అభివృద్ధి స్వాప్నికుడు

- April 20, 2024 , by Maagulf
అభివృద్ధి స్వాప్నికుడు

ఆయన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి సుమారు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతగా  దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.రాజకీయాల్లో ఆయన రికార్డులను ఎవరూ అధిగమించలేరు. ఇక భవిష్యత్ లోనూ కష్టమే. ఎందుకంటే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన..  తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా, నవ్యంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా, మళ్ళీ  ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘకాలంగా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా కొనసాగుతూ భారత దేశ రాజకీయాల్లో అరుదైన రికార్డును నెలకొల్పారు. ఆయనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు చంద్రబాబు పుట్టిన రోజు.

చంద్రబాబు1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించారు.  తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం(ఎస్వీయూ) నుంచి ఎకనామిక్స్ లో ఎంఏ , ఎంఫిల్ పూర్తి చేశారు. ఎస్వీయూలో  చదువుకుంటున్న సమయంలోనే విద్యార్ధి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లా రాజకీయ దిగ్గజం, గాంధేయవాది పాటూరి రాజగోపాల్ నాయుడు గారి మార్గదర్శనంలో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో  అంచెలంచెలుగా చంద్రబాబు ఎదిగారు.  

చంద్రబాబు ఇందిరా కాంగ్రెస్ తరుపున 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.28వ ఏళ్ల వయసులోనే.. టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా బాబు  పనిచేశారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం కారణంగా బాబు చంద్రగిరి నుండి ఓటమి పాలయ్యారు. ఎమ్యెల్యేగా అదే అయన మొదటి మరియు చివరి ఓటమి.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో బాబు చేరారు. పార్టీ జనరల్ సెక్రెటరీగా తెలుగు దేశం పార్టీ యంత్రాంగాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్ఠం చేశారు. 1984 ఆగస్టు సంక్షోభంలో బాబు పాత్ర కీలకం. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో సీఎంగా దిగిపోయిన ఎన్టీఆర్ ను తిరిగి నెల రోజులకే సీఎంగా ఎన్నికవ్వడంలో తెరవెనుక కీలకమైన పాత్ర పోషించారు.1989 నుండి 2019 వరకు వరుసగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్యెల్యేగా చంద్రబాబు  ఎన్నికయ్యారు.  

1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడి స్థానానికి బదలీ అయ్యారు. అయితే  శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన అవమానం కారణంగా ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో  అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరించారు. 1989-94 మధ్యన  అసెంబ్లీలో, పార్టీలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు.

1994 ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఆర్థిక& రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. 1995లో జరిగిన కొన్ని అనివార్య పరిణామాల కారణంగా బాబు ఎన్టీఆర్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1995-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రిగా బాబు పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యంత్రిగా చేసిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన లాంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు.  ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ కు అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చారు. సాంకేతికతను అందిపుచ్చుకుని పాలనలో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చి  అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు .. జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసమే నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిని చేశాయి. ఆ తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు లోటు బడ్జెట్‌, మరోవైపు రాజధాని లేని రాష్ట్రం, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులను అధిగమించిన పాలన సాగించారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. పోలవరం ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ద్వారా రైతులను సాగునీరు అందించారు.2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు చంద్రబాబు.

రాజకీయంగా చంద్రబాబు ఎదుగుదల ఊరికే వచ్చి ఆయన తలుపు తట్టలేదు. సంక్షోభం నుంచే చంద్రబాబు సక్సెస్ వెతుక్కుంటారు. చంద్రబాబును కొందరు వెన్నుపోటు దారుడని, నయవంచకుడని ఎన్నైనా అనొచ్చు. కానీ రాజకీయాల్లో అందరూ అలాగే ఉంటారు. పార్టీ కోసం, రాజకీయం కోసం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం అలా చేయడంలో తప్పు చేయలేదనే వారే అధికంగా ఉండబట్టే ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. చంద్రబాబు లేకపోతే టీడీపీ మరింత భ్రష్టు పట్టిపోయేదని, ఆనాడే పార్టీని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడేదని చాలామంది వాదిస్తారు. అందులో నిజం లేకపోలేదు.

ఎన్నో కష్టాలు.. ఎన్నో ప్రయాసలు.. తను సొంతం అనుకున్న వారే పార్టీని విడిచి వెళ్లిపోయినా ఆయన చలించలేదు. లోలోపల బాధపడినా అది క్యాడర్ కు కనపించకుండా దిగమింగుకుని రాజకీయం చేసిన నేత చంద్రబాబు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అయితే ఎందరో ముఖ్యులు పార్టీని వీడి వెళ్లారు. ఇక టీడీపీ పని అయిపోయినట్లేనని అనుకున్నారు. కానీ మొక్కవోని ధైర్యంతో పార్టీని నిలబట్టి.. తిరిగి అధికారంలోకి తెచ్చిన ఏకైక లీడర్ చంద్రబాబు అని చెప్పడంలో అతి శయోక్తి లేదు.

2019-2024 వరకు ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు  అధికార పార్టీ అరాచకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో బాబు సఫలం అయ్యారు అనే చెప్పాలి. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా బాబు వ్యక్తిగత జీవితంపై, కుటుంబంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను, మేధావులను , విశ్లేషకులను దిగ్బ్రాంతికి గురిచేశాయి. అయినప్పటికీ, రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసేందుకు ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.  

                                          --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com