సినిమా రివ్యూ: ‘మహారాజా’

- June 14, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మహారాజా’

తమిళ హీరో విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుందంటే అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలే. కమర్షియల్ టచ్‌తో సంబంధం లేకుండా. కేవలం ఆయన కోసమే ఆయన నటించిన సినిమాలు చూస్తుంటారు తెలుగు ఆడియన్స్. విజయ్ సేతుపతి సినిమా అంటే ఖచ్చితంగా అందులో ఏదో కొత్త విషయం వుంటుందనే.! అలా ఆయన నుంచి తాజాగా వచ్చిన చిత్రం ‘మహారాజ’. మరి ఈ సినిమా ద్వారా విజయ్ సేతుపతి చెప్పిన కొత్త విషయమేంటో సినిమా ఎంత మేర ఆసక్తిగా వుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ సెలూన్ షాప్ రన్ చేస్తుంటాడు. ఆయనకు భార్య (అభిరామి), కూతురు జ్యోతి వుంటారు. ఓ యాక్సిడెంట్‌లో తన భార్య చనిపోతుంది. ఓ ఇనుప చెత్తబుట్ట మీద పడడంతో కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. అప్పటి నుంచీ తన కూతురు.. కూతురు ప్రాణాలతో వుండడానికి కారణమైన ఆ చెత్తబుట్టే ప్రాణంగా విజయ్ సేతుపతి బతుకుతుంటాడు. ఈ లోగా కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ చెత్త బుట్టను ఎవరో దొంగిలించేస్తారు. దానికోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేస్తాడు మహారాజా. తన కంప్లయింట్‌ని అపహాస్యం చేస్తూ పోలీసులు తన్ని తరిమేస్తారు. కానీ, దాని కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి అంతకు మించి ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు మహారాజా. దాంతో, ఇష్టం లేకపోయినా పోలీసులు ఈ కేస్‌ని సీరియస్‌గా తీసుకుంటారు. ఈ క్రమంలో అనేక రకాల నమ్మలేని నిజాలు, థ్రిల్లింగ్ అంశాలూ బయటికి వస్తుంటాయ్. అసలు ఆ చెత్త బుట్ట కథేంటీ.? అన్నట్లు ఆ చెత్తబుట్టకి మహారాజ ‘లక్ష్మి’ అని పేరు పెట్టి భద్రంగా చూసుకుంటాడు. తన లక్ష్మిని వెతికి పట్టుకోవడానికి విజయ్ సేతుపతి ఏం చేశాడు.? మరోవైపు దొంగతనాలు, మర్డర్లు చేసే సెల్వం (అనురాగ్ కశ్యప్)తో విజయ్ సేతుపతికి లింకేంటీ.? చివరికి లక్ష్మి దొరికిందా.? కూతురు జ్యోతి ఏమైంది.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘మహారాజ’ సినిమా థియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు:
ముందుగానే చెప్పుకున్నాం కదా.. విజయ్ సేతుపతి సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వుంటుంది. అదే ఇంట్రెస్ట్ ఈ సినిమాలోనూ వుంది. కథ సింపుల్‌గానే చెప్పేసినా.. కథనం నడిచిన తీరు.. ఆ కథనానికి తగ్గట్లుగా విజయ్ సేతుపతి పర్‌ఫామెన్స్ ఫస్టాఫ్‌లో అమాయకంగా కనిపించే తండ్రిలా సెకండాఫ్‌లో అతి క్రూరంగా రివేంజ్ తీర్చుకునే తండ్రిగా తనదైన పర్‌ఫామెన్స్‌తో విజయ్ సేతుపతి ఇరగదీసేశాడు. కామెడీ సీన్లలో నవ్వించడమే కాదు, ఎమోషనల్ సీన్లలో ఖచ్చితంగా ప్రతీ ప్రేక్షకుడి చేతా కంట తడి పెట్టించేశాడు. అభిరామి, మమతా మోహన్ దాస్ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకున్నాయ్. మరో కీలకమైన పాత్ర అనురాగ్ కశ్యప్ కనిపించినంత సేపూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులకు స్పేస్ తక్కువే. ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు తమకున్న స్క్రీన్ స్పేస్‌లో. కానీ, ఇది విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో. అందులో నో డౌట్.!

సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడు నితిలన్‌కి ఇది తొలి చిత్రమే. కానీ, అద్భుతంగా తెరకెక్కించాడు. సింపుల్ కథనే తీసుకున్నాడు. కానీ, కథనంలోని ట్విస్టులు, విజయ్ సేతుపతి వంటి నటుడ్ని ఆయన హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులు మర్చిపోరు. భవిష్యత్తులో మంచి దర్శకుడు అనిపించుకోవడానికి నితిలన్‌కి ‘మహారాజ’ చిత్రం మంచి డెబ్యూ అవుతుందని చెప్పొచ్చు. మ్యూజిక్ విషయానికి వస్తే.. పాటలేమీ లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథను నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
విజయ్ సేతుపతి నటన, అబ్బురపరిచే స్ర్కీన్‌ప్లే, ఎమోషన్స్, ప్రేక్షకుడ్ని క్యూరియాసిటీతో కట్టి పడేయడం.. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థ్రిల్లింగ్ అంశాలు..

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో కొద్దిగా కన్‌ఫ్యూజింగ్, సాగతీత అనిపించిన అంశాలు,

చివరిగా:
సెకండాఫ్ కాస్త స్లోగా అనిపించినా, గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లకి ‘మహారాజ’ బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఓ సారి ధియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com