శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు
- December 16, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసిపిలు, మరియు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిథిలో జరిగే నేరాలను అరికట్టాలని, ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవటంలో, నేరపరిశోధనలో, సాంకేతిక ఆధారాలను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా సివిల్ వివాదాలలో పోలీసులు పాల్గొనకూడదు అన్నారు. నిర్దిష్ట యస్ ఓ పి ప్రకారమే సివిల్ కేసులలో నడుచుకోవాలని , అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ప్రజలతో మమేకమై పని చేయాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. రోజు కనీసం 15 నిమిషాలు తమ స్టేషన్ పరిధిలో ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకం కావాలని సూచించారు.
పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలని పేర్కొన్నారు. చట్టపరిధిలోనే పని చేయాలని, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని, గరిష్ట శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు.
మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద నిఘా పెంచాలన్నారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమర్థవంతంగా పని చేసే అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ తరుణ్ జోషి, సైబర్ క్రైమ్ డీసీపీ అనురాధ ఐపీఎస్, డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ మహేశ్వరం శ్రీనివాస్ , డీసీపీ మల్కాజ్ గిరి జానకి, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీ బాల, డీసీపీ అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస రెడ్డి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







