సౌదీలో చిక్కుకున్న 200మంది భారతీయులు

- May 30, 2016 , by Maagulf
సౌదీలో చిక్కుకున్న 200మంది భారతీయులు

సుమారు 200 మంది రాజస్థాన్‌కు చెందిన కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. ఝున్‌ఝును జిల్లాకు చెందిన వీరికి కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదని.. కనీసం భారత్‌కు రావడానికి టిక్కెట్‌ కొనుక్కోవడానికి కూడా వారి వద్ద డబ్బు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. అల్‌సిసార్‌ పట్టణానికి చెందిన మహమ్మద్‌ ఇషాక్‌, మహమ్మద్‌ ముస్లిం అనే వ్యక్తులు సౌదీ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్‌ ద్వారా తమ పరిస్థితిని వివరించారు. తాము పనిచేసే కంపెనీని వేడుకుంటున్నా ఫలితం లేదని, సౌదీలో భారత రాయబార కార్యాలయం నుంచి కూడా సహాయం అందడంలేదని వారి కుటుంబసభ్యులు చెప్తున్నారు. 

తన తండ్రి ఇషాక్‌ 25 ఏళ్లుగా సౌదీలోనే పనిచేస్తున్నారని.. గత ఆర్నెల్లుగా జీతాలు ఇవ్వడంలేదని ఆయన కొడుకు రషీద్‌ తెలిపారు. 200 మంది కార్మికులు సౌదీలో పలువురు అధికారులను వేడుకుంటున్నా ఎలాంటి సహాయం అందడం లేదని మహమ్మద్‌ సోదరుడు వెల్లడించారు. వారి పాస్‌పోర్టులు కూడా వారు పనిచేస్తున్న కంపెనీ వద్ద ఉన్నాయని, దాంతో నిస్సహాయులుగా అక్కడున్నారని వాపోయారు. కార్మికులు సౌదీలో చిక్కుకుపోవడం పట్ల ఎలాంటి అధికారిక సమాచారం తమ వద్ద లేదని జిల్లా కలెక్టర్‌ బాబులాల్‌ మీనా తెలిపారు. ఝున్‌ఝును ఎంపీ సంతోష్‌ అహ్లావత్‌ మాట్లాడుతూ సౌదీలో చిక్కుకున్న వారి గురించి సమాచారం సేకరించి విదేశాంగ శాఖను సహాయం కోరతానని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com