నటసింహం..!

- June 10, 2024 , by Maagulf
నటసింహం..!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని తెలుగు నాట తిరుగులేని సూపర్  హీరోగా ఎదిగిన నటుడు నందమూరి బాలకృష్ణ. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. నేడు కోట్లాది అభిమానుల గుండెల్లో 'బాలయ్య' గా నిలిచిపోయిన నటసింహం నందమూరి బాలకృష్ణ  పుట్టినరోజు.

నందమూరి బాలకృష్ణ 1960, జూన్‌ 10వ తేదీన నటుడు ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు చెన్నైలో జన్మించారు. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ పూర్తి చేశారు. చిన్నతనం నుండి బాలకృష్ణ అంటే తారకరామారావుకు అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే బాలయ్యను గొప్ప నటుడిగా తీర్చిదిద్దాలని భావించేవారాయన. స్వయంగా ఎన్టీఆర్‌ ‘నా నటనకు వారసుడు బాలకృష్ణ’ అని ప్రకటించారంటే బాలయ్యపైనా.. ఆయన నటనపైనా ఎన్టీఆర్‌‌కు ఉన్న నమ్మకం అటువంటిదని తెలుస్తోంది.

తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే నటుడిగా మారాడు బాలకృష్ణ. 1974లో 'తాతమ్మ కల' చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘రౌడీ రాముడు’, ‘కొంటె కృష్ణుడు’ సినిమాల్లో ఎన్టీఆర్‌కు తమ్ముడి పాత్రలో నటించాడు బాలయ్య. తండ్రికి తమ్ముడిగా బాలకృష్ణ నటించిన తీరు, అప్పట్లోనే ప్రేక్షకుల్ని మెప్పించింది.ఎన్టీఆర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో అభిమన్యుడిగా నటించి ప్రశంసలు అందుకున్నాడు బాలయ్య. అంతేకాదు ‘సామ్రాట్‌ అశోక్‌' సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

80వ దశకంలో బాలకృష్ణ విజయవిహారం చేశారు. 'మంగమ్మగారి మనవడు'... ‘ముద్దుల మావయ్య‘ .. ‘సీతారామకల్యాణం’.. ‘అనసూయమ్మగారి అల్లుడు’ .. ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’ ఇలా భారీ విజయాలను ఆయన బాక్సాఫీసు దిశగా పరుగులు తీయించారు. ఈ సమయంలోనే ఆయనను అభిమానించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ నేపథ్యంలోని కథలు చేయాలంటే బాలకృష్ణనే చేయాలి అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయన పంచెకట్టి .. చేత ముల్లుగర్ర పట్టుకుని .. పల్లెటూరి బుల్లోడిగా పొలం గట్లపై నడిచాడంటే ఆ సినిమా హిట్ అనేసి చెప్పుకున్నారు.

ఎన్టీఆర్ మాదిరిగానే బాలకృష్ణ కనుముక్కుతీరు చక్కగా ఉంటుంది. అందువలన సాంఘికాలతో పాటు జానపద .. పౌరాణిక చిత్రాలకు కూడా ఆయన రూపం సెట్ అయ్యేది. అందువల్లనే ఆయన ‘భైరవద్వీపం’ .. ‘శ్రీకృష్ణార్జున విజయం’ .. ‘శ్రీరామరాజ్యం’ వంటి సినిమాలు చేయగలిగారు. మరోసారి ప్రేక్షకులకు జానపదాలను .. పౌరాణికాలను రుచి చూపించారు. ‘ఆదిత్య 369’ వంటి సైన్స్ ఫిక్షన్ లోను .. ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ వంటి హారర్ థ్రిల్లర్ జోనర్లలోను ఆయన ప్రయోగాలు చేశారు. ఇక టాలీవుడ్లో తన సమకాలిక హీరోల్లో ఎక్కువగా ద్విపాత్రాభినయం చేసింది ఆయనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బాలకృష్ణ మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ కి చేరువవుతూ వెళ్లారు. వాళ్లు ఆశించే అంశాలు తన సినిమాల్లో తప్పకుండా ఉండేలా చూసుకున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ సినిమాల్లో పవర్ఫుల్ డైలాగులు .. మసాలా దట్టించిన మాటలు ..  రొమాన్స్ తో కూడిన హుషారైన పాటలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఆయన కాస్త బొద్దుగా ఉన్నా చాలా ఫాస్టుగా స్టెప్స్ వేసేవారు .. ఫైట్స్ లో కూడా అదరగొట్టేసేవారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుబాటుదారుడిగా విలన్ల గుండెల్లో అలజడి రేపిన బాలకృష్ణ, ఆ తరువాత సినిమాల్లో ఫ్యాక్షన్ లీడర్లకు కూడా నిద్రలేకుండా చేశారు.

తెలుగు తెరపై ఫ్యాక్షన్ కథలకు బాలకృష్ణ పెద్ద దిక్కుగా నిలిచారు. చాలామంది హీరోలు ఈ జోనర్లో సినిమాలు చేసినప్పటికీ, బాగా సెట్ అయింది మాత్రం బాలకృష్ణకే. ‘సమరసింహారెడ్డి’ .. ‘నరసింహనాయుడు’ ... 'చెన్నకేశవరెడ్డి' ... 'వీరసింహారెడ్డి' వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలు. ఫ్యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ కోటపై బాలకృష్ణ తన జెండాను రెపరెపలాడించారు. ‘సింహా’ .. ‘లెజెండ్’... 'అఖండ' ...  సినిమాలు సక్సెస్ పరంగాను, వసూళ్ల పరంగాను కొత్త రికార్డులను నమోదు చేశాయంటే, ఈ తరహా సినిమాల్లో బాలకృష్ణని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారనేది అర్థం చేసుకోవచ్చు.

బాలకృష్ణకి భారీ హిట్లు ఇస్తూ ఆయన కెరియర్ ను ప్రభావితం చేసిన దర్శకులుగా రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి .. కోడి రామకృష్ణ .. బి.గోపాల్ కనిపిస్తారు. బాలకృష్ణ సినిమాల నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని గ్రహించి, ఆ పల్స్ పట్టుకుని ఆయన స్టార్ డమ్ ను అంతకంతకూ పెంచుతూ వెళ్లారు. క్రమంగా బాలకృష్ణ సినిమా అంటే భారీతనానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆయన పేరు మాస్ ఆడియన్స్ కి మంత్రంలా మారిపోయింది. సీనియర్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపే బాలకృష్ణ, ఇటీవల కాలంలో మాత్రం యువ దర్శకులతో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం.

కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి బాలకృష్ణ ఎక్కడా గ్యాప్ ఇచ్చిన సందర్భాలు కనిపించవు. తన తాజా చిత్రం ఘన విజయాన్ని సాధించినా .. పరాజయంపాలైనా ఆ తరువాత సినిమా వెంటనే పట్టాలు ఎక్కవలసిందే. సినిమాకి .. సినిమాకి మధ్య ఆయన ఎక్కువ సమయం తీసుకునేవారు కాదు. కథా చర్చల పేరుతో విషయాన్ని నాన్చడం ఆయనకి అలవాటులేని పని. ఒకసారి ఓకే అనేసిన తరువాత ఆయన దర్శకుడికి సంబంధించిన పనుల్లో జోక్యం చేసుకునేవారు కాదు. సెట్లో క్రమశిక్షణతో లేకపోతే సహించేవారు కాదు.

ఇలా జానపద, పౌరాణిక, సోషల్‌, కమర్షియల్‌, ఫ్యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలయ్య. ఇప్పుడున్న నటుల్లో పౌరాణిక, సాంఘికం, జానపదం, సైన్స్‌ఫిక్షన్‌ ఇన్ని జానర్లను టచ్‌ చేసిన ఏకైక హీరో బాలకృష్ణ. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. భవిష్యత్తులో చెంఘీజ్‌ఖాన్‌, గోన గన్నారెడ్డి వంటి చారిత్రత్మక పాత్రల్లో నటించాలనేది బాలయ్య కోరిక.

బాలకృష్ణ ఆధ్యాత్మికంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులు. స్వామి వారి శ్లోకాలు, పద్యాలను నిరంతరం అవలీలగా చెప్పగల నటుడు బాలయ్య. సింహా పేరు ఆయనకు బాగా సెంటిమెంట్. ఆయన హీరోగా నటించిన సింహా పేరున్న సినిమాలు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'లక్ష్మీనరసింహా', 'సింహా', 'వీరసింహారెడ్డి' బంపర్ హిట్ అయ్యాయి.

తన తరం నటుల్లో చిరంజీవి తర్వాత 100+ సినిమాలు చేసిన ఓ అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక సినిమాల్లో డ్యుయల్ రోల్లో నటించిన రికార్డు బాలయ్య పేరిటే ఉంది. ఆయన కెరీర్లో ఇప్పటిదాకా 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం పాత్ర పోషించారు. కాగా, 'అధినాయకుడు'లో త్రిపాత్రాభినయంగా కనిపించారు.

బాలకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశీలి. నటనతోనే కాదు ఆయన గాయకుడిగా, బుల్లితెర యాంకర్‌గా, నిర్మాతగా రాణించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ NBK’ షోతో యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి అదుర్స్‌ అనిపించుకున్నాడు. బాలయ్య టాక్‌ షో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న వారంతా షాక్‌ అయ్యేలా షోని టాప్‌ షోగా నిలిపారు.  నిర్మాతగా NBK ఫిలిమ్స్‌ బ్యానర్‌ స్థాపించి ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’,‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ సినిమాలు నిర్మించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పైసా వసూల్‌' సినిమాలో 'మామా ఏక్‌ పెగ్‌ లా' పాటను పాడి అభిమానులను ఉర్రూతలూగించారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెరమీద విభిన్నమైన పాత్రలు పోషించిన బాలయ్య పలు ప్రతిష్ట్మాక అవార్డులను అందుకున్నారు.  నరసింహనాయుడు (2001), సింహా (2010), లెజెండ్‌ (2014) సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 'నంది' అవార్డులు అందుకున్నారు.

నటుడిగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బాలయ్య, పాలిటిక్స్లోనూ అదరగొట్టేస్తున్నారు. తన తండ్రి స్థాపించిన తెలుదేశం పార్టీ తరుపున ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా 2014, 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

బాలకృష్ణ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తన తల్లి స్మారకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన  క్యాన్సర్ చికిత్సను అందించడమే కాకుండా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు వరకు సుమారు 3 లక్షల వరకు క్యాన్సర్ రోగులకు ఈ హాస్పిటల్ నుండి చికిత్స అందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన అనేక విపత్తుల సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తన్ని కలుపుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవే కాకుండా అయన  అభిమానులు సైతం పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ స్థానం విశిష్టమైంది. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా వెలుగొందుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే తన స్వయం కృషి, క్రమశిక్షణతో అంచలంచెలుగా ఎదుగుతూ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు. విలువుల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజాహృదయాల్ని గెలుచుకున్నారు. 
  
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com