భారత దర్శకత్వ రారాజు

- May 02, 2024 , by Maagulf
భారత దర్శకత్వ రారాజు

"ఆయన సినిమా చూడకపోవడం ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో బతుకుతూ కూడా సూర్యచంద్రులను చూడకపోవడంతో సమానం అవుతుంది" అంటాడు ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా. సినిమా ఆఫ్ ఇండియా, సమాంతర చిత్రాల పేరెత్తితే చాలు.. ఆయనే గుర్తుకు వస్తాడు. ఆయన సినిమాల్లోని కొన్ని పాత్రలిప్పటికీ నిజజీవన చిత్రాలకు ప్రతిబింబాలై నిలుస్తాయి. ఆయనే సత్యజిత్ రే. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన అరుదైన దర్శకుడు సత్యజిత్ రే. నేడు సత్యజిత్ రే పుట్టినరోజు

రే 1921, మే2న కలకత్తాలో జన్మించారు. తాత ఉపేంద్ర కిషోర్ రే సాహితీపరుడు, తత్త్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు.  తండ్రి సుకుమార్ రే చిల్డ్రన్ లిటరేచర్ కం నాన్సెస్ రైమ్ రైటర్. వీరి ఫ్యామిలీకి ‘యు రే అండ్ సన్స్’ అనే ప్రింటింగ్ ప్రెస్ వుండేది. 

కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్‌లో బీఏ ఎకనామిక్స్ పూర్తిచేశారు.1940-41లో తమ కుటుంబానికి మిత్రుడైన రవీంద్రనాథ ఠాకూర్ బతికుండగానే శాంతినికేతన్ వెళ్ళి చిత్రకళ అభ్యసించారు. సినిమాలూ, గ్రామఫోన్ రికార్డ్ల మోజుతో రే 1942లో కలకత్తాకు తిరిగివచ్చారు. 1943 నుంచి సుమారు పన్నెండేళ్ళపాటు ఒక బ్రిటిష్ అడ్వర్తైజింగ్ కంపెనీలో పనిచేశాక సినీరంగంలో కాలు మోపారు .

1949లో కలకత్తాకు వచ్చిన ప్రసిద్ధ ఫ్రెంచ్ దర్శకుడు ఝాఁ రెన్వార్ వెంట తిరిగి నవతరం సినిమా గురించి రే  ఆకళించుకున్నారు.  1955లో  పథేర్ పాంచాలీ సినిమాకు దర్శకత్వం వహించిన తర్వాత తన చిత్రాల ద్వారా అంతర్జాతీయంగా రే పేరు తెచ్చుకున్నారు.  సంవత్సరానికొక సినిమా చొప్పున రే దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి.ది అపూ ట్రయాలజీలోని అపరాజితో, అపూర్ సంసార్ చిత్రాలకుగానూ scripting, casting, scoring, and editing విభాగాలను ఒంటిచేత్తో నడిపించారు సత్యజిత్ రే. రవీంద్రుడి ‘చారులతా’ మొదలుకొని పిల్లల సినిమా ‘గోపీ గాయేన్’ వంటి జానపద చిత్రాలూ, హిందీలో ప్రేంచంద్ కథ ఆధారంగా ‘శత్‌రంజ్ కే ఖిలాడీ’, రవీంద్రనాథ ఠాకూర్ మీద అద్భుతమైన డాక్యుమెంటరీ ఒకటీ ఇలా ప్రతీ ఒక్కటీ కళాఖండం అనిపించేట్టుగా నిర్మించారు.

సీరియస్ చిత్రాలే కాక పిల్లల కోసం సాహసాలు, హాస్యంతో కూడిన సినిమాలు తీశారు . సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, వాస్తవిక జీవిత చిత్రణ, అపూర్వం అనిపించే సినీ పరిభాషా, కళానైపుణ్యం అడుగడుగునా ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేసే దర్శకుల్లో రే ఒకరు. అంతకు ముందే కలకత్తా ఫిల్మ్ సొసైటీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు.

ఫిక్షన్ రైటర్, పబ్లిషర్, ఇల్లస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనర్, ఫిల్మ్ క్రిటిగ్గా నూ సత్యజిత్ రే సుపరిచితుడే. బెంగాలీలో అనేక కథలు, వ్యాసాలు, నవలలు కూడా రాశారు . సైన్స్ ఫిక్షన్, డిటెక్టివ్ సాహిత్యం మొదలైన ప్రత్యేక విషయాల గురించి కథలు రాశారు. ఫేలూ దా, sleuth, ప్రొఫెసర్ సుంకు.. వంటి అద్భుతమైన పాత్రలు సృష్టించారు. కంప్యూటర్ ఫాంట్‌లు వ్యాప్తిలోకి రాకముందే రే బెంగాలీ అక్షరమాలలో కొత్త శైలులని ప్రవేశపెట్టారు.

సత్యజిత్ రే కెరీన్ మొత్తంలో.. 32 నేషనల్ ఫిల్మ్ అవార్డులు కలుపుకుని ఆయన ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం సాధించాడు. ఆయన పొందిన అవార్డులలో 1992లో వచ్చిన ఆస్కార్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు, 1992లో వచ్చిన భారతరత్న అత్యంత ముఖ్యమైనవి.

రే గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళా దర్శకత్వం ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రే చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నారు.

సినిమాను సినిమా కోసం తీసిన దర్శకుడు సత్యజిత్ రే. భారతీయ దర్శక ప్రతిభను ఖండ ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మేధావి. అందుకే మరే ఇతర దర్శకులకు సొంతం కాని ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన్ను వరించాయి. ద్రష్టగా, కళాస్రష్టగా ప్రపంచ సినీరంగపు అతిరథ మహారథుల చేత మన్ననలు పొందారు. తన కెరీర్లో ఏనాడూ భావ దరిద్రానికి లోను కాని గొప్ప దర్శకుడు సత్యజిత్ రే. 

                                   --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com