భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు
- April 01, 2024
హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన ప్రారంభించారు.
"నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది." అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అన్నారు.
భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సీటీఎం(మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







