భారత పత్రికా స్వేచ్చా పితామహుడు

- April 03, 2024 , by Maagulf
భారత పత్రికా స్వేచ్చా పితామహుడు

మనం వార్తాపత్రికలు లేని ప్రభుత్వాన్ని కలిగి ఉండాలా లేదా ప్రభుత్వం లేని వార్తాపత్రికలను కలిగి ఉండాలా అని నిర్ణయించుకునే బాధ్యత నాకే వదిలేస్తే, రెండోదానిని ఇష్టపడటానికి నేను ఒక్క క్షణం కూడా వెనుకాడను అంటారు ప్రముఖ రాజనీతిజ్ఞుడు థామస్ జెఫర్సన్. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మరియు మీడియా చట్టాలకు కళ్ళెం వేయాలని చూసిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు రామ్‌నాథ్ గోయెంకా. నేడు రామ్‌నాథ్ గోయెంకా 120వ జయంతి.

రామ్‌నాథ్ గోయెంకా ఏప్రిల్ 3, 1904న భారతదేశంలోని బీహార్‌లోని దర్భంగా జిల్లాలో జన్మించారు. వారణాసిలోని బెనారస్‌లో పాఠశాల విద్య తర్వాత, అతను నూలు మరియు జనపనార వ్యాపారిగా కలకత్తాలో పనిచేస్తూ మెరుగైన అవకాశాల కోసం 1922లో చెన్నైకి వచ్చారు.చెన్నైలో వ్యాపారిగా స్థిరపడ్డాక, నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.

స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పత్రిక అవసరమైన సమయంలో పత్రిక వ్యాపారంలోకి కావాల్సిన మెళుకువలు తెలుసుకునేందుకు చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఆంగ్ల పత్రిక " ఫ్రీ ప్రెస్ జర్నల్‌"ల్లో డెస్పాచ్ వెండర్‌గా పనిచేస్తూ  పత్రికా వ్యాపారంలో నైపుణ్యం సంపాదించారు.1936లో మధురై కేంద్రంగా నడుస్తున్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసి 14 ఎడిషన్‌లతో జాతీయ నెట్‌వర్క్‌గా తీర్చిదిద్ది భారతదేశంలోనే అతిపెద్ద ఆంగ్ల భాషా దినపత్రికగా మార్చారు.

స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉద్యమానికి అనుకూలంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పోషించిన పాత్ర మరువలేనిది. దేశానికి స్వాతంత్రం వచ్చిన గోయెంకా ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు అనుబంధంగా పలు ఆంగ్ల పత్రికలు మరియు వివిధ ప్రాంతీయ భాషలలో సైతం  పత్రికలను  స్థాపించారు.  వార్తా పత్రికలూ

భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమని గోయెంకా బలంగా విశ్వసించారు.పత్రికా స్వేచ్ఛను కాపాడటం ద్వారా ప్రజల హక్కులను ప్రభుత్వాధినేతలు హరించలేరని నమ్మారు. పత్రికల స్వేచ్ఛను కాలరాసిన ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ తలొగ్గకుండా నిర్భీతిగా, నిస్పక్షపాతంగా ప్రజలపై ప్రభుత్వం జరిపిన బలవంతపు స్టెరిలైజేషన్‌లు, అత్యంత పేదల సామూహిక పునరావాసాలు, విస్తృతమైన అవినీతి, రాజకీయ అరెస్ట్‌లను గోయెంకా నేతృత్వంలోని ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్ పత్రికలు బహిర్గతం చేశాయి.

పత్రికా స్వేచ్ఛ కోసం ఏ పత్రికాధినేత చేయని పోరాటాలు, ఉద్యమాలు రామ్‌నాథ్ గోయెంకా చేశారు. ఆయన పేరు మీదుగా జర్నలిజం రంగంలో కృషి చేసిన వారికి "రామనాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు"లు ప్రతి యేటా ప్రదానం చేస్తున్నారు.  
 
                                 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)                           

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com