న్యూస్ మ్యాన్---ఆర్.జె.రాజేంద్రప్రసాద్

- June 07, 2024 , by Maagulf
న్యూస్ మ్యాన్---ఆర్.జె.రాజేంద్రప్రసాద్

హిందూ రాజేంద్రప్రసాద్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు  జర్నలిజం వృత్తి లో ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితులైన ప్రముఖ పాత్రికేయులు ఆర్.జె.రాజేంద్రప్రసాద్. పూర్తి పేరు రంగస్వామి జగన్నాథయ్య రాజేంద్రప్రసాద్ మద్రాస్ నగరంలో 1938 జూలై 10వ తేదీన రంగస్వామి జగన్నాథయ్య, కుప్పమ్మ దంపతులకు జన్మించారు.

1958లో ఎం.ఏ ఇంగ్లీష్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా బంగారు పతకం అందుకున్నారు. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయిన రాజేంద్రప్రసాద్ మద్రాస్ లోని త్యాగరాయ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా చేరిపోయారు. కానీ జర్నలిజం వృత్తి మీద మక్కువతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక రిపోర్టర్ ఉద్యోగ ప్రకటన చూసి, దరఖాస్తు చేసి ఎంపికయ్యారు. అక్కడ చురుగ్గా పనిచేస్తున్న ఆయన పనితీరును చూసిన హిందూ పత్రిక ప్రధాన ఎడిటర్ ఆహ్వానం మేరకు 1962లో హిందూ దినపత్రికలో చేరారు. అతి కొద్దీ కాలంలోనే హిందూ పత్రికలో ప్రముఖ జర్నలిస్టుగా మారారు.

1970లో హైదరాబాద్ హిందూ పత్రిక బ్యూరో చీఫ్ గా వచ్చిన రాజేంద్రప్రసాద్ సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పని చేశారు.హైదరాబాద్ హిందూ న్యూస్ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్ స్థాయిలో ఉన్నా కూడా రాజేంద్రప్రసాద్ వార్తలు సేకరణ సమయంలో తన సహచరులకు భిన్నంగా చిన్న చిన్న సమావేశాలకైనా వచ్చి విభిన్న రీతిలో వాటిని సేకరించేవారు. అంతేకాకుండా సేకరించిన వార్తలకైన, చేసిన విశ్లేషణలకు సైతం వాస్తవాలు,వివరాలు,గణాంకాలు జోడించి వ్రాసేవారు కాబట్టి వీరి 'బైలైన్' వార్తలకు విశ్వసనీయత, గణ్యత ఉండేది. ఉదాహరణకు 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని,1984లో ఆగస్టు సంక్షోభం, 1995లో వైస్రాయ్ హోటల్ సంక్షోభం వంటి పలు ముఖ్య సంఘటనలను ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేశారు.

రాజేంద్రప్రసాద్ పేదలు, సామాన్య మధ్యతరగతి సంక్షేమం మరియు సమస్యల పట్ల ఎక్కువ దృష్టి ఉండేది. వారికి సంబంధించిన ఏ విషయమైనా నిజాయితీగా, నిర్మొహమాటంగా వ్రాసేవారు. రాజకీయం, సామాజికం, సాంస్కృతికం, వ్యవసాయం అనే భేదభావం లేకుండా ఎక్కడ వార్తవుంటే అక్కడ దాన్ని గ్రహించి పత్రిక కెక్కించి పాఠకులను, పాలకులను సమానంగా మెప్పించారు. ఆయన ఆంగ్లంలో  తెలుగుదేశం పార్టీ మీద వ్రాసిన " ఎమెర్జెన్స్ ఆఫ్ తెలుగుదేశం", తన ఆత్మకథ " డేట్ లైన్ ఆంధ్ర" పుస్తకాలు విశేషమైన ఆదరణ పొందాయి.
   
హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ గా పదవీవిరమణ చేసిన తరువాత కూడా హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. 2006 జనవరి 26 న అనారోగ్యంతో కన్నుమూశారు. మూడు దశాబ్దాల పాత్రికేయ వృత్తి లో సుదీర్ఘ కాలం సంప్రదాయ పద్దతిలో కాకుండా కొంగ్రొత్త కోమలమైన శైలిలో,సరళంగా, సూటిగా తనదైన ముద్రతో వివిధ కోణాల నుంచి వార్తలు వ్రాసిన ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వని పాత్రికేయుడిగా రాజేంద్రప్రసాద్ ఈతరం యువ జర్నలిస్టులకు ఆదర్శప్రాయులు. 
 
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com