ఆదర్శ సామాజిక వేత్త..!
- June 15, 2024
ఆయన జగమెరిగిన సామాన్యుడు. కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి దాయకంగా నిలిచిన వ్యక్తి. అవినీతిపై అహింసా అస్త్రాన్ని సంధించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపకరించి అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మహాత్మా గాంధీజీ బోధించిన సిద్ధాంతాలను అనుసరిస్తూ గ్రామీణాభివృద్ధికి నడుం బిగించారు ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త పద్మ భూషణ్ అన్నా హజారే. నేడు అన్నా హజారే జన్మదినం.
అన్నా హజారే పూర్తి పేరు కిషన్ బాబూరావ్ హజారే. ముంబై లోని భింగార్ ఊరులో 1937 జూన్ 15 న జన్మించారు. ఇప్పుడు అన్నా హజారే కు 82 సంవత్సరాలు. నీళ్లు వృధా కాకుండా ప్రతి నీటి బొట్టును కాపాడు కోవాలని ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. వాటర్ షెడ్స్ కు ప్రాణం పోశారు. అంతే కాకుండా ప్రజా పోరాటాలకు హజారే ముందు వరుసలో ఉన్నారు. అవినీతి పోవాలని, సామాన్యులకు సమాచార హక్కు ఉండాలని ఆయన ఉద్యమించారు. పోరాటం చేస్తున్న వారికి వెన్నుదన్నుగా నిలిచారు.
దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించే వాడు. క్రమంగా తన స్వంత పూల దుకాణాన్ని ప్రారంభించాడు. తర్వాత భారతీయ సైన్యంలో ఎంపికయ్యాడు. నాగాలాండ్ లో పని చేసేటప్పుడు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్వామి వివేకానంద రాసిన పుస్తకం అన్నాను మార్చేసింది. మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే రచించిన పలు పుస్తకాలను చదివాడు.సైన్యం నుంచి స్వచ్ఛంద విరమణ చేసి స్వంత గ్రామానికి సేవ చేయడానికి తిరిగొచ్చాడు. ఆయన రాకతో గ్రామ స్వరూపమే మారి పోయింది. రాలేగావ్ సిద్ధిలో బడిని స్టార్ట్ చేసేందుకు ట్రై చేశాడు.
దీనికి సర్కార్ ఒప్పుకోక పోవడంతో అన్నా దీక్షకు దిగారు. గ్రామస్థులు హజారే వెనుక నిలుచున్నారు.1975 కి ముందు రాలేగావ్ సిద్ధి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. అన్నా ఎంటర్ అయ్యాక పల్లె ఆదర్శ గ్రామంగా మారింది. తన ఆలోచనలను, జనాన్ని భాగం పంచుకునేందుకు ఆలయ పునరుద్ధరణ ఉత్తమ మార్గంగా భావించాడు. ఇందు కోసం తన స్వంత డబ్బులను ఖర్చు చేశాడు. భూగర్భ జలాలను పెంచడం కోసం నీటి గట్టును నిర్మించాలని గ్రామస్తులను ఒప్పించాడు. నేల కోతను నివారించేందు కోసం అన్నా చర్యలు చేపట్టాడు. కొండవాలు, గ్రామం పొడవునా పచ్చిక, పొదలు చుట్టూ 3 లక్షల చెట్లను నాటించాడు.
అటవీకరణ, నీటి మడుగులు, భూగర్భ చెక్ డ్యామ్‌లు, సిమెంట్ చప్టాలను కీలక ప్రాంతాల్లో నిర్మించారు. జలవనరుల అభివృద్ధి కార్యక్రమాలు భారీ విజయాన్ని సాధించాయి, రైతులకు నీరు పుష్కలంగా అందడంతో అవకాశాలు పెరిగాయి. రాలేగావ్ గ్రామం బిందు, బై-వాల్వ్ సాగులో కూడా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసింది. బొప్పాయి, నిమ్మ, మిరప మొక్కలు నాటించారు. తృణధాన్యాలు, నూనె గింజలు, నీటిని తక్కువగా ఉపయోగించే కొన్ని రకాల వాణిజ్య పంటలను పెంచారు. ఇప్పుడు ఈ పల్లె స్వయం సమృద్ధిని సాధించింది. రోజుకు 80 లక్షల విలువైన ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది.
చాలా మంది వ్యవసాయదారులు గోధుమ ఉత్పత్తిని పెంచినందువల్ల, గ్రామ సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు, అదనపు గోధుమ పంట కలిగిన రైతులు 1983 లో ప్రారంభమైన ధాన్యం బ్యాంకుకు స్వచ్ఛందంగా ధాన్యం విరాళం ఇవ్వాలి.ధాన్యం లేని గ్రామస్థులు ఈ బ్యాంకు నుంచి ధాన్యాన్ని “అప్పు”గా తీసుకోవచ్చు. ఆహార అవసరాల కోసం ఏ గ్రామస్తుడూ డబ్బు అప్పుగా తీసుకోకుండా చెయ్యడమే దీని ఉద్దేశం. ధాన్యం బ్యాంకు నుంచి ధాన్యాన్ని రుణ రూపంలో ఇస్తారు, దీన్ని యువ బృందాలు పర్యవేక్షిస్తాయి. మనిషి పొంద వలసిన గొప్ప మిత్రులు చెట్లు. ఇవి పర్యావరణాన్ని శుభ్ర పర్చి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
దాదాపు నాలుగు లక్షల చెట్లు నాటి పెంచారు. గ్రామంలో పూర్తిగా మద్యాన్ని నిషేధించారు. మద్యంతో పాటు చుట్టలు, సిగరెట్లు, బీడీలు అమ్మడం లేదు. ప్రత్యామ్నాయ వృత్తిగా రాలెగావ్ లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించారు. కొత్త పశువుల కొనుగోలు, కృత్రిమ సంతాన సాఫల్యం ద్వారా ప్రస్తుతం ఉన్న పశు సంతతిని మెరుగు పరిచారు. పాల ఉత్పత్తి పెరిగింది. తక్కువ పాల దిగుబడిని ఇస్తున్న దేశవాళీ ఆవుల స్థానంలో సంకర జాతి ఆవులను ప్రవేశ పెట్టారు. పాడియావుల సంఖ్య కూడా పెరగ సాగింది. ఈ పాలను అహ్మద్ నగర్‌లోని సహకార పాల పరిశ్రమకు అందిస్తున్నారు.
కొన్ని పాలను బాలవాడి పిల్లలకు, పొరుగు గ్రామాల పిల్లలకు జిల్లా పరిషత్ నిర్వహించే బాలల పోషకాహార పథకం కింద ఇచ్చారు. పాల సొసైటీ ఒక మినీ ట్రక్కును, క్రషర్‌ను కొనుగోలు చేసింది. మినీ ట్రక్కులో అహ్మద్ నగర్‌కు పాల రవాణా చేయడంతో పాటు కూరగాయలు, ఇతర ఉత్పత్తులను నేరుగా అంగడికి తీసుకు పోవడానికి ఉపయోగించే వారు. ఆవిధంగా మధ్య దళారీలను తొలగించారు. పంటకోతల కాలంలో క్రషర్‌ను రైతులకు అద్దెకిచ్చే వారు. ఈరోజు రాలెగావ్ సిద్ధి పాల వ్యాపారంలో సంవత్సరానికి దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తోంది.
సామాజిక అడ్డంకులను రాలెగావ్ సిద్ధి గ్రామస్థులు బద్దలు గొట్టారు. అన్ని కులాల ప్రజలు కలిసి సామాజిక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పేదల పెళ్లిళ్లు గ్రామస్తులే చేస్తారు. గ్రామ సభనే కీలక పాత్ర పోషిస్తోంది. రాలెగావ్ సిద్ధి కుటుంబాలు ప్రతి సంవత్సరం అక్టోబరు 2న వార్షిక జన్మదినాన్ని జరుపుకుంటారు. వయో వృద్ధుడిని గ్రామ పితగా గౌరవిస్తారు. వయో వృద్ధురాలిని గ్రామ మాతగా పిలుస్తారు. గ్రామంలోని తన భూమిని అన్నా హజారే హాస్టల్ భవంతికి విరాళంగా ఇచ్చారు.
తన ఫించన్ డబ్బులను గ్రామ నిధికి ఇస్తున్నారు. ఆజన్మ బ్రహ్మచారి(Anna Hazare) అయిన అన్నా కొద్దిపాటి వ్యక్తిగత వస్తువులతో గ్రామ ఆలయంలో నివసిస్తున్నారు. పరమ నిస్వార్థ జీవితం నుంచి పెంపొందుతూ వచ్చిన నైతిక అధికారం ఆయనను గ్రామంలో తిరుగులేని నేతగా మార్చింది. జీవితమంతా పుట్టిన ఊరు అభివృద్ధి కోసం శ్రమించిన ఈ యోధుడు ఎందరికో ఆదర్శం.
ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే వివాహానికి దూరంగా ఉన్నారు. తన జీవితమంతా సామాజిక సమస్యలపై యుద్ధం చేస్తున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి అన్నా హజారే (Anna Hazare)పాటుపడ్డారు. తను చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ,1992 లో పద్మ భూషణ్ అవార్డు లతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 5 ఏప్రిల్ 2011 న లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని తేవాలని నిరవధిక నిరాహరదీక్ష చేపట్టారు. దేశమంతా అన్నాకు సంపూర్ణ మద్దతు లభించింది. అన్నాకు లభించిన ప్రజా మద్దతును చూసి అప్పటి యూపీఏ సర్కార్ దిగి రావడంతో దీక్ష విరమించారు.
-డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..
- ధోఫర్‌లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!
- ఇండియన్ ఎంబసీలో రమదాన్ సెలబ్రేషన్స్..వెల్లివిరిసిన సోదరభావం..!!
- దుబాయ్ సర్జన్ క్రెడిట్ కార్డ్ హ్యాక్..Dh120,000 ఖాళీ..!!