వడం వరకు అంత సందడిగా ఉంటుంది. ‘‘చిన్నప్పుడు మా అమ్మ బొమ్మలు కొలువు పెట్టేది. ఇప్పుడు భర్త సహకారంతో బొమ్మల కొలువును పెడుతున్నాను. బొమ్మల ఎంపిక నుంచి వాటిని అమర్చడం, లైటింగ్ వరకు ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను.అమ్మవారి ప్రతిరూపాలను ఏర్పాటు చేయడం ఎప్పుడూ తనకు ప్రత్యేకమే. ప్రతిసారి భిన్నంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాను.’’ అని తెలిపారు.

తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









