హృదయం తెలిసిన వైద్యుడు..!

- May 17, 2024 , by Maagulf
హృదయం తెలిసిన వైద్యుడు..!

ఆయన ప్రఖ్యాత వైద్యుడు.. రోగులతో డాక్టర్లకు ఉండాల్సింది మనీ రిలేషన్ కాదనీ, మానవ సంబంధాలని చెప్పడమే కాకుండా ఆచరించి చూపారు. డాక్టర్లు చేసే వైద్యంలో తేడా ఉండదనీ, రోగులకు కల్పించే భరోసాలోనే వ్యత్యాసం ఉంటుందంటున్నారు. ఆయనే ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ మన్నం గోపీచంద్.

గుండె శస్త్ర చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ మన్నం గోపీచంద్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు తాలూకా లింగంగుంట గ్రామంలోని సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన్నం నరసింహం, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.

గోపీచంద్ తండ్రి మన్నం నరసింహం గారు వీరి చిన్నతనంలోనే వ్యవసాయ రంగం నుండి వైదొలగి ఒంగోలు కేంద్రంగా ప్రజా వైద్య దిగ్గజం, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవిఎల్ నారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా వైద్యశాలలో కంపౌండర్ గా చేరి పలు శస్త్ర చికిత్సల్లో నిపుణత సాధించారు. అనంతర కాలంలో ఒంగోలు లోనే ఆర్.ఎం.పీగా స్థిరపడ్డారు. తన తండ్రిని, డాక్టర్ బీవిఎల్ నారాయణ గార్లను స్ఫూర్తిగా తీసుకుని గోపీచంద్ వైద్య వృత్తిలోకి ప్రవేశించారు.

గోపీచంద్ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత జమైకా వెళ్లి విక్టోరియా జూబ్లీ మరియు సవన్నా లా మార్ ప్రభుత్వ హాస్పిటల్స్ నందు వైద్యుడిగా శస్త్ర చికిత్సల్లో నిపుణత సాధించారు.అనంతరం కార్డియాలజీ విభాగంలో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడ ప్రఖ్యాత రాయల్ కాలేజ్ అఫ్ సర్జన్స్ నందు ఎఫ్. ఆర్.సి.ఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ లోనే కార్డియాలజీస్ట్ గా గోపిచంద్ కొంత కాలం పనిచేశారు.

స్వదేశం మీదున్న మమకారంతో 1994వ సంవత్సరంలో గోపిచంద్ భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగంలో కన్సల్టెంట్ గా, మెడ్విన్ హాస్పిటల్ లో కార్డియో థెరపీ సర్జన్ గా పనిచేశారు.ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు గారి ఆహ్వానం మేరకు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న కేర్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ కార్డియో థెరపీ సర్జన్ గా పనిచేశారు.

అయితే 2008లో తన స్నేహితుల ప్రోద్బలంతో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన స్టార్ హాస్పిటల్ ను హైదరాబాద్ నగరంలో నెలకొల్పి కార్డియాలజీ విభాగం అధిపతిగా, హాస్పిటల్ ఏండిగా గోపిచంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గోపిచంద్ సతీమణి మాధవి సైతం వైద్యురాలు. ఆమె స్టార్ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో సీనియర్ గైనకాలజీస్టుగా పనిచేస్తున్నారు.

గోపీచంద్ ఇప్పటి వరకు దాదాపు 20,000 వేల గుండె శస్త్ర చికిత్సలు చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స కావాల్సిన ఆర్ధిక సహాయం అందించేందుకు 2005లో హృదయ ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 1151మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేశారు. 1294 మంది బాలలకు వైద్య సహాయం అందించింది.  

ప్రస్తుత కాలంలో వైద్య రంగంలో వస్తున్న వ్యాపారాత్మక ధోరణి గురించి గోపీచంద్ మాట్లాడుతూ ఒకప్పుడు డాక్టర్‌ వృత్తిని సర్వీస్‌ గానే చూసే వారు. వ్యాపారంగా చూసే వారు కాదు. ఎంతిస్తే అంత తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఇందులో మరో అంశం ఉంది. ఒకప్పుడు హార్ట్ఎటాక్‌ వస్తే బతికేవారు కాదు. కానీ ఇప్పుడు మంచి ఎక్విప్‌మెంట్‌ ఉంది. అలాంటి ఎక్విప్‌మెంట్‌తో చికిత్స లభించాలంటే డబ్బులు చెల్లించకతప్పదు. దాన్ని వ్యాపారం అన్నా, మరొకటి అన్నా తప్పులేదు.

వైద్య రంగంలో గోపిచంద్ చేస్తున్న కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే పలు సామాజిక సేవా సంస్థలు సైతం వివిధ పురస్కారాలతో సత్కరించడం జరిగింది.

గోపిచంద్ గారికి చిన్నతనం నుంచే మాతృబాష తెలుగు అంటే ఎంతో మమకారం . తెలుగు బాషలోని అనేక గొప్ప రచనలను డిజిటలైజ్ చేసి ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో తన సోదరుడు మన్నం వెంకట రాయుడుతో కలిసి మనసు ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. మనసు అనేది వారి తల్లిదండ్రుల పేరున అనగా మన్నం నరసింహం, సుబ్బమ్మ పేర్లలో మ.న.సు(మన్నం నుండి మ నరసింహరావు నుండి న సుబ్బమ్మ నుండి సు) అన్న అక్షరాలు తీసుకుని పేరుపెట్టారు.

వైద్య రంగంతో పాటు తెలుగు సాహిత్య రంగంలో తన వంతు కృషి చేస్తున్న డాక్టర్ మన్నం గోపీచంద్ ఎందరో యువ వైద్యులకు మాత్రమే కాకుండా సామాన్య యువతకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. 
 
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com