ఆంధ్రప్రదేశ్ క్షీర విప్లవ సారథి ...!

- June 10, 2024 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ క్షీర విప్లవ సారథి ...!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాల పాడి రైతాంగం కోసం క్షీర విప్లవంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సహకార వ్యవస్థలో నూతన అధ్యాయాలకు నాంది పలికి లక్షలాది రైతు కుటుంబాలకు ఆసరాగా, వేలాది మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు "పాల వీరయ్య" గా సుప్రసిద్ధులైన ప్రజా నాయకులు,మాజీ మంత్రి స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి.

వీరయ్య చౌదరి గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా చింతలపూడి గ్రామంలో పెద్ద రైతు కుటుంబానికి చెందిన ధూళిపాళ్ల రత్తయ్య , తులసమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే పేద ప్రజానీకం కోసం పాటుపడే స్వభావం కలిగి ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల రైతులు ఆర్థికంగా పడుతున్న కష్టాలు చూసి  చలించి నిరంతరం ప్రజాసేవలో తరించాలని భావించి 23వ ఏట రాజకీయాల్లో ప్రవేశించారు.

1968- 82 మధ్యలో పార్టీలకు అతీతంగా చింతలపూడి గ్రామానికి వరుసగా 3 సార్లు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వీరయ్య గ్రామాన్ని అన్ని రంగాల్లో ఏంతో అభివృద్ధి చేశారు. జాతి పీత గాంధీ మహాత్మా, రైతు బాంధవుడు ఆచార్య ఎన్.జి.రంగా బోధించిన విధంగానే గ్రామీణ సహకార వ్యవస్థ ప్రయోజనాల గురించి విస్తృతంగా తెలియజేసేందుకు తన స్వగ్రామాన్ని ప్రయోగశాలగా చేసుకున్నారు. ఆ గ్రామంలో సహకార రంగాన్ని బలోపేతం చేశారు.  

గుంటూరు జిల్లా రైతుల కల్పవృక్షంగా భావించే సంగం సహకార పాల డైరీని స్థాపించేందుకు వీరయ్య చౌదరి చేసిన కృషి రాష్ట్ర పాడి పరిశ్రమ రంగ చరిత్రలో మరువలేనిది. ప్రైవేట్ దళారులు చేతిలో మోసపోతున్న జిల్లా గ్రామీణ పాడి రైతాంగాన్ని సంగం డెయిరీ ద్వారా ఆదుకొని వారికి అండగా నిలిచారు.

1970 దశకంలో దేశవ్యాప్తంగా క్షీర విప్లవం వేగంగా అమలవుతున్న సమయంలో వీరయ్య వాటి మీద దృష్టి సారించారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ పాల డెయిరీ ఏర్పాటు, అక్కడి పాడి రైతుల విజయాల గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత. ఏ ఆధారం లేకపోయినా పాడి మీద బ్రతకవచ్చు అని భావించి గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంత రైతాంగానికి ఆసరాగా నిలిచేందుకు క్షీర విప్లవంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని భావించారు.

ఆలోచన వచ్చిన వెంటనే నాటి గుంటూరు జిల్లా ముఖ్య నాయకులైన ఎన్.జి.రంగా, రఘురామయ్య, యడ్లపాటి వెంకట్రావు వంటి రాజకీయ ఉద్దండుల సహకారంతో  క్షీర విప్లవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న సహకార పాల డైరీ వ్యవస్థ లలో గుంటూరు జిల్లాలో కూడా సహకార పాల డైరీ ఏర్పాటు కు యడ్లపాటి నేతృత్వంలో నాటి కేంద్ర మంత్రి రఘు రామయ్య ద్వారా అమూల్ సహకార పాల సంఘం వ్యవస్థాపకుడు, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య ఛైర్మన్ గా ఉన్న కురియన్ ను కలిసి గుంటూరు జిల్లాలో సహకార పాల డెయిరీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయించారు.

1977లో తెనాలి సమీపంలో ఉన్న సంగం జాగర్లమూడి గ్రామంలో స్వయంభూ వెలసిన సంగమేశ్వర స్వామి పేరు మీద సంగం సహకార పాల డైరీ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి నాటి కేంద్ర మంత్రి రఘురామయ్య గారితో పాటుగా స్వయంగా కురియన్ గారు సంగం జాగర్లమూడి గ్రామానికి రావడం జాతీయ స్థాయిలో "సంగం డెయిరీ" పేరు మారుమ్రోగింది.

1977-79 వరకు సంగం డైరీ కార్యవర్గ సభ్యునిగా వ్యవహరించిన వీరయ్య చౌదరి అప్పటి డెయిరీ ఛైర్మన్ యడ్లపాటి వెంకట్రావు గారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వారి వారసుడిగా ప్రజల ఆమోదంతో 1979లో సంగం డైరీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్య పదవి బాధ్యతలు చేపట్టారు. సంగం డెయిరీని గుంటూరు జిల్లాకే తలమానికంగా నిలబెట్టడంలో వీరయ్య చౌదరి పాత్ర మరువలేనిది.

1979- 1985, 1992- 1994 లలో పలు పర్యాలు ప్రజల ఆమోదంతో డెయిరీ ఛైర్మన్ గా వీరయ్య చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తన దీక్ష దక్షతలతో డైరీని లాభాల బాటలో పయనించేలా చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో డెయిరీకి మంచి గుర్తింపు తెచ్చారు. పాడి పరిశ్రమ ద్వారా గుంటూరు జిల్లా గ్రామీణ రైతాంగం ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించడానికి ఏంతో కృషి చేశారు.  

మనిషి పుట్టిన తర్వాత తొలి ఆహారం పాలు. అటువంటి పాలు లభ్యత నాడు తక్కువగా ఉండటం గ్రహించిన వీరయ్య చౌదరి సంగం డెయిరీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాల ఉత్పత్తిని పెంచేందుకు,పాల సేకరణ,పాల శుద్ధి, మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధికి కృషి చేయడం ప్రారంభించారు. వారి తీసుకున్న చర్యల ద్వారా గుంటూరు జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి సైతం విజయవంతంగా పాల సేకరణ జరిగింది. సంగం డెయిరీ అన్ని గ్రామీణ ప్రాంతాల రైతులకు దగ్గరయ్యేలా అనేక చర్యలు చేపట్టారు. అందుకే ఆయన్ని" పాల వీరయ్య"గా గుంటూరు జిల్లా రైతాంగం పిలుచుకునేది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమలో విజయ పాల డైరీలు, ప్రైవేట్ దళారుల హావాకు అడ్డుకట్ట వేసిన ఘనత కూడా సంగం డెయిరీకి దక్కడంలో వీరయ్య ఆవిరాళమైన కృషి మరువలేనిది. తన పాలన దక్షతలతో జాతీయ స్థాయిలో పాల విప్లవ పితామహుడు కురియన్ గారిని సైతం మెప్పించిన వ్యక్తి వీరు.

సంగం డెయిరీలో వీరయ్య చౌదరి గారు నిర్వహించిన కార్యక్రమాలు గురించి విన్న ఎన్టీఆర్ 1982లో వీరయ్యను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన పూనాదులు నిర్మించారు. ఎన్టీఆర్ అంతరంగాన్ని తెలిసిన అతి కొద్ది మంది నాయకుల్లో వీరు ఒకరు. టీడీపీ ఘనంగా నిర్వహించుకునే "మహానాడు"లలో భారీ ఎత్తున ఎద్దుల పోటీలు నిర్వహించిన ఘనత సైతం  వీరికే దక్కుతుంది.

ఎన్టీఆర్ కు వీరయ్య చౌదరి అంటే ఏంతో అభిమానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సహకార పాడి పరిశ్రమ వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఎన్టీఆర్ ను ఒప్పించి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య సంస్థకు వీరయ్య చౌదరి గారినే వ్యవస్థాపక అధ్యక్షుడుగా నియమించారు.

1985- 1989 వరకు సమాఖ్య అధ్యక్షుడుగా తనను నమ్మి బాధ్యతను అప్పగించిన ఎన్టీఆర్ నమ్మకాన్ని ఓమ్ము కానికుండా సమాఖ్య విజయవంతం అయ్యేందుకు ఏంతో కృషి చేశారు. సమాఖ్య ఛైర్మన్ గా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార పాడి పరిశ్రమల అభివృద్ధికి జాతీయ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించారు. పాడి రైతాంగానికి ఉచితంగా దాణా పంపిణీ, బోనస్ లు వంటి పలు సౌకర్యాలు వీరి హయాంలోనే కల్పించారు.

వీరయ్య చౌదరి హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు తర్వాత కాలంలో ఆ సంస్థ బలోపేతం కావడానికి దోహద పడింది. సమాఖ్య ద్వారా వీరు నిర్వహించిన కార్యక్రమాలు కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి "పాలవాళ్ళ ధూళిపాళ్ల" గా దగ్గరయ్యారు. సమాఖ్య ద్వారా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న విశాఖ డెయిరీ ప్లాంట్ విస్తరణకు నిధులు విడుదల చేశారు. ఆరోజు వీరయ్య గారు చేసిన సహాయం కారణం గానే విశాఖ డెయిరీ భారత దేశంలో ఉన్న ప్రముఖ పాల డెయిరీల్లో ఒకటిగా నిలిచిందని ఆ సంస్థ మాజీ ఛైర్మన్ స్వర్గీయ తులసీరావు గారు తెలిపారు.  

1983, 1985లలో పొన్నూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా వీరయ్య గారు పొన్నూరు, తెనాలి, బాపట్ల ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా కృషి చేశారు. రైతులకు సకాలంలో పంట రుణాలను మంజూరు చేయించడంతో పాటుగా, పంట కాల్వల అభివృద్ధి వంటి పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చిన ఆయనకు స్వచ్ఛందంగా జిల్లా ప్రజలు నిర్వహించిన బ్రహ్మాండమైన సన్మాన సభ గురించి ఇప్పటికి మాట్లాడుకుంటారు.

1992లో దేశవ్యాప్తంగా జరిగిన బాబ్రీ మసీదు ఘర్షణల నేపథ్యంలో కొందరు అల్లరి మూకలు గుంటూరు జిల్లాలో సైతం ఘర్షణలు సృష్టిస్తూ ఉన్న సమయంలో ప్రజల రక్షణ కోసం ఆ మూకలు చేసిన హెచ్చరికలు సైతం బేఖాతరు చేస్తూ వీరయ్య చౌదరి గారే స్వయంగా అమాయక ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆరోజు ఆయన చూపిన తెగువ కారణంగానే జిల్లాలో ముఖ్యంగా పొన్నూరు, తెనాలి, బాపట్ల ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలతో పోయాయి.

వీరయ్య చౌదరి అద్భుతమైన వక్త. ఆయన అనర్గళమైన ప్రసంగాలు అందరిని ముఖ్యంగా ఎన్టీఆర్ ను సైతం విశేషంగా ఆకట్టుకునేది. రాష్ట్ర రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం సొంత ప్రభుత్వంపైనే రాజీ లేని పోరాటాలు చేశారు.

రాజకీయాల్లో వీరయ్య చౌదరి ది అరుదైన వ్యక్తిత్వం. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రాజకీయాల్లో అజాత శత్రువుగా అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా వారి అభిమానాన్ని పొందారు. అవినీతి , బంధుప్రీతి , పదవుల కోసం వెంపర్లాడటం వంటి వాటికి చివరి వరకు ఆమడ దూరంగా నిలుస్తూ వచ్చారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతుల సంక్షేమం కోసం, సంగం డెయిరీ అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం అవిశ్రాంతంగా పనిచేసిన వీరయ్య చౌదరి ఆ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతం అయ్యారు కూడా. స్విట్జర్లాండ్ లోని ప్రఖ్యాత బాసెల్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ నికోలాయ్ కామినోవ్, భారతదేశంలో పర్యటించిన సమయంలో సహకార రంగంలో వీరి కృషిని గుర్తిస్తూ తాను రాసిన సహకార రంగ వ్యాసాల్లో, పుస్తకాల్లో వీరయ్య చౌదరి పేరును ప్రస్తావించారు.  

రాజకీయ ఉద్ధండుల పురిటి గడ్డ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎందరో గొప్ప గొప్ప నాయకులు కీలకమైన పాత్ర పోషించారు కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతాంగం అభివృద్ధి కోసం కృషి చేసిన అతి కొద్ది మంది ముఖ్య నేతల్లో ఒకరిగా వీరయ్య చౌదరి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన గతించి చాలా సంవత్సరాలు గడుస్తున్నా, తన మానసపుత్రిక సంగం డెయిరీ మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎందరో గ్రామీణ ప్రాంతాల రైతాంగ ఆర్థిక స్వావలంబనకు అండగా నిలుస్తూనే ఉంది.  
  
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com