నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో రాహుల్ సిప్ గంజ్

- December 22, 2023 , by Maagulf
నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో రాహుల్ సిప్ గంజ్

విజ‌య‌వాడ‌: ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొంది ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న తెలుగు చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ చిత్రానికి ప‌లు విభాగాల‌లో ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కింది. ప్ర‌ధానంగా నాటు..నాటు అంటూ ప్ర‌సిద్ధ న‌టులు ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్ న‌ర్తించిన గీతం ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. ఈ గీతాన్ని ఆల‌పించిన భార‌తీయ గాయ‌కుడు రాహుల్ సిప్ గంజ్ గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో ఐకా ఆధ్వ‌ర్యంలో ఈ నెల 31న నిర్వ‌హించ‌బోయే నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో ఇదే గీతాన్ని త‌న సంగీత బృందంతో క‌లిసి ఆల‌పించ‌బోతున్నారు. వెండి తెర‌పై మ‌నం చూసిన పాట మ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా సినిమా అనుభ‌వానికి మించి మ‌త్తెక్కించ‌నుంది. 

ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన వివ‌రాల‌ను నిర్వాహ‌కులు మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌లును పుర‌స్క‌రించుకుని ఈ నెల 31న సాయంత్రం మంగ‌ళ‌గిరిలోని సీకె క‌న్వెన్ష‌న్‌లో వేడుక‌లు అత్యంత అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐకా సీఈవో డి.జ‌య‌దుర్గ తెలిపారు. గుణ‌ద‌ల‌లోని హోట‌ల్ హ‌య్య‌త్ ప్లేస్‌లో శుక్ర‌వారం ఉద‌యం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆస్కార్స్ ఫెర్‌ఫార్మ‌ర్ రాహుల్ సిప్ గంజ్ పాల్గొని పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఐకా సీఈవో జ‌య‌దుర్గ మాట్లాడుతూ, 31న  సీకె క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగే మ్యూజిక‌ల్ షో వేడుక‌ల్లో రాహుల్ సిప్ గంజ్ స‌హా 13 మంది మ్యూజిక‌ల్ బృందంతో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు అత్యంత ఉత్సాహంగా, అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుంద‌న‌గా 10నిమిషాలు ముందు ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రంలోని నాటు..నాటు సాంగ్‌ను తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ళ‌యాళం భాష‌ల్లో ప్లే చేస్తూ చిత్రం చూస్తున్న అనుభూతిని క‌లిగించే విధంగా ఆస్కార్స్ ఫెర్‌ఫార్మ‌ర్ రాహుల్ సిప్ గంజ్ త‌న బృందంతో క‌లిసి ఆడియ‌న్స్‌తో డ్యాన్సులు చేస్తూ కొత్త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లుకుతార‌ని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి వేదిక‌ల‌కు తెర‌పై క‌నిపించే న‌టీన‌టులు మాత్ర‌మే వ‌స్తార‌ని కానీ.. త‌మ సంస్థ తెర వెనుక ప‌నిచేసిన క‌ళాకారుల‌ను కూడా ప‌రిచ‌యం చేసేందుకు రాహుల్ సిప్ గంజ్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన‌ట్లు పేర్కొన్నారు. ఆస్కార్స్ ఫెర్‌ఫార్మ‌ర్ రాహుల్ సిప్ గంజ్ మాట్లాడుతూ, తెలుగు పాట‌కు ఆస్కార్ అవార్డు రావ‌డంప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తూ ఇది తెలుగు జాతికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల్లో తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న షో నిర్వ‌హించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న‌ట్లు చెప్పారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో అచ్చ తెలుగు పాట అయిన నాటు..నాటు సాంగ్ ఫెర్మామెన్స్‌ను ఈ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించ‌డం. ఆడియ‌న్స్‌తో నృత్యం చేస్తూ కొత్త సంవత్స‌రానికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లక‌డం త‌న‌ జీవితంలో మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా మిగిలిపోతుంద‌న్నారు. ప్ర‌ధానంగా ఈ వేడుక‌ల్లో ఆస్కార్ చిత్రం గుర్తొచ్చేలా అత్యంత అనుభూతిని క‌లిగించే విధంగా ఆస్కార్ టీంతో వేదిక‌ను స‌ర్వాంగ‌సుంద‌రంగా చేసే డెక‌రేష‌న్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆనందోత్సాహాల న‌డుమ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని రాహుల్ సిప్ గంజ్, జ‌య‌దుర్గ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com