ఈ నెల 15వ తేదీన సెలవు..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

- February 10, 2024 , by Maagulf
ఈ నెల 15వ తేదీన సెలవు..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరగా… కోమటిరెడ్డి ఈ మేరకు స్పందించారు.

సేవాలాల్ మహరాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్ లో 1739 ఫిబ్రవరి 15న జన్మించారని బంజారాలు విశ్వసిస్తారు. ఆయన ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త కూడా. 18వ శతాబ్దంలో బంజారాలు బ్రిటీష్, ముస్లిం పాలకుల ప్రభావంతో ఇతర మతాల్లోకి మారకుండా సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. బ్రహ్మచారి అయిన సేవాలాల్ తన బోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించడంపై బంజారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com