ప్రజా నేత సుందరయ్య

- May 19, 2024 , by Maagulf
ప్రజా నేత సుందరయ్య

ఆయన జీవిత‌మంతా పోరాటం...జనం కోస‌మే ఆరాటం. స‌మ‌స్య‌ల సాధ‌నే ల‌క్ష్యంగా  ప్రజా ఉద్యమాలను నిర్మించారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఊరువాడా ఏకం చేసి సాయుధ‌ పోరాటాలు న‌డిపిన దీక్షాధారి.నాయకుడు అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడని.. కుర్చీకి పరిమితమయ్యేవాడు నాయకుడు కాదని చాటి చెప్పారు. ఆయనెవరో కాదు తాడిత, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య. నేడు ప్రజా నాయకుడు సుందరయ్య గారి వర్థంతి.

పుచ్చలపల్లి సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. 1913, మే 1న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అలగానిపాడు గ్రామంలోని భూస్వామ్య కుటుంబానికి చెందిన వెంకటరామిరెడ్డి,శేషమ్మ దంపతులకు సుందరయ్య   జన్మించారు. చిన్నప్పుడే తండ్రి పోవడం వల్ల తన అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసు లలో చదివారు. స్కూల్ ఫైనల్ పాసయ్యాక 1929లో వీరు మద్రాసు లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొంతమంది తెలుగు విధ్యార్ధులతో కలిసి సోదర సమితిగా ఏర్పడి వ్యాయామం, గ్రంధ పటనం, ఖద్దరు విక్రయం మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

1927లో మద్రాసు లో జరిగిన కాంగ్రేస్ మహాసభ సంపూర్ణ స్వాతంత్ర్యం తన ధ్యేయం అని తీర్మానించడం, మరుసటి సంవత్సరం మద్రాసు లో సైమన్ కమీషన్ కి వ్యతిరేకంగా జరిగిన హర్తాళ్, బహిరంగ సభ ఇవన్నీ సుందరయ్య గారిలో స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 1930లో మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని తంజావూరు బోర్టర్స్ జైల్లో, రాజమండ్రి కారాగారంలో రెండేళ్ళు ఉన్నారు.

రాజమండ్రి జైలులో లాహోర్ కుట్రకేసు ఖైదీలు శివవర్మ, విజయకుమార్ సిన్హాలతో వీరికి పరిచయమైంది. వారిది హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ, సోషలిజం సాధనకై వ్యక్తిగత విప్లవాద చర్యలను చేపట్టినవారు. అయితే గాఢమైన దేశభక్తి, అపారమైన ధైర్య సాహసాలు గలవారు. అదే సమయంలో తమ ఉద్యమంలో ద్యోతకమైన బలహీనతలు, అజాగ్రత్త వల్ల కలిగిన నష్టాలు కూడా వారు వివరించారు. ఆ సమయంలో సుందరయ్య గారికి ఎంతగానో తోడ్పడింది. శివవర్మ తన విప్లవ జీవితంలో ఎలా రహస్యంగా పనిచేసిందీ, జరిగిన పొరబాట్లు, విప్లవకారుల్లోని ధైర్యసాహసాలు అన్నీ వర్ణించి చెప్పేవారు.

1931లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో సుందరయ్య చేరారు. ఆ సమయంలో పార్టీ పై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఖాన్ మార్గదర్శనంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసే బాధ్యతను సుందరయ్య భుజానికెత్తుకున్నారు. ఈ సమయంలోనే కేరళకు చెందిన నంబూద్రిపాద్, కృష్ణ పిళ్ళై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీనుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు. సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చారు.

సుందరయ్య 1939 నుండి 1942 వరకు  నాలుగేళ్ళు అజ్ఞాత వాసంలో ఉంటూనే కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు. 1943లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత  బొంబాయిలో జరిగిన తోలి మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మరణించేవరకు పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు.  

1948 నుండి 1952 వరకు నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన  తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న సుందరయ్య, మలి దశలో ఆ పోరాటానికి నాయకత్వం వహించి తెలంగాణ ప్రజానీకానికి విముక్తి కల్పించారు. 1952లో జరిగిన మద్రాస్ ఎన్నికల్లో  కమ్యూనిస్టు పార్టీ ఓటమి తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు. 1955,1962,1978లలో కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1955-1962 వరకు కమ్యూనిస్టు పార్టీ తరుపున విశాలాంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీలో మొదటి ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
   
1964లో విజయవాడ పట్టణంలో జరిగిన అఖిల భారత కమ్యూనిస్టు మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. సుందరయ్య, బసవపున్నయ్య, జ్యోతిబసు, ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నేతృత్వంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లేదా సీపీఎం పార్టీ ఏర్పడింది. సీపీఎం పార్టీ వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శిగా 1964 నుంచి 1978 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.

సుందరయ్య ఏనాడు అధికారంలో లేకపోయినా పరిపాలనా వ్యవస్థ పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన నేతగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా పేద ప్రజల సంక్షేమం అమలు చేయాల్సిన పథకాలతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వం ముందుంచారు.

పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా సుందరయ్య ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఏదైనా విషయంపై మాట్లాడాలంటే ఆ విషయంపై సంపూర్ణ సమాచారంతో వెళ్లేవారు. ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీలో ఆయన సమస్యలపై మాట్లాడేందుకు నిలబడితే అధికార పార్టీ మంత్రులకు గౌరవంతో కూడిన భయం ఉండేది. నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా విద్యా , వైద్యం అందించాలని ఆయన కోరారు. అందరికీ శాస్త్రీయ విజ్ఞానం అందుబాటులో ఉండాలని నిత్యం తపించేవారు.

సుందరయ్య సంపన్న కుటుంబంలో జన్మించినా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. తన వాటాగా వచ్చిన భూములను పేదలకు పంచిపెట్టి పార్టీ కార్యాలయంలోనే జీవించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పట్టికి వామపక్ష సిద్ధాంతాలకు ప్రభావితుడై పుచ్చలపల్లి  సుందరరామిరెడ్డి కాస్త పుచల్లపల్లి సుందరయ్యగా మారారు. పార్లమెంటుకైనా, శాసనసభకైనా సైకిల్ ఫైనే వెళ్ళేవారు.

సుందరయ్య వ్యక్తిగత జీవితానికి వస్తే , సుందరయ్య భార్య లీలమ్మ మహారాష్ట్రకు చెందిన వారు. లీలమ్మ సైతం విద్యార్ధి దశలోనే కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ వచ్చారు. పార్టీ పట్ల లీలమ్మ అంకిత భావానికి ముగ్దుడైన సుందరయ్య ఆమెను ప్రేమ వివాహాం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ, పిల్లలు పుడితే ప్రజా ఉద్యమానికి సమయాన్ని కేటాయించలేనేమొననే ఆలోచనతో సంతానం వద్దనుకున్నారు ఆ ఆదర్శ దంపతులు.

సుందరయ్య సోదరుడు డాక్టర్ రామ్ గా ప్రసిద్ధులైన పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు సైతం భారతదేశంలో గొప్ప వైద్యులుగా కీర్తి సంపాదించారు. అన్న సుందరయ్య బాటలోనే తన ఆస్తిని సైతం పేద ప్రజలకు పంచిపెట్టారు.పేదప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించాలనే ఆశయంతో నెల్లూరులో ప్రజావైద్యశాలను స్థాపించి తన బంధువైన డాక్టర్ జెట్టి శేషారెడ్డి గారితో కలిసి సమర్థవంతంగా నిర్వహించారు. సుందరయ్యను ఆదర్శంగా తీసుకోని ఆయన మరో బంధువు జక్కా వెంకయ్య సైతం కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి రెండు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.

సుందరయ్య పలు పుస్తకాలు రాశారు. "తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు", "విశాలాంధ్రలో ప్రజారాజ్యం", భూ సమస్యల మీద సమగ్ర అధ్యయనం చేసి రాసిన "గ్రామ పేదలు -  భూ పంపకం " , "ప్రజా సంఘాలు - పార్టీ నిర్మాణం " వంటి పలు పుస్తకాలను ఆయన స్వయంగా రాశారు.

కార్మికులను విపరీతంగా ప్రేమించే సుందరయ్య పుట్టిన రోజు కార్మిక దినోత్సవం కావడం యాదృచ్చికం. ప్రజాసంక్షేమమే పరమావధిగా.. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఆరు దశాబ్ధాలకుపైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. నిత్యమూ పేదల బాగు కోసం అహర్నిశలు కృషి చేసిన పుచ్చల పల్లి సుందరయ్య తన 72 వ యేట 1985, మే 19వ తేదీన మరణించారు. సుందరయ్య వాడిన వస్తువులు, పుస్తకాలను భావి తరాలు సైతం చూసేందుకు వీలుగా  1988 లో హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభించారు.
 
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com