మ్యాన్లీ స్టార్.....మాధవన్

- June 01, 2024 , by Maagulf
మ్యాన్లీ స్టార్.....మాధవన్

మాధవన్… పలు భారతీయ భాషా చిత్రాల్లో నటించి, పాన్ ఇండియా అప్పీల్ ను పొందిన ఛార్మింగ్ హీరో! కథ నచ్చితే చాలు ఎటువంటి పాత్రనైనా  పోషించడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా అలరించాడు, తర్వాత కాలంలో వైవిధ్య భరితమైన తన నటన ద్వారా ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్త అనుభూతిని పంచుతూ వస్తున్నాడు. నేడు మ్యాన్లీ స్టార్ మాధవన్ పుట్టినరోజు.

మాధవన్ పూర్తి పేరు రంగనాథన్ మాధవన్. 1970, జూన్ 1వ తేదీన జార్ఖండ్ రాష్టంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రంగనాథన్, సరోజ దంపతులకు మాధవన్ జన్మించాడు. తండ్రి టాటా స్టీల్ ఉద్యోగి, తల్లి బ్యాంకు ఉద్యోగి. మాధవన్ కొల్హాపూర్ లోని రాజారామ్ కళాశాలలో బి.యస్సీ ఎలక్ట్రానిక్స్, ముంబైలోని కె.సి కళాశాలలో ఎం.ఏ పబ్లిక్ స్పీకింగ్ పూర్తి చేశాడు.

మాధవన్ చిన్నతనం నుంచి ఇండియన్ డిఫెన్స్ రంగంలో పనిచేయాలని కలలు కనేవాడు. చదువుల్లో రాణిస్తూనే ఆట పాటల్లో సైతం ఉత్సాహంగా పాల్గొనేవాడు. రాజారామ్ కళాశాలలో చదువుతున్న రోటరీ ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా కెనడా వెళ్ళాడు. అలాగే, నేషనల్ క్యాడెట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియా తరుపున ఇంగ్లాండ్ వెళ్లి, అక్కడి డిఫెన్స్ ఫోర్సెస్ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే,  వ్యక్తిగత కారణాల వల్ల డిఫెన్స్ రంగంలోకి వెళ్లలేకపోయాడు.

మాధవన్ సినిమాల్లోకి రాకముందు దేశవ్యాప్తంగా పబ్లిక్ స్పీకింగ్ & వ్యక్తిత్వ వికాసం ట్రైనింగ్ వర్కషాప్స్ నిర్వహించేవాడు. ఒకవైపు  వర్కషాప్స్  నిర్వహిస్తూనే మోడలింగ్ చేసేవాడు. మోడలింగ్ రంగంలో ప్రవేశించిన తర్వాత హిందీ సీరియల్స్ లీడ్ రోల్స్ వెతుక్కుంటూ వచ్చాయి. మాధవన్ నటించిన పలు సీరియల్స్ హిట్ అవ్వడంతో సినిమా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. ప్రఖ్యాత దర్శక దిగ్గజం మణిరత్నం మాధవన్ ను హీరోగా పరిచయం చేశారు.  

రెండు దశాబ్దాల క్రితం మణిరత్నం తెరకెక్కించిన ‘అలైపాయుతే’లో నటించి, ‘సఖి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకూ వచ్చాడు. అప్పటి ఆ ఛార్మింగ్ ఇంకా మాధవన్ లో అలానే ఉంది. అయితే… ఆ చాక్లెట్ బోయ్ లో ఉన్న వేరియషన్స్ ను కొందరు దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించారు. సఖి చిత్రంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఎంతలా అంటే తమకు కాబోయే జీవిత భాగస్వామి అచ్చం మాధవన్ లాగ ఉండాలని కలలు కనేవారు అంటే అతిశయోక్తి కాదు.

‘సఖి’ తర్వాత ‘చెలి’గా గౌతమ్ మీనన్ దర్శత్వంలో నటించి… ఆ సినిమాతోనూ కుర్రకారుని మెప్పించాడు మాధవన్. విశేషం ఏమంటే… సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మాధవన్ ను ప్రేక్షకులు తమ వాడిగా భావించి హృదయానికి హత్తుకున్నారు. సఖి,చెలి చిత్రాలతో మాధవన్ కు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలోనే మాధవన్ కాస్త మ్యాడీగా మారిపోయాడు. ఒకానొక సమయంలో తమిళంలో స్టార్ హీరో రేంజ్ కు వెళ్ళిన మాధవన్ చిత్రాలు అనేకం తెలుగులోనూ డబ్ అయ్యాయి. మణిరత్నం రూపొందించిన ‘అమృత, గురు’ సినిమాల్లో మాధవన్ లోని గొప్ప నటుడిని మనం చూస్తాం.

అలానే ‘రన్, అన్బే శివం, వేట్టై ‘ వంటి చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించి తన అభిమానులను తృప్తి పరిచాడు. ఇటు తమిళంలోనే కాదు… అటు హిందీలోనూ మాధవన్ జాబితాలో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అతను నటించిన ‘రంగ్ దే బసంతి, గురు, త్రీ ఇడియట్స్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్’ వంటి చిత్రాలను మర్చిపోలేం. బేసికల్ గా మాధవన్ ది కష్టపడే మనస్తత్వం. అందుకే క్షణం కూడా ఖాళీగా ఉండటానికి ఇష్టపడడు. కేవలం నటుడిగా ఉండిపోకుండా పలు చిత్రాలకు స్క్రీన్ ప్లేను అందించాడు. అంతేకాదు… హిందీ చిత్రం ‘డోంబివలీ ఫాస్ట్ ‘ను తమిళంలో ‘ఎవనో ఒరువన్’ పేరుతో రీమేక్ చేసి, తానే నిర్మాతగా వ్యహరించాడు.

ఆ తర్వాత ‘సాలా ఖద్దూస్’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… ప్రస్తుతం మాధవన్ చేస్తున్న ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ ఒక్కటీ మరో ఎత్తు. ప్రముఖ సైంటిస్ట్, ఏరో స్పేస్ ఇంజనీర్ నంబీ నారాయణన్ జీవితంలోని పలు సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ’. ఇందులో నంబి పాత్రను పోషించడమే కాదు… దీనికి తానే నిర్మాత, దర్శకుడు కూడా.

ఇలా నటన, చిత్ర నిర్మాణం, స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్ అంటూ తన ప్రతిభా పాటవాలను విస్తరించుకుంటూ పోతున్నాడు మాధవన్. ‘రాకెట్రీ’ మూవీ ప్రమోషన్ లో భాగంగా సైంటిస్ట్ నంబితో కలిసి ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీకీ మూవీ విశేషాలు స్వయంగా తెలియచేసి, ఆయన అభినందనలూ అందుకున్నాడు. దాదాపు పాతికేళ్ళుగా పలు కమర్షియల్ ప్రాజక్ట్స్ కు అతను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అలానే కొన్ని డాక్యుమెంటరీస్ ను రూపొందించాడు. పలు టీవీ గేమ్ షోస్ కు వ్యాఖ్యాతగా ఉన్నాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ తో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడు సార్లు బెస్ట్ ఆర్టిస్ట్ గా అవార్డులనూ అందుకున్నాడు.

మాధవన్ నటించిన తమిళ చిత్రాలు తెలుగుతో డబ్ కావడంతో మనవారికీ అతనంటే ఎంతో అభిమానం. దాంతో పాటు  ‘ఓం శాంతి, సవ్యసాచి’ వంటి తెలుగు చిత్రాలలో మాధవన్ నటించాడు. ఈ రెండు సినిమాలు ఒక ఎత్తుకాగా బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’ లో మాధవన్ పోషించిన ఆంటోని పాత్ర మరో ఎత్తు. నెగెటివ్‌ షేడ్స్ ఉండే ఈ పాత్రను మాధవన్ ఎంతో అద్భుతంగా పోషించాడు.

కొత్త దానాన్ని బాగా ప్రేమించే మాధవన్ పలు వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించాడు. తన సినిమా కెరీర్ ను వైవిధ్యభరితంగా సాగిస్తున్న భాషాభేదం లేకుండా అన్ని భాషల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం మాధవన్ పలు హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.    

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్  ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com