పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన..

- March 08, 2024 , by Maagulf
పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన..

హైదరాబాద్: హైదరాబాద్ లోని పాతబస్తీలో మెట్రో రైల్ నిర్మాణం సంబంధించి శుక్రవారం (మార్చి 8న) శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి కులి కుతుబ్షాహీ నుంచి ఇప్పటివరకు పాలించిన వారందరూ హైదరాబాద్ మంచి పేరు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఈ సిటీని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరానికి కృష్ణ గోదావరి నీళ్లను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్న ఆయన హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకువచ్చే ప్లాన్ చేయడంతో పాటు పనులు ప్రారంభించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఐటీ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు.

2050 తెలంగాణ వైబ్రేట్ పేరుతో మాస్టర్ ప్లాన్:
హైదరాబాద్ అభివృద్ధి కోసం 2050 తెలంగాణ వైబ్రేట్ పేరుతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లండన్‌లో థీమ్స్ నదిని అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ఓల్డ్ సీటీ అభివృద్ధి కోసం ఎంఐఎం సహా అందరంతో కలిసి పనిచేస్తామన్నారు. పలు అంశాల్లో పలు సమస్యలపై పార్లమెంటులో ఎంఐఎం చర్చను లేవనెత్తుతోందని తెలిపారు.

గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోను తీసుకువెళ్లాలని నిర్ణయించిందని, ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారు, వారిని పంపించడానికి వెళ్లేవారు చాలామంది ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటారని, అందుకోసమే ఈ మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. మెట్రో విస్తరణ కోసమే పనిచేస్తున్నామని, అవసరమైన ప్రాంతాలకు మిడిల్ క్లాస్, పేదలకు ఉపయోగపడే విధంగా మెట్రో మార్గాలను సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఫేస్ టును వివిధ మార్గాలకు విస్తరిస్తున్నామన్నారు.

2028 వరకు ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చేలా చేస్తా:
2028 వరకు ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చేలా నేను మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రోడ్డు విస్తరణ కోసం అడిగారని, రూ. 120 కోట్లు అడిగితే.. ఇతర పనులు కూడా చేయాలంటూ రూ. 200 కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పారు. చంచల్ గూడ జైల్ మార్చి అక్కడ పాఠశాలలో కళాశాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే జైలును ఇతర ప్రాంతంలో నిర్మిస్తామని రేవంత్ పేర్కొన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న ఆయన రాజనీతి వేరుగా ఉంటుంది.. డెవలప్మెంట్ వేరుగా ఉంటుందని చెప్పారు. డెవలప్మెంట్ కోసమే తాము అన్ని విధాల పని చేస్తామని స్పష్టం చేశారు.

ఆ రెండు నా దగ్గరే ఉన్నాయి:
మున్సిపల్ శాఖ, మైనార్టీ శాఖ రెండు తన దగ్గరే ఉన్నాయని, అవసరమైన పద్ధతిలో అభివృద్ధి చేస్తానన్నారు. మరో 10 ఏళ్ల పాటు తామే ప్రభుత్వంలో ఉంటామని, హైదరాబాద్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో సబర్మతి నది డెవలప్ చేసినట్టుగా మూసిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందుకోసం సహకరించాలని సీఎం కోరారు. గండిపేట నుంచి హైదరాబాద్ నగరంలో మూసి 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎంఐఎంను కలుపుకుపోయి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలా ప్రభుత్వం పనిచేస్తుందని, సమస్యలపై కొట్లాడుతాం కానీ వ్యక్తిగత సమస్యలు తమకు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com