‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు
- December 06, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ ఒకటి. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో అమలవుతోన్న ఈ పథకం వివరాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం అతి త్వరలోనే బెంగళూరుకు వెళ్లనుంది. రెండు రోజుల పాటు కర్ణాటకలో ఈ పథకాన్ని పరిశీలించి.. పూర్తి వివరాలతో ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉండడంతో.. సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.తమిళనాడులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే పథకంను అందుబాటులో ఉంచారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ పథకంను అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కర్ణాటక మోడల్‌ను తీసుకొస్తారా? లేదా తమిళనాడు మోడల్‌ను అనుసరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.కర్ణాటకలో మాదిరి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే.. ఏటా రూ. 2200 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందట. అదే పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే.. రూ. 750 కోట్లు అవుతుందని అంచనా. తెలంగాణాలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే.. ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి (రీయింబర్స్) ఉంటుంది.రోజుకు ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారనే లెక్క తేలడం కోసం కర్ణాటకలో ‘జీరో టికెట్’ విధానం ప్రవేశపెట్టారు. అంటే.. మహిళలకు రూ. సున్నా అని ఉండే జీరో టికెట్‌ను ఇస్తారు. దాంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి.. నెల వారీగా లెక్కిస్తారు. తెలంగాణలో కూడా ఇదే పద్ధతి ప్రవేశపెడతారా? లేదా మరో పద్ధతిని అనుసరిస్తారా? అన్నది చూడాలి. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో అమలు చేస్తే.. పట్టణ, పల్లె మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







