తైవాన్‌లో భారీ భూకంపం..జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ
- April 03, 2024
తైపీ: తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైనట్టు తైవాన్ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. తైవాన్‌లోని హువెలిన్ నగరానికి నైరుతి వైపు 18 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 35 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా తైవాన్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి.అనేక భవంతులు పక్కకు ఒరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత 25 ఏళ్లలో తైవాన్‌లో ఈ స్థాయి భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. 1999లో నాంటో కౌంటీలో సంభవించిన భూకంపం (7.2 తీవ్రత) కారణంగా 2, 500 మంది మరణించగా మరో 1,500 మంది గాయపడ్డారు.
కాగా, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. రాజధాని తైపీతో పాటు పలు ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించినట్టు వెల్లడించింది. భూకంపం నేపథ్యంలో రాజధాని తైపీతో పాటూ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులు రద్దు చేశారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చుకోవచ్చని కూడా ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు, తైవాన్ భూకంపం నేపథ్యంలో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. జపాన్‌లోని యోనుగుని ద్వీపానికి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా, జపాన్‌లోని ఒకినావా ప్రిఫెక్చర్‌లోని (రాష్ట్రం) తీర ప్రాంతాలకు జపాన్ మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి కోస్తాతీరంలో సముద్రం అలలు 3 మీటర్ల ఎత్తువరకూ ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేయడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే, పరిస్థితి పరిశీలించిన అనంతరం, జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.
మరోవైపు, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. సహాయక చర్యల సన్నద్ధతను సమీక్షించాయి. ఒకినావాతో పాటు కగోషిమా ప్రాంతాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. అయితే, తమకు ఎటువంటి సునామీ ప్రమాదం ఉండకపోవచ్చని చైనా భావిస్తోంది. రెండు భూఫలకాల సరిహద్దులో తైవాన్ ఉండటంతో అక్కడ నిత్యం భూకంపాలు సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







