మహానాడుకు సర్వం సిద్ధం
- May 26, 2016
తె లుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు సర్వం సిద్ధమైంది. తిరుపతి వేదికగా మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక సహా ప్రాంగణాలు, ప్రత్యేక గ్యాలరీలు సిద్ధమయ్యాయి. రెండు తెలుగురాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆత్మీయ ఆతిథ్యం పలికేందుకు తిరుపతి వేదిక ముస్తాబైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయానికి తిరుపతికి చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నగరంలోని నెహ్రూ పురపాలక మైదానంలో ప్రధాన వేదిక సహా ఇతర ప్రాంగణాలను ఏర్పాటుచేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇరువైపులా కూలర్లు ఏర్పాటుచేశారు. ఎక్కడా రాకపోకలకు ఆటంకం లేకుండా వేదికనుంచి చివరివరకు బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతినిధులకు నిత్యం 27 రకాల వంటకాలను వడ్డించేందుకు రంగం సిద్ధమైంది.రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు: ప్రతినిధులు, వీవీఐపీలు, మహిళలు.. ఇలా వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. వీటికి సమీపంలోనే తెదేపా వైభవాన్ని చాటే చిత్రాలు కొలువుదీరాయి. రక్తదాన శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, కల్యాణమండపాలు కేటాయించారు. ఎవరికివారు తమ బసలకు బుధవారం రాత్రే చేరుకున్నారు. సంబంధిత కమిటీల ప్రతినిధులు దగ్గరుండి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.ఉదయం పది గంటలకు ప్రాంగణానికి చంద్రబాబు: ఉదయం పదింటికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని 3డీ షోను ప్రారంభిస్తారు. ఆపై ఫొటోగ్యాలరీ, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అక్కడినుంచి నేరుగా ప్రధాన వేదికపైకి చేరుకుంటారు. అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆయన ప్రసంగంతో ఆరంభమయ్యే మహానాడు తొలిరోజు కార్యక్రమాలు సాయంత్రం ఆరింటి వరకు కొనసాగుతాయి. దీనిలో భాగంగా.. గురువారం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావు, ఎంపీలు మాగంటి బాబు, సీఎం రమేష్ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.
మహానాడు ప్రాంగణంలో కృత్రిమ పొగమంచు: తిరుపతిలోని మహానాడు ప్రాంగణంలో చల్లదనాన్ని తీసుకురావడానికి తెదేపా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ప్రాంగణంలో కృత్రిమ పొగమంచును నింపే ఏర్పాట్లు చేశారు. సమావేశ ప్రాంగణం చుట్టూ ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుచేసి నీటి యంత్రాల ద్వారా పొగ తరహాలో తుంపర్లు విడుదల చేయనున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కృత్రిమ పొగమంచును గురువారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
భవిష్యత్తుకు దిశానిర్దేశం : రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని తెదేపా మహానాడు వేదికగా నిర్ణయించనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని...భవిష్యత్తుకు దిశానిర్దేశం కోసం పలు అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం ఇది రెండో మహానాడు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి కూడా దాదాపుగా అంతే కాలమైంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల అంశాలపైనా దృష్టిపెట్టనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష....వాటిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపైనా కొంత చర్చ జరగనుంది. భవిష్యత్తు మరింత ప్రజాదరణ పొందేందుకు ఏం చేయాలన్న అంశంపై ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. తెలంగాణకు సంబంధించి పార్టీని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేలా తీర్మానాలు ఉండనున్నాయి. ఏపీకి సంబంధించి 13అంశాలు, తెలంగాణకు సంబంధించి 8అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఉమ్మడిగా ఏడు తీర్మానాలుంటాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









